cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

మ‌ళ్లీ దొరికిన ర‌ఘురామ‌కృష్ణంరాజు!

మ‌ళ్లీ దొరికిన ర‌ఘురామ‌కృష్ణంరాజు!

న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు జ‌గ‌న్ స‌ర్కార్‌కు మ‌ళ్లీ దొరికారా? అంటే ...ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో నెట్టే అత్యుత్సాహంలో తానేం త‌ప్పులు చేస్తున్నారో ర‌ఘురామ‌కృష్ణంరాజు గ్ర‌హించ‌లేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గోరంత‌ను కొండంత‌లు చేయ‌డంలో ర‌ఘురామ‌కృష్ణంరాజు నేర్చిన విద్య‌ మ‌రెవ‌రికీ ప‌ట్టుబ‌డ‌లేదనే అభిప్రాయాలున్నాయి. అయితే ఒక్కోసారి ఎంతో తెలివైన వాళ్లు కూడా చిన్న‌చిన్న విష‌యాల ద‌గ్గ‌రే దొరికిపోతుంటారు.

ర‌ఘురామ‌కృష్ణంరాజు కూడా అదే రీతిలో త‌న డ్రామాను తానే బ‌య‌ట పెట్టుకున్నారంటున్నారు. గ‌త రెండు రోజులుగా ర‌ఘురామకృష్ణంరాజు సెల్ ఫోన్‌పై చేస్తున్న యాగీ అంతాఇంతా కాదు. చివ‌రికి ర‌క‌ర‌కాల వ్య‌వ‌స్థ‌ల‌కు నోటీసులు, ఫిర్యాదుల వ‌ర‌కూ వెళ్లారు. అస‌లేం జ‌రిగిందో, జ‌రుగుతోందో తెలుసుకుందాం.

తనను అరెస్టు చేసినప్పుడు స్వాధీనం చేసుకున్న ఐ-ఫోన్‌ను తక్షణం మేజిస్ట్రేట్‌ ముందు ఉంచాలని, అలా చేయకపోతే సివిల్‌, క్రిమినల్‌ చర్యలకు వెళ్తాన‌ని ఎంపీ రఘురామకృష్ణరాజు శుక్ర‌వారం సీఐడీ అదనపు డీజీ పీవీ సునీల్‌కుమార్‌, మంగళగిరి సీఐడీ ఠాణా ఎస్‌హెచ్‌వోకు లీగల్‌ నోటీసు పంపారు. అందులో ఏముందో చూద్దాం.

‘ఈ ఏడాది మే 14న హైదరాబాద్‌లో ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసినప్పుడు 90009 22222 నంబరున్న ఐ ఫోన్‌ను నా నుంచి చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకున్నారు. ఆ రోజు రాత్రి మీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారు. థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడంతో తట్టుకోలేక ఫోన్‌ పాస్‌వర్డ్‌ వెల్లడించాను. 

తక్షణమే ఫోన్‌ను మేజిస్ట్రేట్‌ ముందు ఉంచాలి. విధుల నిర్వహణ కోసం ఆ ఫోన్‌ పొందేం దుకు కోర్టు నుంచి తగిన ఉత్తర్వులు పొందుతాను. మేజిస్ట్రేట్‌ వద్ద ఉంచడంలో విఫలమైతే ప్రత్యామ్నాయ న్యాయ మార్గాలైన సివిల్‌, క్రిమినల్‌ చర్యలు చేపడతా’ అని నోటీసులో హెచ్చ‌రించారు.

ర‌ఘురామ‌కృష్ణంరాజు ఫోన్ విష‌యంలో శ‌నివారం మ‌రో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. అది మాజీ ఐఏఎస్ అధికారి, ప్ర‌భుత్వ మాజీ స‌ల‌హాదారు పీవీ ర‌మేశ్ ట్వీట్‌. ‘ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నేను ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాను. నాకు, నా కుటుంబసభ్యులకు 90009 11111 అనే నంబర్‌ నుంచి వాట్సప్‌ సందేశాలు వస్తున్నాయి. బహుశా ఆ నంబరు ఎంపీ రఘురామకృష్ణరాజుది కావచ్చు. దీనిపై ఎంపీ స్పందించాలి’ అని కోరారు.

ఇక ఇదే విష‌య‌మై ఢిల్లీ పార్ల‌మెంట్ స్ట్రీట్ డీసీపీకి ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు చేసిన ఫిర్యాదును జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించాల్సిన అవ‌స‌రం ఉంది. అందులో ఏముందంటే...

