Advertisement

Advertisement


Home > Politics - Political News

ఆర్ఆర్ఆర్ : గుడ్డ కాల్చి మొహంపై వేస్తే సరా..

ఆర్ఆర్ఆర్ : గుడ్డ కాల్చి మొహంపై వేస్తే సరా..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామక్రిష్ణ రాజు తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి కొత్త కొత్త మార్గాలను వెతుక్కుంటున్నారు. తనను ఎంపీని చేసి లోక్ సభకు పంపిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ని అపకీర్తి పాల్జేయడం ఒక్కటే లక్ష్యంగా ఆయన అడ్డగోలు ఎజెండాతో చెలరేగుతూ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. 

అయితే అదే సమయంలో.. తనను గెలిపించిన నరసాపురం నియోజకవర్గ ప్రజలకు మొహం చూపించకుండా చాటుమాటుగా తిరుగుతున్న తన తత్వాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆయన ఇప్పుడు నయా మార్గం ఎంచుకున్నారు. గుడ్డకాల్చి అవతలి వారి మొహం మీద వేసేస్తే సరి.. అంటిన మసిని వారే కడుక్కుంటారు.. అన్న సామెత చందంగా ఆయన తీరు కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన సీబీసీఐడీ ఏడీజీ పీవీ సునీల్ కుమార్ ను టార్గెట్ చేస్తున్నారు. 

సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్.. తన హత్యకు కుట్ర చేశారనేది రఘురామక్రిష్ణ రాజు ఆరోపణ. ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కలిసి కుట్ర చేశారట. దళితులను రెచ్చగొట్టి.. తాను నియోజకవర్గంలో అడుగుపెట్టినప్పుడు.. అక్కడ తనను అంతమొందించాలని వారిద్దరూ కలిసి  ప్లాన్ చేస్తున్నారట. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్రమోడీకి ఒక లేఖ రాశారు. 

ఈ ఆర్ఆర్ఆర్ వైఖరి చూస్తే ఒక విషయం జ్ఞప్తికి వస్తోంది. హీరోయిన్ శ్రీదేవి నా భార్య, జయప్రద ను కూడా పెళ్లి చేసుకున్నా, కాజల్ ను పెళ్లి చేసుకున్నా అంటూ మీడియా ముందుకు వచ్చి స్టేట్మెంట్లు ఇచ్చి యూట్యూబ్ ఛానెళ్లలో సుదీర్ఘమైన ఇంటర్వ్యూలు ఇచ్చే ప్రబుద్ధులు కొందరు ఉంటారు. మా పెళ్లికి సంబంధించిన సాక్ష్యాలన్నీ నా వద్ద ఉన్నాయి. వాటిని అవసరమైనప్పుడు బయటపెడతా అని కూడా వారు అవాకులు చెవాకులు పేలుతుంటారు. 

ఇలాంటి పైత్యకారుల వ్యవహారాలకు పరాకాష్ట ఏంటంటే.. హీరోయిన్ శ్రీదేవి నన్ను పెళ్లి చేసుకుంది గానీ నాతో కాపురం చేయడం లేదు. ఆమె వచ్చి నాతో కాపురం చేసేలా ఆదేశించండి.. అని ఇలాంటి ప్రబుద్ధులు లోకల్ గా కోర్టులో పిటిషన్ వేస్తుంటారు. అలా పిటిషన్ వేసిన సంగతిని మీడియాలో బహుధా ప్రచారం చేసుకుంటారు. 

ఇప్పుడు ఆర్ఆర్ఆర్ వైఖరి కూడా అచ్చం అలాగే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి, సీఐడీ ఏడీజీ కలిసి నన్ను చంపేయాలని చూస్తున్నారు. మీరు వారి మీద చర్య తీసుకోండి అని ఆయన ప్రధానిని అడుగుతున్నారు.

ఇంత చవకబారు ఆరోపణలు, పనికిరాని విమర్శలు మరొకటి ఉండకపోవచ్చు. ఇలాంటి దారులు చూస్తే.. నేరగాళ్లందరూ కూడా.. ఈ ఎస్ఐ నామీద కక్ష కట్టాడు, ఈ పోలీసులు నామీద వైరం పెంచుకున్నారు లాంటి లేఖలు రాసుకుంటూ పబ్లిసిటీ పొందే రోజులు వస్తాయో ఏంటో ఖర్మ!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?