cloudfront

Advertisement


Home > Politics - Political News

ప్రజల్లో మేరానామ్‌ జోకరయ్యారు

ప్రజల్లో మేరానామ్‌ జోకరయ్యారు

ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందని అప్పుడెప్పుడో పెద్దలు చెప్పారు. దాన్ని ఇప్పుడు నిజం చేయాలనే తలంపులో ఏపీని మూడుసార్లు ఏలిన చంద్రన్న కంకణదారుడయ్యారు. తలాతోకాలేని పార్టీలతో, తలా తోకా ఉన్న నేతలతో భుజాలు కలిపి గుజరాత్‌ సీఎం నరేంద్రమోదీ పీఎం కాగా లేనిది మనం కాలేమా అనేవాదాన్ని అందరి చెవుల్లో దూరి చెప్పేపనిలో యమబిజీగా ఉన్నారు. అందులో కూడా బాబు చల్లకొచ్చిముంత దాయడమెందుకు అని తన ఖాళీ ముంత ఒక్కోనేత ముంగిట్లో బయటికి తీస్తున్నారు. మమతాబెనర్జీ బెంగాళ్‌లో ప్రచారానికి రావయ్యా! చంద్రన్నా!! అని బొట్టుపెట్టి పిలవకపోయినా అక్కడికి చేరుకున్నారు. అక్కడ ప్రచారంలో తెలుగులో మోదీని దుయ్యబట్టారు. బెంగాళీలకు తెలుగుమాటలు ఒక్కటంటే ఒక్కటి అర్ధమైచావలేదు. బాబుమాటల్లో మోదీ అనేమాట మాత్రమే అర్ధం అయ్యింది. మోదీని దుయ్య బడుతున్నాడో ఏపీ అసెంబ్లీలో మోదీలాంటి ప్రధాని లేడని తీర్మాణాన్ని ఇక్కడ చెబుతున్నాడో అర్థం చేసుకోలేకపోయారు. బెంగాళీ మీడియా బాబును ఆయన తెలుగు మాటల్ని పతాకాలు చేయలేకపోయింది.

అసలు బాబు వచ్చిందే మమతాను కలుసుకుని తన ఆశల పల్లకి గురించి చెప్పడానికే. ఆమెను ఎలాగోలా లుసుకున్నారు. మేడమ్‌ మీరు మనకూటమి తరుపున రాబోయేకాలంలో కాబోయే ప్రధాని ఎందుకు కాకూడదు అని ఆమెను పీఎం కుర్చీవైపు ఎగదోసారు. ఆమె బాబును అదోలా చూస్తూ ప్రధాని పదవా? ఎందుకొచ్చిన ఆయాసం అన్నట్లు తటపటాయించేసారు. మీకా ఇంట్రస్టు లేకుంటే నన్ను ప్రధానిని చేయరాదా అని ఆవెంటనే తనలో రగులుతున్న ప్రధాని కుర్చీ ఆశలను వెళ్లగక్కేసారు. ఆమె మరింత తటపటాయిస్తూ ఎందుకు అలా తొందర పడుతున్నారు? ఓపాతిక పార్టీల కూటమిలో ఉన్నాం. మీరు నేను అనుకుంటే ప్రధాని అయ్యేదికాదు.

అంతాకలిసి ఎవరెన్ని సీట్లను తెస్తారో చూసాక ఏనిర్ణయం చేయాలి. ఇక్కడ ఇంకా ప్రచారంలో ఉన్నాం. ఏపార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో? కూటమిలో పార్టీలోళ్లు ఎంతమంది జారిపోతారో? పోనీ నీవైన సరిగ్గా మాటమీద నిలబడేరకం కాదని జాతీయ పత్రికలు ఊదరగొడ్తుంటే ఇప్పుడికిప్పుడు ప్రధాని కూటమిలో ఎవరన్నది తీసుకువస్తే కూటమి జావగారిపోతుంది. అని మమతాజీ ఖరాఖండిగా తేల్చేసారు. దాంతో బాబు చల్లకొచ్చి ఖాళీముంత మళ్లీ జేబులో కుక్కుకున్నారు. మాయావతి మేడమ్‌ను కలుద్దామనుకున్నారు. ఆమె ఒకకర్ఫ్యూ సెక్షన్‌ లాంటిది. ఫోన్‌లోనే ఒకటి అడిగితే, తూటాల్లాంటి మాటలతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ప్రత్యక్షంగా అయితే, ఇంకా ఏమైనా ఉందా? ఆమెను ఫోన్‌లో మాట్లాడడానికే బాబు నిర్ణయించుకున్నారు.