‘మే 14న నన్ను అరెస్టు చేసినరోజు నా భార్య, కుమారుడి సమక్షంలో పోలీసులు నా నుంచి ఐఫోన్‌ 11 మోడల్‌ మొబైల్‌ ఫోన్‌ తీసేసుకున్నారు. అందులో 90009 22222 నంబరు సిమ్‌తో 90009 11111 వాట్సప్‌ నంబరు ఉంది. ఆ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు రికార్డుల్లో చూపలేదు, తిరిగి ఇవ్వనూలేదు’ ...ఇలా ఇత‌ర‌త్రా అంశాలు ఆ ఫిర్యాదులో ఉన్నాయి.

అయితే శుక్ర‌, శ‌నివారాల్లో ర‌ఘురామ‌కృష్ణంరాజు ఫిర్యాదులు, అలాగే పీవీ ర‌మేశ్ ట్వీట్‌లో ప్ర‌ధానంగా పేర్కొన్న సెల్‌ఫోన్ నంబ‌ర్ల‌ను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించాల్సి వుంది. సీఐడీకి శుక్ర‌వారం పంపిన లీగ‌ల్ నోటీసులో అరెస్టు చేసినప్పుడు 90009 22222 అనే నంబ‌ర్ ఉంద‌ని మాత్ర‌మే పేర్కొన్నారు. పీవీ ర‌మేశ్ చేసిన ట్వీట్‌లో 90009 11111 అనే నంబర్‌ నుంచి వాట్సప్‌ సందేశాలు వ‌స్తున్న‌ట్టు పేర్కొనడం గ‌మ‌నార్హం. 

సీఐడీకి పంపిన నోటీసులో పేర్కొన్న సెల్‌నంబ‌ర్‌కు, పీవీ ర‌మేశ్ ట్వీట్‌లో ప్ర‌స్తావించిన సెల్ నంబ‌ర్‌కు తేడా ఉంది. ఎపుడైతే పీవీ ర‌మేశ్ తాను చెప్పింది కాకుండా మ‌రో నంబ‌ర్ ప్ర‌స్తావించారో, అప్పుడు మాత్ర‌మే ఢిల్లీలో చేసిన ఫిర్యాదులో అద‌నంగా చేర్చార‌ని గ‌మ‌నించొచ్చు. సీఐడీకి పంపిన నోటీసుల‌కు, ఢిల్లీలో ఫిర్యాదుకు మ‌ధ్య 24 గంట‌ల వ్య‌త్యాసం ఉంది.

సెల్‌ఫోన్‌కు సంబంధించి ర‌ఘురామ‌కృష్ణంరాజు కుమారుడు భ‌ర‌త్ త‌న తండ్రి అరెస్ట్ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన అంశం ప్ర‌ధానంగా ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. ఆ రోజు భ‌ర‌త్ ఏమ‌న్నారంటే...

‘మా నాన్న గారు లాయ‌ర్‌తో మాట్లాడ్డానికి ప్ర‌య‌త్నిస్తుంటే ఫోన్ లాక్కున్నారు. ఆయ‌న్ను తీసుకెళ్లి పోయిన త‌ర్వాత అప్పుడు మా సెక్యూరిటీ వాళ్లు గొడ‌వ చేస్తే ఫోన్ వెన‌క్కి ఇచ్చారు’ అని వివిధ చాన‌ళ్ల‌తో మాట్లాడిన సంద‌ర్భంలో భ‌ర‌త్ స్ప‌ష్టంగా త‌న తండ్రి సెల్‌ఫోన్‌ను వెన‌క్కి ఇచ్చిన‌ట్టు తెలిపారు.

మ‌రి వాస్త‌వాలు ఇలా ఉంటే...ర‌ఘురామ‌కృష్ణంరాజు ఇప్పుడెందుకు గోల చేస్తున్నారో ఎవ‌రికీ అంతుచిక్క‌డం లేదు. మ‌రోవైపు ఏపీ సీఐడీ అన్ని చూస్తూ ఉంది. సీఐడీ అధికారులు ర‌ఘురామ‌కృష్ణంరాజు గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యార‌నే వాద‌న వినిపిస్తోంది. ర‌ఘురామకృష్ణంరాజు అత్యుత్సాహం మ‌రోసారి ఆయ‌న్ని ప‌ట్టిస్తోంద‌నేందుకు పైన పేర్కొన్న ఉదాహ‌ర‌ణ‌లే నిద‌ర్శ‌నం అని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.  

గడ్డం పెంచగానే మాస్ లీడర్ అయిపోవు లోకేష్

సాయం చేయడం నా తల్లి నుంచే నేర్చుకున్నా

 


×