cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

ప్రీ పోల్ స‌ర్వే.. గ్రేట‌ర్ లో టీఆర్ఎస్ కు ఎడ్జ్?

 ప్రీ పోల్ స‌ర్వే.. గ్రేట‌ర్ లో టీఆర్ఎస్ కు ఎడ్జ్?

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల సంగ్రామంలో ప్ర‌చార ప‌ర్వం ముగిసింది. పోలింగ్ కు స‌ర్వం సిద్ధం అయ్యింది. చ‌రిత్ర‌లో ఎన్న‌డూ జ‌ర‌గ‌నంత స్థాయిలో మాట‌ల తూటాల‌తో గ్రేట‌ర్ ప్ర‌చార స‌ర్వం సాగింది ఈ సారి.

అధికార తెలంగాణ రాష్ట్ర స‌మితితో భార‌తీయ జ‌న‌తా పార్టీ అమీతుమీ తేల్చుకునే స్థాయిలో ప్ర‌చార ప‌ర్వాన్ని సాగించింది. భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ నేత‌లంతా ఈ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల సంగ్రామం కోసం ప్ర‌చారాన్ని సాగించ‌డంతో... బీజేపీ ఈ ఎన్నిక‌ల‌ను ఎంత సీరియ‌స్ గా తీసుకుందో స్ప‌ష్టం అయ్యింది. 

దుబ్బాక అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సాధించిన విజ‌యం ఇచ్చిన ఉత్సాహంతో బీజేపీ త‌న అస్త్రాల‌న్నింటినీ గ్రేట‌ర్ లో సంధించేసింది. ఎంఐఎం బ‌లంగా ఉన్న ప్రాంతం కావ‌డంతో.. బీజేపీ ప్ర‌చార ప‌ర్వానికి ప‌ట్టు లభించింది. కేవ‌లం టీఆర్ఎస్ మాత్ర‌మే ప్ర‌త్య‌ర్థి అయి ఉంటే.. బీజేపీకి ఈ ఎన్నికల ప్ర‌చారంలో ఆయుధాలే లేవు. ఎంఐఎంను బూచిగా చూపించే అవ‌కాశం ఉండ‌టంతో బీజేపీకి ఎన‌లేని ఉత్సాహం వ‌చ్చింది. అందుకే ఏకంగా ఢిల్లీ నుంచి నేత‌లంతా గ‌ల్లీ వ‌ర‌కూ దిగొచ్చారు.

ఈ నేప‌థ్యంలో ప‌లు ప్రీ పోల్ స‌ర్వేలు షికారు చేస్తూ ఉన్నాయి. వాటిల్లో ఒక దాని ప్ర‌కారం.. గ్రేట‌ర్ లో టీఆర్ఎస్ భారీ విజ‌యాన్నే సొంతం చేసుకుంటుంది. అందులో అణుమాత్రం సందేహం లేదు.  అయితే ఎన్ని సీట్లు వస్తాయి. గతంలో మాదిరిగా 99 వస్తాయా? లేదా ఎన్ని వస్తాయి అన్నది తెలియాల్సి వుంది.

ఏబీపీ- సీ ఓట‌ర్ స‌ర్వే ప్ర‌కారం.. గ్రేట‌ర్ లో కారు పార్టీ ఏకంగా 92-94 సీట్ల వ‌ర‌కూ సాధించుకునే అవ‌కాశం ఉంది. దాదాపు ఏడేళ్ల పాల‌న కాలానికి ద‌గ్గ‌ర ప‌డుతున్న టీఆర్ఎస్ గ్రేట‌ర్ లో 90కి పైగా డివిజ‌న్ల‌లో విజ‌యం సాధిస్తే .. తెలంగాణ‌పై కేసీఆర్ ప‌ట్టు కొన‌సాగుతున్న‌ట్టే అవుతుంది. 

