cloudfront

Advertisement


Home > Politics - Political News

పాపం పవన్: లోకేష్ తో పెట్టుకున్నాడు

పాపం పవన్: లోకేష్ తో పెట్టుకున్నాడు

ఎన్ని తిట్లు తిట్టినా పడతాను. 
ఎన్ని విమర్శలైనా భరిస్తాను. 
అన్నింటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాను. అవసరమైతే జైలుకు కూడా వెళ్తా.

జనసేన అధ్యక్షుడు పవన్ పదేపదే చెబుతూ వస్తున్న మాటలివి. కానీ అతడు ఆశించినట్టు ఇప్పటివరకు పవన్ కు పెద్దగా విమర్శలు ఎదురుకాలేదు. ఎందుకంటే అతడు చంద్రబాబుతో భుజం భుజం రాసుకొని తిరిగారు. కానీ ఇప్పుడు అదే చంద్రబాబుపై పవన్ రివర్స్ అయ్యారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజున టీడీపీ నేతలు, బాబుపై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు జనసేనానికి సిసలైన విమర్శల వేడి తెలుస్తుంది.

మొన్నటివరకు పవన్ ను విమర్శించే వాళ్ల లిస్ట్ లో కేవలం వైఎస్ఆర్సీ పార్టీ నేతలు మాత్రమే ఉన్నారు. వాళ్లు చేసే కామెంట్స్ కూడా సహేతుకంగా ఉండేవి. పైగా అలాంటి విమర్శల్ని బాబు అనుకూల మీడియా తొక్కిపెట్టేది. కాబట్టి పవన్ పై అది పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ ఇప్పుడు పవన్ పై బాబు మాత్రమే కాదు, పచ్చమీడియా మొత్తం గురిపెట్టడం ఖాయం. ఈసారి ఆ వేడిని తట్టుకొని పవన్ నిలబడగలడా అనేది ప్రశ్న.

తనను ఏమైనా అంటే పడతారేమో కాని, తన సుపుత్రుడు లోకేష్ జోలికొస్తే మాత్రం అస్సలు సహించరు చంద్రబాబు. లోకేషుడిపై ఈగ వాలినా సహించరు. అతడు ముద్దపప్పు కావొచ్చు. ఆ విషయం చంద్రబాబు అంతరాత్మకు తెలుసు. కానీ లోకేష్ ను అంతా అపర మేధావిగా, సచ్చీలుడిగా కీర్తించాలనేది బాబు కోరిక. అలాంటి లోకేష్ ను నానా మాటలన్నారు పవన్. అవన్నీ నిజాలే కావొచ్చు. కానీ బాబుకు నిజాలు రుచించవు కదా. ఆ విషయం నాలుగేళ్లుగా బాబుతో దోస్తీ కట్టిన పవన్ కు తెలియదని అనుకోలేం.

సో.. జనసేనానికి అసలైన సెగ ఇప్పుడు మొదలైంది. ఇప్పటికే టీడీపీ సోషల్ మీడియా యాక్టివ్ అయింది. పవన్ కార్టూన్లు, పంచ్ లతో సిద్ధమైపోయింది. అటు తెలుగుదేశం నేతలు కూడా ఒక్కొక్కరుగా పవన్ పై దండయాత్ర షురూ చేశారు. బాబు నుంచి పూర్తిస్థాయిలో ఆదేశాలు అందితే ఇక ఆ రెండు ఛానెళ్లు, ఆ రెండు పత్రికల్లో పవన్ కు పోస్టుమార్టమే. 

ఇదంతా పవన్ టీడీపీకి కటీఫ్ చెప్పినందుకు కాదు, టీడీపీ నేతల్ని నానా మాటలు అన్నందుకు అంతకంటే కాదు. కేవలం లోకేష్ ను అవినీతిపరుడు అన్నందుకు మాత్రమే. మరికొన్ని గంటల్లో అనుకూల మీడియాలో 'పవన్ పై పోరాటం పార్ట్-1' చూడబోతున్నాం. గెట్ రెడీ.