Advertisement

Advertisement


Home > Politics - Political News

పాత నియోజకవర్గానికే పవన్ కల్యాణ్ ఫిక్స్..?

పాత నియోజకవర్గానికే పవన్ కల్యాణ్ ఫిక్స్..?

భీమవరంలో 8వేల ఓట్ల తేడాతో, గాజువాకలో 16వేల ఓట్ల భారీ తేడాతో ఓడిపోయిన పవన్ కల్యాణ్ రెండోసారి ఆ రెండు నియోజకవర్గాలకు మొహం చూపించరని అనుకున్నారంతా. కానీ పవన్ కి మాత్రం విశాఖపై గట్టి నమ్మకం ఉన్నట్టుంది. అందులోనూ రాజధాని ప్రాంతం అవుతుందన్న ఆలోచన కూడా ఉంది కాబట్టే విశాఖ పరిధిలోని గాజువాకకే ఫిక్స్ అవ్వాలని పవన్ అనుకుంటున్నారట.

ఇటీవల కాస్త గ్యాప్ వచ్చినా, ఎన్నికలనాటికి దాన్ని భర్తీ చేసుకునే ఆలోచనలో ఉన్నారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతిస్తున్నానని చెప్పడం, త్వరలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతున్నామని చెప్పడం కూడా ఇందులో భాగమేనంటున్నారు.

గాజువాక, భీమవరం ఏది బెటర్..?

ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో నియోజకవర్గం అంటూ లేని నేతలు ఇద్దరే ఇద్దరు. ఒకరు నారా లోకేష్ అయితే మరొకరు పవన్ కల్యాణ్. మిగతా అందరూ తాము ఓడిపోయిన నియోజకవర్గాల్లో అయినా కనీసం పర్యటనలు చేస్తుంటారు, అక్కడివారిని పరామర్శిస్తుంటారు. విచిత్రంగా ఈ ఇద్దరు నేతలు ఓడిపోయిన తర్వాత ఆయా నియోజకవర్గాల మొహం కూడా ఇప్పటి వరకూ చూడలేదు.

లోకేష్ కి చివరిలో ఎవరో ఒకరు త్యాగం చేస్తారేమో కానీ, పవన్ పరిస్థితి అలా కాదు. ఇప్పటినుంచే ఒక నియోజకవర్గాన్ని ఫిక్స్ చేసుకుని అక్కడ పని మొదలు పెట్టాలి. ఎన్నికలనాటికి అక్కడ బలం, బలగాన్ని పెంచుకోవాలి. తాను రాష్ట్ర పర్యటనల్లో బిజీగా ఉన్నా తన తరపున అక్కడ ఎవరో ఒకరు గెలుపు బాధ్యత స్వీకరించాలి.

స్టీల్ ప్లాంట్ ఉద్యమం వేదికగా..

విశాఖలో ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రస్తుతం హాట్ టాపిక్. ప్రైవేటీకరణ అడ్డుకునేవారికి స్థానికులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు బేషరతుగా మద్దతిస్తున్నారు. తమ చేతిలో ఏమీ లేదని వైసీపీ అంటోంది, బీజేపీ ఆల్రెడీ తుది నిర్ణయం తీసుకుంది, టీడీపీ గోడమీద పిల్లి వాటంలా ఉంది. రాగా పోగా పవన్ కల్యాణ్ ఒక్కరే కాస్త ఉద్యోగల వైపు నిలబడేలా కనిపిస్తున్నారు.

అమరావతి అంశంలాగా దీన్ని కూడా కొన్నాళ్లు పవన్ పక్కనపెట్టినా, ఇప్పుడు నాదెండ్ల మనోహర్ అక్కడ హడావిడి చేస్తున్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం జరుగుతున్న ఈ పోరాటాన్ని దేశం మొత్తం చూసేలా చేస్తామంటున్నారు నాదెండ్ల.

ఉక్కు పరిరక్షణ పోరాట సమితి, స్టీల్ ప్లాంట్ నిర్వాసితులతో జనసేన నాయకులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మద్దతు మీకెప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. త్వరలోనే పవన్ విశాఖ వస్తారని, ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతారని భరోసా ఇచ్చారు.

పవన్ కల్యాణ్ కి కూడా ప్రస్తుతం ఓ నియోజకవర్గం అవసరం. అందులోనూ తాను అవసరం అనుకుంటున్న గాజువాకకు, స్టీల్ ప్లాంట్ కి అవినాభావ సంబంధం ఉంది. అందుకే పవన్ విశాఖ ఉక్కు ఉద్యమంలో ప్రత్యక్షంగా దిగేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. పవన్ కొత్త రాజకీయ ప్రయత్నం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?