గ‌త ప‌ర్యాయంతో పోలిస్తే ప‌ది డివిజ‌న్ల‌ను కోల్పోయినా టీఆర్ఎస్ హ‌వా ఏమీ త‌గ్గ‌న‌ట్టే! ఈ స‌ర్వే ప్ర‌కారం.. బీజేపీ ప‌ది నుంచి ప‌న్నెండు డివిజ‌న్ల‌లో నెగ్గే అవ‌కాశం ఉంది. ఆ పార్టీ జాతీయ స్థాయి నాయ‌కత్వం అంతా దిగొచ్చినా ప‌ది - ప‌న్నెండు డివిజ‌న్ల‌లో విజ‌యం అంటే అది పెద్ద‌దేమీ కాదు. 

ఇక కాంగ్రెస్ పార్టీ రెండు నుంచి నాలుగు డివిజ‌న్ల‌లో విజ‌యం సాధించే అవ‌కాశం ఉంద‌ని ఈ స‌ర్వే చెబుతోంది. ఎంఐఎం 38 నుంచి 42 డివిజ‌న్ల‌లో గెలుపుతో త‌న ప‌ట్టు నిలుపుకునే అవ‌కాశం ఉంద‌ని ఈ స‌ర్వే చెబుతోంది. అయితే..  ఈ స‌ర్వే ఎప్పుడు చేశార‌నే ప్ర‌శ్న‌కు స్ప‌ష్ట‌మైన స‌మాధానం లేదు.  ప్ర‌చార ప‌ర్వం ఆఖ‌ర్లోకి వ‌చ్చే స‌రికి బీజేపీ ప్ర‌చారాన్ని హోరెత్తించిన నేప‌థ్యంలో..ఈ స‌ర్వే ఆ ప్ర‌భావాన్ని గుర్తించిందో లేదో ఫ‌లితాలు వ‌స్తే కానీ తెలియ‌దు.

బీజేపీ ఆఖ‌ర్లో ప్ర‌చారాన్ని సాగించిన తీరును బ‌ట్టి ఆ పార్టీ 25 డివిజ‌న్ల‌కు పై స్థాయిలోనే గెలుపు జెండాను ఎగ‌రేయ‌వ‌చ్చు అనే ప్ర‌చార‌మూ జ‌రుగుతోంది. 

అయితే మ‌రో ప్ర‌చారం కూడా జ‌రుగుతూ ఉంది. దాని ప్ర‌కారం బీజేపీ గ్రేట‌ర్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలుస్తుంద‌ట‌. బీజేపీ 40 డివిజ‌న్ల‌లో గెల‌వొచ్చ‌ని ఆ రిపోర్టులో పేర్కొన్నార‌ట‌. అయితే అది నిజమైన  స‌ర్వేనా లేక సోష‌ల్ మీడియా సృష్టేనా అనేది తెలియదు. ఆ సర్వే ప్ర‌కారం టీఆర్ఎస్ 60 డివిజ‌న్ల‌లో విజ‌యం సాధిస్తుంద‌ట‌.

60 డివిజ‌న్ల‌కు ప‌రిమితం అయితే టీఆర్ఎస్ కు కాస్త షాక్ అవుతుంది. కానీ గ్రేట‌ర్ మేయ‌ర్ పీఠాన్ని బీజేపీ ద‌క్కించుకోలేక‌పోవ‌చ్చు. ఎక్స్ అఫిషియో ఓట్లు, ఎంఐఎం మ‌ద్ద‌తుతో మ‌ళ్లీ టీఆర్ఎఎస్ మేయ‌ర్ పీఠాన్ని ద‌క్కించుకునే అవ‌కాశాలు లేక‌పోలేదు. 

పోలింగ్ కు స‌ర్వం సిద్ధ‌మ‌యిన వేళ గ్రేట‌ర్ ఫ‌లితాల విష‌యంలో ఈ ప్రీ పోల్ స‌ర్వేలు ప్ర‌చారం లో ఉన్నాయి. మ‌రి వీటిల్లో ఏది నిజ‌మ‌వుతుందో.. పోలింగ్ పూర్త‌తే కొంత వ‌ర‌కూ, డిసెంబ‌ర్ నాలుగో తేదీతో పూర్తిగా స్ప‌ష్టత వ‌స్తుంది.

అసెంబ్లీలో చంద్రబాబు రచ్చ

 


×