cloudfront

Advertisement


Home > Politics - Political News

భూమి పూజ ఓకే.. ఇంతకీ భూమి ఎక్కడిది?

భూమి పూజ ఓకే.. ఇంతకీ భూమి ఎక్కడిది?

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అత్యంత ఖరీదైన ప్రాంతం అది. అక్కడ భూమి కొనాలంటే సామాన్యుడి వల్ల కాదు. అలాంటి ఏరియాలో ఏకంగా 2ఎకరాలు కొన్నారు పవన్. తన సొంత ఇంటికి భూమి పూజ చేశారు. అంతా బాగానే ఉంది. పవన్ లాంటి వ్యక్తి 2ఎకరాలు కొనడం పెద్ద సమస్య కాదని అంతా సర్దిచెప్పుకోవచ్చు. కానీ కాస్త లోతుగా ఆలోచిస్తే ఎలా సాధ్యం అనే ప్రశ్న పుట్టక మానదు.

"నా దగ్గర డబ్బులు లేవు. నా సిబ్బందికి జీతాలివ్వడమే నాకు కష్టం అవుతోంది." సరిగ్గా ఏడాది కిందట పవన్ అన్న మాటిది. పవన్ అప్పులకు సంబంధించి చూచాయగా పలు కథనాలు కూడా వచ్చాయి అప్పట్లో. కొన్ని ఆస్తులు అమ్మేసుకున్నానని స్వయంగా పవన్ కూడా ప్రకటించుకున్నారు. అలాంటి వ్యక్తి అమరావతి సమీపంలోని కాజా వద్ద 2ఎకరాలు ఎలా కొనగలిగారు?

ప్రస్తుతం కాజా సమీపంలో రియల్ ఎస్టేట్ బూమ్ పతాక స్థాయిలో నడుస్తోంది. మరీ ముఖ్యంగా మంగళగిరి నుంచి కాజా మధ్య ఇప్పుడు కొనడానికి భూమి లేదు. మొత్తం పచ్చనేతలు, బడా బాబుల చేతిలోకి ఎప్పుడో వెళ్లిపోయింది.

ఈమధ్యే అక్కడ టీడీపీ ఆఫీస్ కు శంకుస్థాపన జరిగింది. 2ఐటీ కంపెనీల ఏర్పాటుకు లోకేష్ కొబ్బరికాయ కొట్టారు. దగ్గర్లోనే పోలీస్ హెడ్-క్వార్టర్స్ కూడా ఉంది. నిర్మాత సి.కల్యాణ్ కు చెందిన భారీ కన్వెన్షన్ సెంటర్ ఉంది. కారు షోరూమ్స్ ఉన్నాయి. వీటికి తోడు బడా నిర్మాణ సంస్థలు అక్కడ ఖరీదైన అపార్ట్ మెంట్లు, విల్లాలు కడుతున్నాయి. అలాంటి స్థలంలో పవన్ కు 2ఎకరాలు ఎలా వచ్చింది.

మంగళగిరి, కాజా మధ్య ఎకరం 8 నుంచి 9కోట్లు ఉంది. తక్కువలో తక్కువగా లెక్కేసుకున్నా 2ఎకరాలకు 16కోట్లు అవుతుంది. ఇంత మొత్తం, హఠాత్తుగా పవన్ కు ఎక్కడ్నుంచి వచ్చింది. అడిగితే భగవంతుడి కృప అంటున్నారు. అభిమానులు ప్రేమతో ఇచ్చిన ఆస్తులంటున్నారు. ఇక్కడ అభిమానులంటే ఎవరు..? 16కోట్ల భారీ మొత్తం ఇచ్చే "అభిమానులు" పవన్ కు ఉన్నారా..?

పార్టీని విస్తరించడానికి, కేడర్ ను పోషించడానికి, సిబ్బందికి జీతాలివ్వడానికి తన దగ్గర తగినంత డబ్బు లేదని పదేపదే చెప్పే పవన్ కు దాదాపు 16కోట్లు ఎక్కడ్నుంచి వచ్చాయి. అది కూడా ఆ మొత్తంతో ఆయన తన కోసం, తన కుటుంబం కోసం ఇల్లు కట్టుకుంటున్నారు. అక్కడే పార్టీ ఆఫీస్ పెడతారా లేదా అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. (కొందరేమో పార్టీ ఆఫీస్ పెడతారని, కొందరు పెట్టరని అంటున్నారు.)

తన జీవితం తెరిచిన పుస్తకమని, తన ఆస్తులన్నీ ఇన్ కం ట్యాక్స్ అధికారులకు తెలుసని చెప్పే పవన్ కల్యాణ్.. ఈ 2ఎకరాల భూమిని ఎప్పుడు తీసుకున్నారు, ఎంతకు కొనుగోలు చేశారు లాంటి విషయాల్ని మాత్రం బయటపెట్టలేదు. నిజానికి పవన్ కు ఇక్కడ 2ఎకరాల స్థలం ఉందనే విషయం భూమిపూజ ముందు వరకు ఎవరికీ తెలియనే తెలీదు.