ఛలో దక్షిణాది అని కర్ణాటక దేవెగౌడను బాబు కలిసారు. అక్కడే ఇదేతంతు మీరు మనకూటమి తరుపున ప్రధాని కావచ్చు కదా! అని లోపల కుతకుతమంటూ బయటికి  పదవాశలే లేని పరిత్యాగిలా పెద్ద ఆఫర్‌ ఇచ్చారు. నిత్యం నిద్రముఖంతో ఉండే దేవెగౌడ బాబు ముఖంమీద ఆవులించేసి అప్పుడు చూద్దాం. అయినా ఆళ్లూ ఈళ్లూ ప్రధానికావాలని కోరుకునే కంటే మీరే ఆపదవి చేపట్టొచ్చు కదా మరో ఆవులింతతో ముఖమాటంగా గుండెల్లోంచి కాకుండా పెదాలపై నుంచి అనేసారు. చల్లకొచ్చి ముంతదాచాల్సింది లేదన్నట్లు బాబు చంకలు గుద్దుకున్నారు. ఏపీలో మళ్లీ గెలిచి సీఎం కాలేకపోయినా ఏకంగా ప్రధాని కావచ్చు. నిద్రభంగి దేవెగౌడతో కాగలకార్యం గంధర్వులు తీర్చిరన్నట్లుగా మున్ముందు ప్రధాని కుర్చీకథ నడపాలని బాబు డిసైడ్‌ అయ్యారు.

బాబు ముందే మీరే ప్రధాని అనే కూతపట్టారు. తప్పితే, వేరెక్కడా కూడా నాలుక జారకుండా దేవెగౌడ జాగ్రత్తపడ్డారు. దాంతో బాబు హతాశుడై ఇలా ఏడారిలో నడుస్తున్నా నమ్మినోళ్లే ముళ్లబాటలోకి మళ్లిస్తున్నారు. ఏమైనా ఏపీలోనే సీఎం పదవికి ఎగరలేని పరిస్థితిలో ఉన్నాను. ఎందుకు ప్రధాని కుర్చీవైపు పరుగులు తీయడం? వయస్సులో, రాజకీయాల్లో చిన్నోళ్లయినా మమతా, మాయావతి చెప్పిందే నిజం. ఏపీలో 25 ఎంపీ సీట్లలో కనీసం సగం గెలుచుకుని వెడితే ఢిల్లీ రాజకీయాలు చేయొచ్చు. కానీ, ఏ ఒక్కసీటు గెలుస్తానని చెప్పే అభ్యర్ధేలేడాయే. చివరికి మే 23న బాబుది 41 రోజులుపాటు తాటాకు చప్పుళ్లే అని జనాలు, కూటమిలో ఉన్న పార్టీనేతలు అంతా నవ్వుకుంటారు కాబోలు. అయినా నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అనుకుంటే ఏబాధ ఉండదు. ఇలాంటి నవ్వులాటలు ఎన్నిసార్లు ఎదురుకాలేదు. ఈతరహా అంతర్మధనంలో సాగుతూనే బాబు ప్రధాని అయ్యేదారుల్లో ప్రయాణం మాత్రం ఆపలేదు. మేకపోతు గాంభీర్యంలో ఏమాత్రం తగ్గడంలేదు. మరోవైపు 

