Advertisement

Advertisement


Home > Politics - Political News

పవన్ జెలసీ: ఈ మనిషి ఇక మారడంతే!

పవన్ జెలసీ: ఈ మనిషి ఇక మారడంతే!

సీఎం జగన్ ని చూస్తే పవన్ కల్యాణ్ కు జలసీ, అలాంటిలాంటి జలసీ కాదు.. మంత్రి కన్నబాబు మాటల్లో చెప్పాలంటే నాలాంటి వాళ్లు సీఎం కావాలి కానీ, జగన్ కు అసలా అర్హత ఎక్కడిది అనుకునే రకం. ఈ జలసీ పవన్ మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది, చేతల్లో మరీ స్పష్టంగా బయటపడుతోంది. పవన్ ట్విట్టర్ అకౌంట్ ని రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారికి ఈ విషయం క్లారిటీగా అర్థమవుతోంది.

ఇప్పటి వరకూ సీఎం జగన్ పై పవన్ చాలానే ట్వీట్లు పేలారు. కానీ ఏ ఒక్క చోట కూడా సీఎం అనే పదం వాడలేదు, వైసీపీ లీడర్ జగన్ రెడ్డి అని మాత్రమే ఆయన సంబోధించారు, సంబోధిస్తూ ఉన్నారు. అంటే జగన్ ని సీఎంగా గుర్తించేందుకు కూడా పవన్ కి మనసొప్పడం లేదు. కేవలం వైసీపీ లీడర్, జగన్ రెడ్డి అంటూ సెటైరిక్ గా మాట్లాడతారు, సీఎం జగన్ అని మాత్రం అనడం లేదు.

ఇదే పవన్, చంద్రబాబు విషయంలో అత్యంత వినయ విధేయతలు చూపించారు. గౌరవనీయులు సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటూ గతంలో పవన్ ట్వీట్లు మొదలయ్యేవి. చంద్రబాబుని విమర్శించిన రోజుల్లో కూడా ఆయనపై గౌరవం ఏమాత్రం తగ్గనీయలేదు జనసేనాని, హానరబుల్ సీఎం చంద్రబాబు అనేవారు.

ఈ గౌరవం చంద్రబాబుకే పరిమితం కాదు, ఇంకెవరిపై ట్వీటాలన్నా కూడా పవన్ గౌరవ సంబోధనలే వాడేవారు. అప్పటి కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామిని కలసిన సందర్భంలో కూడా హానరబుల్ సీఎం అంటూ ట్వీట్ చేశారు. అంతెందుకు తన పక్కరాష్ట్రమైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా ఆయన అత్యంత గౌరవం ఇస్తారు. పెద్దలు, గౌరవనీయులు లాంటి ఎన్నో ఉపమానాలు వాడతారు. తాజాగా కేసీఆర్ ను ఉద్దేశించి పవన్ చేసిన ట్వీట్ లో కూడా ఈ గౌరవ వాచకాలు కనిపిస్తాయి.

కానీ జగన్ విషయంలో మాత్రం ఎందుకో పవన్ కి కడుపు మంట. కనీసం సీఎం అని అనేందుకు కూడా ఆయనకి నోరు రావడంలేదంటే.. ఆ జలసీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వైసీపీ లీడర్, వైసీపీ లీడర్ అంటూ తన ఇగోని ట్వీట్ల ద్వారా చల్లార్చుకుంటున్నారు పవన్ కల్యాణ్. ఈరోజు కూడా పెట్టిన ఓ ట్వీట్ లో జగన్ రెడ్డి గారు అని సంభోదిస్తూ.. దానికి కొటేషన్స్ పెట్టి తన కడుపుమంట చల్లార్చుకున్నారు. ఓవైపు పవన్ వాడుతున్న ఈ పదప్రయోగంపై వైసీపీ నేతలు అతడికి గడ్డిపెట్టినప్పటికీ, జనసేనాని మాత్రం తన బుద్ధి మార్చుకోలేదు.

ఇంతకీ పవన్ కి జగన్ అంటే అంత కడుపు మంట ఎందుకో అర్థం కావడంలేదు. సినిమాల్లో తను పవర్ స్టార్ కావొచ్చు, ఎవరిపైన పడితే వారిపై జోకులు వేసుకోవచ్చు. కానీ ఇది రియల్ లైఫ్. వ్యక్తిగతంగా కాకపోయినా, వారి పదవులను బట్టి అయినా గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. మరీ అంత ఇష్టం లేకపోతే అసలు జగన్ ప్రస్తావన తేవడమే పవన్ కి అనవసరం. ప్రస్తావన తెచ్చి మరీ వైసీపీ లీడర్ అంటూ వెటకారంగా మాట్లాడటం ఏపాటి హుందా రాజకీయమో జనసేనానికే తెలియాలి.

ఇక అన్నింటికంటే పెద్ద కామెడీ ఏంటంటే... సొంత ముఖ్యమంత్రికి గౌరవం ఇవ్వని ఇదే జనసేనాని, మొన్నటికిమొన్న ఉపరాష్ట్రపతికి జగన్ తగిన గౌరవం ఇవ్వలేదంటూ గగ్గోలు పెట్టారు. గురివింద నీతులంటే ఇవేనేమో!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?