cloudfront

Advertisement


Home > Politics - Political News

జనాల్ని తోసుకుంటూ వెళ్లిపోయిన జనసేనాని

జనాల్ని తోసుకుంటూ వెళ్లిపోయిన జనసేనాని

ఓవైపు ప్రముఖులంతా క్యూలో నిల్చొని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఓటు వేసి వెళ్తుంటే.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాత్రం ప్రజల్ని నెట్టుకుంటూ పోలింగ్ స్టేషన్ లోకి వెళ్లిపోయారు. క్షణాల్లో ఓటు వేసి అట్నుంచి అటు ఇంటికెళ్లిపోయారు. 

ఈరోజు విజయవాడ పటమటలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటేయడానికి వచ్చారు జనసేనాని. పవన్ వెంట దాదాపు 10 మంది ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది వచ్చారు. వాళ్లంతా ఓటేయడానికి వచ్చిన జనాల్ని నెట్టేసి, నేరుగా పవన్ ను పోలింగ్ స్టేషన్ లోకి తీసుకెళ్లిపోయారు. దీంతో చాలామంది మహిళలు, వృద్ధులు ఇబ్బంది పడ్డారు. 

ఈరోజు చాలామంది ప్రముఖులు ఓటేశారు. కాకపోతే వాళ్లంతా సామరస్యంగా, ప్రజల్ని పలకరిస్తూ లోపలికి వెళ్లారు. చిరంజీవి లాంటి ప్రముఖులైతే క్యూలో నిల్చొని మరీ ఓటేశారు. కానీ పవన్ క్యూలో నిలబడలేదు సరికదా, భారీ భద్రత మధ్య నేరుగా లోపలికి వెళ్లిపోయారు. దీనిపై చాలామంది అసహనం వ్యక్తంచేశారు.

అయితే పవన్ తరఫు వ్యక్తులు మాత్రం దీన్ని వక్రీకరించే ప్రయత్నం చేశారు. పవన్ తో సెల్ఫీలు దిగేందుకు, షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రజలు ఎగబడ్డారట. దీంతో పోలింగ్ స్టేషన్ వద్ద గందరగోళం చెలరేగిందట. అందుకే భద్రత మధ్య పవన్ ను నేరుగా పోలింగ్ కేంద్రం లోపలికి తీసుకెళ్లిపోయారట.