cloudfront

Advertisement


Home > Politics - Political News

ఇదీ పవన్‌ కొత్త రాజకీయం...!

ఇదీ పవన్‌ కొత్త రాజకీయం...!

రాజకీయాల్లో ఒక్కో పార్టీ అధినేతది ఒక్కో రకమైన శైలి. కొందరు గతంలో ఏ నాయకుడూ చేయనివిధంగా రాజకీయాలు చేస్తారు. ప్రతి నాయకుడు కొత్త రకం రాజకీయాలు చేయాలని అంటుంటాడు. పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి కొత్త రకంగా రాజకీయాలు చేస్తున్నారని అనుకోవాలి. 2014లోనే రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటికీ ఫుల్‌టైమ్‌ పాలిటిక్స్‌లోనే కొనసాగాలని ఈమధ్యనే నిర్ణయించుకున్నారు. 'పవన్‌ కళ్యాణ్‌ది భిన్నమైన రాజకీయం' అని తరచూ టీవీ ఛానెళ్ల చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటున్న జనసేన అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్‌ చెప్పాడు. కొంతకాలం క్రితం పవన్‌ నియిమించిన ఐదారుగురు అధికార ప్రతినిధుల్లో ఈయన ఒకరు.

అధికార ప్రతినిధి కాబట్టి టీవీల్లో పవన్‌ చర్యలను సమర్థిస్తూ మాట్లాడుతుంటారు. ఏ పార్టీ అధికార ప్రతినిధికైనా తప్పదు కదా. టీవీ చర్చల్లో పాల్గొనేవారు తమ పార్టీని, అధినేతను సమర్థించుకునే ప్రయత్నంలో ఏవేవో మాట్లాడుతుంటారు. వీరి సమర్థింపు వల్ల ఒక్కోసారి అధినేత పరువు పోయే ప్రమాదమూ ఉంది. పవన్‌ భిన్నమైన, కొత్తదైన రాజకీయం ఏమిటి? తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల్లో  ఒకాయన్ని తీవ్రంగా విమర్శిస్తూ, చీల్చిచెండాడుతూ, మరొకాయన్ని ఆకాశాకెత్తేసి తమరి పరిపాలన అద్భుతమంటూ ప్రశంసల జల్లు కురిపించడం. పవన్‌ తీవ్రంగా విమర్శించేది ఏపీ సీఎం చంద్రబాబునని, ప్రశంసించేది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌నని అందరికీ తెలుసు.

'ప్రస్తుత రాజకీయాలకు భిన్నంగా పవన్‌ కళ్యాణ్‌ రాజకీయం సాగుతోందనడానికి ఇదే నిదర్శనం' అని అద్దేపల్లి శ్రీధర్‌ అధినేత కొత్త రాజకీయం గురించి గొప్పగా చెప్పారు. నిజమే...పవన్‌ది కొత్త రాజకీయమే. ఇంకా చెప్పాలంటే జనాలకు అర్థంకాని రాజకీయం. తనకే అర్థంకాని రాజకీయం కూడా. జనసేన పార్టీ గుంటూరులో సభ నిర్వహించేవరకు చంద్రబాబుతో అంటకాగిన పవన్‌ ఆ సభలో ఒక్కసారిగా ఆయన మీద, కుమారుడి మీదా విరుచుకుపడి షాకిచ్చారు.  పవన్‌ కళ్యాణ్‌ మనోడే అనుకున్న బాబుకు ప్రత్యర్థిగా మారారు. నాలుగేళ్లు పార్ట్‌టైమ్‌ రాజకీయాలు చేసిన పవన్‌ ఫుల్‌టైమర్‌గా మారాక కూడా కొందరికి సరిగా అర్థంకావడంలేదు.

కేసీఆర్‌ను పొగడటం పవన్‌కు అలవాటు. ఎందుకో తెలియదు. ఆయనంటే భయమా? భక్తా? పవన్‌ సినిమా హీరోగానే ఉన్నట్లయితే కేసీఆర్‌ను ఎంత పొగిడినా చర్చనీయాంశం కాదు. కాని రాజకీయ పార్టీ పెట్టాక 'మీ పాలన బ్రహ్మాండం, అద్భుతం, అమోఘం' అని ప్రశంసించడం ఎందుకు? కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియచేయడానికి ప్రత్యేకంగా ఆయనింటికి వెళ్లి ప్రశంసించారు. బాబు కంటే కేసీఆర్‌ పరిపాలన బాగుందని మెచ్చుకుంటూ ఆయనకు ఆరు మార్కులు, ఈయనకు (బాబు) రెండు వేశానని చెప్పారు.

తెలంగాణలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉన్న పార్టీలు పవన్‌ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ఆలోచిస్తుంటే ఈయనమో స్తోత్రం చేస్తున్నారు. ఈయన ధోరణి చూశాక ప్రస్తుతం రాష్ట్రంలో ఎవ్వరూ జనసేన గురించి మాట్లాడుకోవడంలేదు. పవన్‌ కూడా ఎలాంటి కార్యక్రమాలు చేయడంలేదు. జనసేన టీఆర్‌ఎస్‌కు మిత్రపక్షంగా ఉండదలిస్తే ఆ విషయం స్పష్టంగా ప్రకటిస్తే బాగుంటుంది. తన మార్గం ఏమిటో తనకే తెలియకపోతే ఏం ప్రయోజనం?