టీడీపీలో అంతర్మధనం పతాకానికి చేరకుంది. అన్ని నియోజకవర్గాల్లో క్యాడర్‌ పెదాలు విరుపులే కన్పిస్తున్నాయి పోటీబరిలో అభ్యర్ధులు నా గెలుపుగ్యారెంటీ అని బల్లలు గుద్దేసీన్‌లో లేనేలేరు. పదోట్లో, వందోట్లుతో ఒడ్డెక్కుతా అని డాబుసరి మాటల్లో బయటికి చెబుతున్నా ఇంట్లో నొసలు నొక్కుకో సాగారు. పచ్చమీడియా దొంగసర్వేలు, బాబు 130 సీట్లలో గెలుపుమనదే అనే భరోసాలు అభ్యర్ధులకు ఎలాంటి ఓదార్పు నీయలేకుండా ఉన్నాయి. ఓటమే విలయతాండవమాడుతున్నట్లు కళ్లముందు గోచరిస్తోంది. ఇక పార్టీ తేరుకోలేదని శకునిపక్షులు జోస్యం చెబుతున్నట్లుగా చెవుల్లో నిశికూతలు విన్పిస్తున్నాయి. ఇదీ పార్టీలో నేతల బిక్కుబిక్కుపర్వం 13జిల్లాల్లో అప్రతిహాతంగా సాగుతోంది.

జనాల్లో జనవాక్యం బాబు విషయంలో ఎలా ఉందయ్యా అంటే.... బాబు ఏపిలో అత్తెసరు సీట్లతో ప్రతిపక్షంలో కూర్చోవల్సిందే. బాబు పాలనలో స్కామ్‌ లు, ఇసుక, మట్టిదోపిడీలపై జగన్‌ సర్కారు ఏసిబిని, సిబిఐని ఉసిగొలిపి చుక్కలు చూపుతుంది. వాటిని తప్పించుకోవడానికే బాబు అన్ని పార్టీలతో కూటమికట్టారు. అందులో కాంగ్రెస్‌తో భుజాలు రాస్తున్నారు. అయినా మీదకు వచ్చేటప్పుడు కాంగ్రెస్‌తో సహా ఏపార్టీ బాబుకు వెన్నుదన్నుగా నిలబడవు. పైగా, పార్టీల్లోనే మోదీపై అసమ్మతి, ప్రజల్లో అంతగా లేదు. మోదీయే అరకొరసీట్లతో వస్తారు. అందులో భాగస్వామ్యంలో ఉన్న వైకాపా బాబు పనిపట్టడంలో వెనుకాడదు అని జనవాక్యంగా ఉండనే ఉంది. జగన్‌కు కార్యవాది బాబు దాసోహమన్నా ఢిల్లీలో విజయసాయిరెడ్డి అడ్డంపడి జనాలు నమ్మనట్టే బాబును మనం నమ్మద్దు అని చెబుతారని జనాలు చెప్పుకుంటున్నారు. జనాల్లో  రేపటి రాజకీయ జోస్యాలు చెప్పగలదిట్టలు ఎక్కువయ్యారు.

