Advertisement


Home > Politics - Political News
ఆమె పోటీ యోచన ఇంకా సజీవమేనా?

రాజకీయ పార్టీల అధినేతలు, నాయకులు ప్రతిరోజు కొత్త కొత్త ఆలోచనలు చేస్తూనేవుంటారు. సాధారణ ఎన్నికలు రాబోతున్నాయంటే ఈ ఆలోచనలు, ప్రణాళికలు మరీ ఎక్కువగా ఉంటాయి. రకరకాల పేర్లతో సమావేశాలు నిర్వహించి సమాలోచనలు జరుపుతుంటారు. చేస్తున్న ఆలోచనల్లో, రచించే ప్రణాళికల్లో అన్నీ వర్కవుట్‌ చేయాలని అనుకోరు.

రాజకీయ పరిణామాలు, పరిస్థితులను బట్టి కొన్నింటిని పక్కకు పడేస్తారు. మొదట్లో బ్రహ్మాండంగా ఉందనుకున్న ఆలోచన కొంతకాలం తరువాత పనికిరానిదిగా అనిపించవచ్చు. అమలుచేసే ఆలోచనల్లో కొన్ని సఫలం,  కొన్ని విఫలం కావొచ్చు. దేనికీ గ్యారంటీ ఉండదు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమార్తె, ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని ఎంతోకాలం నుంచి ప్రచారం జరుగుతున్నా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు.

యూపీ ఎన్నికలప్పుడు ఈ ప్రచారం ఊపందుకుంది. కాని కనీసం ఆమె ప్రచారం కూడా చేయలేదు.  ప్రియాంక  రంగప్రవేశంపై  ప్రచారం చివరకు 'కొండను తవ్వి ఎలుకను పట్టారు' అనే చందంగా మారింది. ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుంచి మీడియాలో ఆమె గురించి కథనాలు రాని రోజుల లేదంటే అతిశయోక్తి కాదు. ఉమ్మడి రాష్ట్ర విభజనవల్ల తెలంగాణలో అధికారం దక్కుతుందని సోనియా గాంధీ ఆశించగా అందుకు వ్యతిరేకంగా జరగడమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో పూర్తిగా భూస్థాపితమైంది. వచ్చే ఎన్నికల్లోనూ అక్కడ ఆశలు లేవు కాబట్టి తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని కాంగ్రెసు తాపత్రయపడుతోంది.

ఈమధ్య కాలంలో బలం పుంజుకుంటోందనే అభిప్రాయం కలుగుతోంది. కేసీఆర్‌పై తీవ్ర ప్రజావ్యతిరేకత ఉంది కాబట్టి ప్రజలు తమను కుర్చీలో కూర్చోబెడతారని కాంగ్రెసు నాయకులు నమ్ముతున్నారు. అయితే ఓ గొప్ప ఆకర్షణ శక్తి ఉంటే మాత్రమే కాంగ్రెసు విజయం సాధించగలుగుతుందని, ఆ శక్తి ప్రియాంక గాంధీ అని హస్తం నేతలు భావిస్తున్నారు.

ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగని సోనియా కుమార్తెను మెదక్‌ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేయించి, ఘనవిజయం సాధించిపెట్టి చరిత్ర సృష్టించాలని అనుకుంటున్నారు. కాంగ్రెసు నాయకులు ఈ ఆలోచన చేస్తున్నట్లు కొంతకాలం క్రితం సమాచారం వచ్చింది. ఇప్పటికీ దాన్ని పక్కన పెట్టకుండా సజీవంగానే ఉంచారని తెలుస్తోంది. అమలు చేస్తారా? లేదా? అనేదానిపై ఎన్నికల ముందు నిర్ణయం తీసుకుంటారు.

సాధారణ ఎన్నికలకు ఏడాదిన్నర సమయముంది. రాజకీయ పరిస్థితిలో ఇంకా ఏవో మార్పులు కలుగుతూనే ఉన్నాయి. ఎన్నికలకు కొద్దికాలం ముందు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో స్పష్టత వస్తుంది తప్ప ఇప్పుడు అంచనా వేయడం కష్టం. కాంగ్రెసు పుంజుకుంటున్నట్లు టీఆర్‌ఎస్‌ కూడా భావిస్తోంది. కాని అధికారంలోకి వచ్చేందుకు అవసరమైనంతగా బలం సాధించిందా? లేదా? తెలియదు. ప్రస్తుతానికైతే అన్నీ ఊహాగానాలు, అంచనాలే. రేవంత్‌ రెడ్డి రాజీనామా చేసిన కొడంగల్‌కు లేదా కేసీఆర్‌ అనుకున్నట్లుగా నల్గొండ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరిగితేనే కాంగ్రెసు పార్టీ బలం ఎంతో తెలుస్తుంది.

రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలనుకుంటున్న కాంగ్రెసు పార్టీకి సోనియా కుమార్తె మీద ఆధారపడటం మంచి మార్గంగా కనబడుతోంది. మెదక్‌ పేరు ప్రచారం కావడానికి ఓ సెంటిమెంటుంది. 1980లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఇక్కడి నుంచి పోటీ చేసి బ్రహ్మాండమైన విజయం సాధించారు. నాయనమ్మ పోటీ చేసిన నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే తెలంగాణలో కాంగ్రెసు అధికారంలోకి వస్తుందని కాంగ్రెసు నాయకులు నమ్ముతున్నారు.