cloudfront

Advertisement


Home > Politics - Political News

అన్నకి గంజి తెలుసు.. తమ్ముడికి మట్టి వాసన తెలుసు

అన్నకి గంజి తెలుసు.. తమ్ముడికి మట్టి వాసన తెలుసు

నాకు గంజి తెలుసు, బెంజి కూడా తెలుసు.. ప్రజారాజ్యం పార్టీ ప్రచారంలో చిరంజీవి ఫేమస్ డైలాగ్ ఇది. గంజీ బెంజీ రెండూ తెలుసు, అటు పేదరికాన్నీ చూశాను, ఇటు సినిమా వైభోగాన్నీ చూశాను.. అంటూ పేదల కష్టాలను తీర్చడానికే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకొచ్చేవారు చిరంజీవి. అయితే గంజి తెలుసన్నాడే కానీ బెంజి అలవాటు పడ్డాక గంజి జోలికి పోవాల్సిన అవసరం ఆయనకు రాలేదు. అందుకే బెంజి రేంజ్ నుంచి బైటకు రాలేకపోయారు, ప్రజారాజ్యం కూడా అన్ని రాజకీయ పార్టీల్లాగే మారిపోయింది. చివరకు కాంగ్రెస్ మహాసముద్రంలో కలిసిపోయింది.

ఇక తమ్ముడి విషయానికొస్తే.. తన ప్రతి పర్యటనలోనూ సాధారణ కానిస్టేబుల్ కొడుకుగా పేదరికం నుంచి వచ్చానని చెప్పుకుంటున్నారు పవన్ కల్యాణ్. తాజాగా బీసీ సంఘాలతో జరిగిన సమావేశంలో ఆయన తనకు మట్టివాసన తెలుసునంటూ చెప్పారు. లెక్కలు వేసుకుని రాజకీయాల్లోకి రాలేదని, బాధ్యతతో వచ్చానని అన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టే రాజకీయ పార్టీలకు గుణపాఠం చెప్పాలన్నారు.

అంతా బాగానే ఉంది. మట్టివాసన అందరికీ తెలుసు.. మధ్యతరగతి, పేద ప్రజలంతా మట్టితో ఆడుకున్నావాళ్లే, అక్కడ పెరిగిన వాళ్లే. అయితే మట్టి వదిలి బంగారు పంజరంలోకి వెళ్లిన సినిమావాళ్లు ఎంతమంది తిరిగి ఆ పేదరికాన్ని ఆస్వాదించగలరు. ఆ మాటకొస్తే పేదల్ని ఎంతమంది అక్కున చేర్చుకోగలరు. ఈ విషయంలో మాత్రం పవన్ కల్యాణ్ కి ఇతర స్టార్స్ కి తేడా స్పష్టంగా కనిపిస్తుంది. అన్న చిరంజీవి ఫుల్ మేకప్ వేసుకుంటే కానీ ప్రచార రథం ఎక్కేవారు కాదు, క్రాఫ్ చెరిగిపోకుండా ఎప్పుడూ గాలివాటం చూసుకుంటూ ప్రసంగించేవారు.

తమ్ముడు పవన్ కల్యాణ్ మాత్రం భేషజాలకు పోలేదు. మేకప్, డ్రస్సింగ్, హెయిర్ స్టైల్ ఇలా కొన్ని విషయాల్లో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ని గుర్తుకు తెస్తారు పవర్ స్టార్. సహజంగా ఉండటానికే ప్రయత్నిస్తారు, తన దగ్గరకు వచ్చే బీదాబిక్కీ అందరినీ అక్కున చేర్చుకుంటారు, ఆప్యాయంగా మాట్లాడతారు.

మరి ఈ సహజత్వం, సమన్యాయం పదవులు దక్కిన తర్వాత కూడా ఉంటాయా? ఒక్కసారి పదవి రుచి తగిలితే.. ఇక సామాన్యుడి గోడు వీరికి పట్టే అవకాశం ఉందా? మట్టివాసన తెలుసుని చెబుతున్న పవన్ కల్యాణ్ ప్రస్తుతానికి మాత్రం అందరివాడిలానే ఉన్నారు. మరి రాజకీయ కిరీటం నెత్తికెక్కితే ఆయన కొందరివాడిగా మారిపోతారేమో.

అన్నయ్య చిరంజీవిలానే సినిమా డైలాగులు కొడుతున్న తమ్ముడు పవన్.. ఎన్నికల తర్వాత అన్న దారిలో నడుస్తాడా..? లేక ప్రస్తుతం చెబుతున్న మాటలకు తగ్గట్టు నిలబడతాడా అనేది వేచిచూడాలి.