cloudfront

Advertisement


Home > Politics - Political News

మళ్లీ కదలిక వచ్చింది... కథ ఏమవుతుందో..!

మళ్లీ కదలిక వచ్చింది... కథ ఏమవుతుందో..!

చాలాకాలం తరువాత మళ్లీ పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏపీలో టీడీపీ మళ్లీ వైకాపా ఎమ్మెల్యేల్లో ఎవరినైనా లాక్కుందా? అలాంటిదేమీ లేదు. ఇప్పటికే పార్టీ ఫిరాయించిన 22 మంది ఎమ్మెల్యేలకు ఉమ్మడి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. టీడీపీలో చేరిన వైకాపా ఎమ్మెల్యేలను అనర్హులను చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు వేసిన పిటిషన్‌ను (ప్రజాప్రయోజన వ్యాజ్యం) హైకోర్టు విచారణకు స్వీకరించింది. 

వెంటనే 22మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలు వాయిదా వేసింది. ఈలోగా ఎమ్మెల్యేలు నోటీసులకు సమాధానం ఇవ్వాల్సివుంటుంది. ఫిరాయింపుదారుల్లో ఎన్‌.అమర్‌నాథ రెడ్డి, సుజయకృష్ణ రంగారావు, ఆదినారాయణ రెడ్డి, భూమా అఖిలప్రియ మంత్రి పదవులు పొందారు. వారి మంత్రి పదవులు రద్దు చేయాలని కూడా పిటిషనర్‌ కోరారు. కేసు తేలేంతవరకు ఫిరాయింపుదారులు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా కొనసాగకుండా ఆదేశించాలని అభ్యర్థించారు.

వైకాపా గతంలోనూ కోర్టులో పిటిషన్‌ వేసింది. తెలంగాణలో కాంగ్రెసు, టీడీపీ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరిన తమ పార్టీల ఎమ్మెల్యేలను అనర్హులను చేయాలని పిటిషన్లు వేశారు. అయినప్పటికీ ఇప్పటివరకు కథ ముందుకు సాగలేదు. 2016 నవంబరులో వైకాపా ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ వేసినప్పుడు అప్పట్లో పార్టీ ఫిరాయించిన 20 మంది ఎమ్మెల్యేలకు కోర్టు నోటీసులు జారీచేసింది.

అసెంబ్లీ స్పీకర్‌ అధికార పార్టీ ఏజెంటులా వ్యవహరిస్తూ ఫిరాయింపుల వ్యవహారం పట్టించుకోవడంలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ సమయంలో అడ్వొకేట్‌ జనరల్‌ వాదిస్తూ ఫిరాయింపుల కేసు సుప్రీం కోర్టులో పెండింగులో ఉన్నందున విశ్వేశ్వరెడ్డి పిటిషన్‌ విచారణకు స్వీకరించొద్దని కోర్టును కోరారు. అయినప్పటికీ కోర్టు పిటిషన్‌ను విచారణకు స్వీకరించి నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఫిరాయింపుదారులను ఆదేశించింది. తరువాత ఈ కేసు వివరాలు తెలియలేదు.

 ఇప్పుడు హైకోర్టు కేసు విచారణకు స్వీకరించడం శుభపరిణామమని చెప్పొచ్చు. రాజీనామాలు చేయించకుండా ప్రతిపక్షం ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడమే తప్పు. వారిని అనర్హులను చేయాలని ఇచ్చిన పిటిషన్‌లను స్పీకరు చేత పెండింగులో పెట్టించడం ఇంకో తప్పు. ఫిరాయింపుదారుల్లో పలువురికి మంత్రి పదవులు ఇవ్వడం మరీ పెద్ద తప్పు. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన కిడారి గణేశ్వరరావుకు అసెంబ్లీలో విప్‌ పదవి ఇచ్చారు. ఎప్పటిమాదిరిగానే ఫిరాయింపుదారుకు విప్‌ పదవి ఇవ్వడమేంటని వైకాపా నాయకులు గొంతు చించుకున్నారు.గొంతు చించుకున్నా, చొక్కాలు చింపుకున్నా బాబు వైఖరిలో మార్పు ఉండదు కదా.

బాబుకు  ఫిరాయింపుల దాహం ఇంకా తీరలేదు. వైసీసీ ఎమ్మెల్యేలను ఇంకా చేర్చుకోవాలని తాపత్రయపడుతున్నారు. జగన్‌ పాదయాత్ర చేస్తానని ప్రకటించగానే యాత్ర పూర్తయ్యేలోగా ఆ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే ఉండరని టీడీపీ నాయకులు అన్నారు. ఈరోజు చంద్రబాబు అనైతిక చర్యలకు పాల్పడి వైకాపాను బలహీనం చేశారు కాబట్టి, రేపు జగన్‌ అధికారంలోకి వస్తే ఇదే పని చేయరనే గ్యారంటీ ఏముంది? ఇది ప్రజాస్వామ్య దేశం కదా.

బాబు తన పార్టీ నాయకుల అవినీతికి మద్దతు (చర్యలు తీసుకోకపోవడం మద్దతు ఇచ్చినట్లే కదా) ఇస్తున్నారు. చూసీచూనట్లు వదిలేస్తున్నారు. క్రిమినల్‌ కేసులు కొట్టేయించారు. అవినీతిపరులపై చర్యలు తీసుకోకపోవడం కూడా అవినీతే కదా. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు దాడి కేసులో భీమడోలు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించినప్పటికీ చంద్రబాబు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.

అతన్ని ఎమ్మెల్యే పదవికి అనర్హుడిని చేయాలని స్పీకర్‌ను కోరినా స్పందన లేదు. రాజ్యాంగం ప్రకారం జైలు శిక్ష పడిన ప్రజాప్రతినిధి అనర్హుడవుతాడు.  ఓటుకు నోటు కేసు చూశాం. గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగి ముప్పయ్‌మంది చనిపోయిన ఘటనలో, మొన్నీమధ్య కృష్ణా నదిలో జరిగిన బోటు బోల్తాపడి ఇరవైమందికి పైగా మరణించిన ఘటనలోనూ బాధ్యలకు శిక్షలు పడని పెడ పోకడలను చూస్తున్నాం. ఇదంతా ప్రజాస్వామ్యం మహత్మ్యం.

దేశంలోనే సీనియర్‌ నాయకుడైన చంద్రబాబు తెగింపు ధోరణి గురించి చెప్పాలంటే ఎంతో ఉంది. హత్య చేసేవాడికి మొదటిసారి భయముంటుంది. ఆ తరువాత ఆ భయం పోయి హత్యలు చేయడం అలవాటుగా మారుతుంది. చంద్రబాబు ఏమాత్రం భయం లేకుండానే తప్పులు చేయడం మొదలుపెట్టారు. కాబట్టి ఏ తప్పుకూ భయపడే ప్రసక్తే లేదు. తప్పు చేసినందుకు శిక్ష లేదుగా మరి.