Advertisement

Advertisement


Home > Politics - Political News

పెను ఉప్పెనగా మారుతున్న ఆర్టీసీ సమ్మె!

పెను ఉప్పెనగా మారుతున్న ఆర్టీసీ సమ్మె!

ఓ యాభై వేల మంది కార్మికులున్న తెలంగాణ ఆర్టీసీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. తెలంగాణలోని అధికార పార్టీ ఇమేజ్‌ని దారుణంగా దెబ్బతీస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇంతటి తీవ్రమైన ఉద్యమం ఇటీవలి కాలంలో పుట్టుకొచ్చింది లేదు. గతంలో కోదండరామ్‌ నేతృత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ముంపు బాధిత రైతులు ఆందోళన తీవ్ర రూపం దాల్చినా.. ఆ తర్వాత కేసీఆర్‌, ఆ వ్యవహారాన్ని జాగ్రత్తగా డీల్‌ చేయగలిగారు.

హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో కాస్త ఆచి తూచి వ్యవహరిస్తున్న కేసీఆర్‌, పోలింగ్‌ పూర్తవగానే విశ్వరూపం చూపించబోతున్నారనే సంకేతాలు బయటకొస్తున్నాయి. మరోపక్క, కేసీఆర్‌ ఏ స్థాయిలో ఆలోచనలు చేసినా, అంతకు మించి తమ ఉద్యమం వుంటుందని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. 'ఉద్యమంలో మీతో కలిసి పనిచేశాం. ఆ మాటకొస్తే, టీఆర్‌ఎస్‌ ఎజెండాని పట్టుకుని పని చేశాం. అంతలా మీ వెనుకాల నడిచినందుకు మా మీద కక్ష సాధింపు చర్యలకు దిగుతారా.? మమ్మల్ని అవమానిస్తారా.? మేం మీ బిడ్డల్లాంటోళ్ళం కాదా.? జీతాల్ని ఆపేయడమేంటి.? సెల్ఫ్‌ డిస్మిస్‌ అయ్యారంటూ ఎగతాళి చెయ్యడమేంటి.?' అని ఉద్యమ నేత అశ్వధ్ధామరెడ్డి తాజాగా ఓ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ ఉద్యమం కూడా అణచివేతలతోనే ఉధృత రూపం దాల్చింది. ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె కూడా, తెలంగాణ సమాజం మొత్తాన్నీ ఆలోచింపజేస్తోందని అనుకోవచ్చేమో. లేకపోతే, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన సమ్మె ఇంతలా విజయవంతమవడమా.? ముందు ముందు, కేసీఆర్‌కి రాజకీయంగా గడ్డు పరిస్థితులు సుస్పష్టంగా కన్పిస్తున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే, కేసీఆర్‌ మొండి వైఖరి కారణంగా.. తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నాటి పరిస్థితులు.. ఆ కారణంగా అస్థిర వాతావరణం.. తెలంగాణ అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాల్లేకపోలేదు.

ఆర్టీసీ సమ్మె తో కేసీఆర్ పతనం మొదలైందా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?