Advertisement

Advertisement


Home > Politics - Political News

మాకేంట‌ని వెంట‌ప‌డేవారుః సీనియ‌ర్ న‌టి

మాకేంట‌ని వెంట‌ప‌డేవారుః సీనియ‌ర్ న‌టి

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ ఇప్పుడే కొత్త‌గా పుట్టుకొచ్చిన వ్య‌వ‌హారం కాద‌ని ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టి అన్న‌పూర్ణ చెప్పారు.  అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న‌ ‘ఎఫ్‌-3’ చిత్రంలో ఆమె నటిస్తున్నారు. నుదుట పెద్ద బొట్టుతో ముత్తైదువు అనే ప‌దానికి నిలువెత్తు మ‌హిళగా ఆమె నిలుస్తారు. ఓ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కాస్టింగ్ కౌచ్‌పై త‌న స్ప‌ష్ట‌మైన అభిప్రాయాల‌ను కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అవకాశాలు ద‌క్కించుకోవాలంటే కాస్టింగ్‌ కౌచ్‌కు గురికావాల్సిందే అని తేల్చి చెప్పారు. ఈ సందర్బంగా కెరీర్ ప్రారంభంలో తానెదుర్కున్న‌ చేదు అనుభవాలను ఆమె అభిమానుల‌తో పంచుకున్నారు.

‘అప్పట్లో కూడా అవకాశాల కోసం వేధించేవారు. అవకాశం ఇస్తే మాకేంటని మా వెంట పడేవారు. అందుకే 20 ఏళ్లకే పెళ్లి చేసుకోవడం.. పాతికేళ్లకే అమ్మ వేషాలు వేయడం మొదలు పెట్టాను. హీరోయిన్‌గా ఛాన్సులు వచ్చినప్పటికి రెండు సినిమాలకే ఆపేశాను. అదే అమ్మ వేషాలైతే అలాంటివి ఉండవు. అప్పుడు కూడా ఉండేవి కానీ ముందుగానే అలాంటి పనులు చేయమని ఒప్పందం ఇస్తేనే డేట్స్‌ ఇచ్చేవాళ్లం’ అంటూ ఆమె నాటి ప‌రిస్థితుల‌ను క‌ళ్ల‌కు క‌ట్టారు.  

ఇక త‌ప్పొప్పుల విష‌యానికి వ‌స్తే ...ఒక‌రి వైపే ఉండ‌ద‌న్నారు. ఇద్దరికి ఇష్టమైతేనే ఆ తప్పులు జరుగుతాయని ఆమె తేల్చి చెప్పారు. ‘ప్రతి రంగంలో మహిళలు కాస్టింగ్‌ కౌచ్‌ను ఎదుర్కొంటున్నార‌న్నారు. తల్లిదండ్రులు, పిల్లలు, భర్త, కుటుంబ గౌరవాలను దృష్టిలో ఉంచుకుని మహిళలు వేటికీ లొంగకుండా తప్పించుకు వస్తున్న‌ట్టు ఆమె తెలిపారు. సినీ పరిశ్రమ‌లో రాణించాల‌నుకునే మ‌హిళ‌లు  కూడా తప్పించుకోవాల‌ని కోరారు. ఒకవేళ అలాంటి సంఘటనలు ఎదురైన మ‌హిళ‌లు వెంటనే గ‌ళం విప్పాల‌ని ఆమె పిలుపునిచ్చారు.

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేనేలేద‌ని, తప్పులే జరగవని తాను చెప్పడం లేదన్నారు. ఖచ్చితంగా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో తప్పులు జరుగుతాయన్నారు. అవకాశాల కోసం ప్రయత్నించే వారికి ఇండ‌స్ట్రీలో కష్టాలు తప్పవని అన్నపూర్ణ చెప్పుకొచ్చారు. మీడియా విస్తృతి పెరిగిన నేప‌థ్యంలో కాస్టింగ్ కౌచ్‌పై పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంద‌న్న విష‌యాన్ని అర్థం చేసుకోవాలి. ఈ సంగ‌తినే అన్న‌పూర్ణ ప‌రోక్షంగా చెప్పారు.  

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?