ఇక అసలు సిసలు పార్టీ మూలవిరాట్టు చంద్రన్న పాలనతో జనాలను ఆకట్టుకోలేకపోయారు. కనీసం జనాలవైపు కన్నెత్తి చూడలేదు. ఎవరు ఏమి అడిగినా గుంయ్‌మని వారిపై పడడం, పోలీసులను ఉసి గొలపడం పనిగా పెట్టుకున్నారు. పాలన ఆఖరిలో సంక్షేమ పథకాల మాటున వేలకు వేలు జనాల చేతుల్లో పెట్టి ఓటుకునోటు ఇచ్చా. నాకే ఓటేయండి అన్నట్లుగా జనాలకు ఆర్ధిక సంకేతాలు చెవుల్లో నింపారు. ఒప్పుడు ఓటర్‌కు ఇప్పటి ఓటర్‌కు శతయోజనాల తేడా ఉంది. సోషల్‌ మీడియా పుణ్యమా అందరి జేబుల్లో ఉన్న టచ్‌సెల్‌తో బాబు పాలనలో జరుగుతున్నందంతా అనునిత్యం తెలుసుకున్నారు. 58నెలలు బాబు తనకోసం, తనబినామీల కోసం, తనపార్టీలో వారి కోసం, పాలన చేసుకుపోయారు.జనాలకు దక్కే రియంబర్సు, ఆరోగ్యశ్రీ పథకాలను కుదగొట్టారు. 108 ప్రజా అంబులెన్సులను సగానికి పైగా మూలపడేలా చేసారు. 13 ఐటెమ్సుతో కళకళలాడే రేషన్‌డిపోల్లో బియ్యానికే పరిమితం చేసారు.2014 ఎన్నికల్లో బాబు ఇచ్చిన వందలాది హామీలు గంపగుత్తిగా నేలమాళిగలో పాతరేసిన వైనం తెలుసుకున్నారు. బాబు పాలన చివరిలో వేలకువేలు ఇచ్చినా నమ్మం బాబు నమ్మం అనేట్లు జననాడి తయారయ్యింది. పథకాల మాటున వేలకు వేలు రూ.లు జేబుల్లో కుక్కుకుంటున్న జనాలు ఏమను కుంటున్నారో ఎప్పటికప్పుడు రాష్ట్ర ఇంటిలిజెన్సీ బాబు చెవికి ఎక్కించింది. అయినా బాబుకు వేరేదారి లేదాయే. 

బాబుకు ఓటుకోసం ఏమిచ్చినా ఓటురాలదని తెలిసినా ఓటుకునోటే అనే చూరుపట్టుకుని వేలాడడమే పనిగా పెట్టుకున్నారు. వృధా ఆయాసమే అని తెలిసిన బాబు 41రోజులు స్థిమితంగా ఉండలేకపోయారు. ఉత్తరాదో దక్షిణాదో పరుగులు తీస్తున్నారు. నానారకాల పార్టీల నేతలను కలుస్తున్నారు. మద్యలో తనపార్టీ వారికి గెలుపు భరోసా చెవులకు ఎక్కిస్తున్నారు. ఫలితాల రోజు, చెవులు నింపేందుకు రానే వస్తోంది. కోడి తిన్నో డు ఇంట్లో కోడిపోయినోడు వీధిలో అన్నట్లు బాబు పరిస్థితి తయారయ్యింది. రేపు గెలవబోయే జగన్‌ 41 రోజులు ప్రశాంతంగా ఇంటిపట్టునే ఉన్నారు. తనే కాలుకాలిన పిల్లి అయ్యానే అని లోలోపల బాధపడుతున్నా బయటికి మాత్రం పోలవరం పరుగులు తీస్తున్నారు. క్యాబినెట్‌ సమావేశాలంటూ తను నిక్కచ్చి పాలకుడునని చాటుకునేయత్నంలో తనమందిని 

నమ్మించేయత్నంలో ఉన్నారు. అందులో పలకరించి పారిపోయిన తుపాన్‌, వడదెబ్బలు, ఇలాంటి ప్రజా పనులపై చర్చించేందుకు అని చెబుతున్నారు. 58 నెలలపాలనలో ఇలాంటివి మచ్చుకైన హడావుడి చేయని చంద్రన్న ఆపద్ధర్మ ప్రభువుగా చేస్తానని ఉరుకుతుంటే ఎన్నికలసంఘం, ఆపద్ధర్మ మంత్రులు నొస లు నొక్కుకుంటున్నారు.నలబైఏళ్ల రాజకీయానుభవశాలి. ఓటర్‌ కీలెరిగి నోట్లు ఇచ్చే దానశీలి. ఎంతటి నేతనయినా అవసరమనుకున్నప్పుడు నెత్తిన పెట్టుకోవడం. కాదనుకున్నప్పుడు తుంగలోకితొక్కే కార్యశీలి. బాబు పెట్టుకున్న కూటమిలో, నేడు ఏపీలో సాక్షాత్తు బాబే మేరానామ్‌ జోకర్‌ అయ్యారు.

-యర్నాగుల సుధాకరరావు

డిగ్రీ, బీటెక్ యువకుల్లో బెట్టింగ్ జాడ్యం..