Advertisement


Home > Politics - Political News
రాహుల్‌ కోసం వారేం చేశారో తెలుసా?

ప్రతి తల్లి తన సంతానం ఉన్నతంగా ఎదగాలని, ప్రయోజకులు కావాలని కోరుకుంటుంది. అందుకోసం ఎంతటి త్యాగమైనా చేస్తుంది. రాహుల్‌ గాంధీ రాజకీయాల్లో వెలిగిపోవడం కోసం సోనియా గాంధీ త్యాగం చేశారు. తల్లి బాటలోనే నడిచింది సోదరి ప్రియాంక గాంధీ. నిజానికి ఇది ఎవరూ పట్టించుకోని విషయం. రాహుల్‌ గాంధీ సోమవారం అధ్యక్ష పదవికి నామినేషన్‌ దాఖలు చేయగానే కాంగ్రెసు నాయకులు, కార్యకర్తల్లో సంతోషం పెల్లుబికింది. సంబరాలు చేసుకున్నారు.

ఆయనకు పోటీగా మరొకరు లేకపోవడంతో ఆయనే అధ్యక్షుడని అందరికీ తెలుసు. అధికారిక ప్రకటన నామ్‌కేవాస్తే మాత్రమే. రాహుల్‌ నామినేషన్‌ వేస్తున్న ఫొటోలు అన్ని పత్రికల్లోనూ ప్రచురితమయ్యాయి. ఆయన గురించి కథనాలొచ్చాయి. ఇంతకూ సోనియా, ప్రియాంక చేసిన త్యాగం ఏమిటి? ఆమే కదా ఏరికోరి కుమారుడికి పగ్గాలు అప్పగించారు.

నిజమేకాని ఆమె చేసిన త్యాగం అది కాదు. రాహుల్‌ గాంధీ ఏఐసీసీ కార్యాలయంలో నామినేషన్‌ పత్రాలు దాఖలు చేసిన రోజున సోనియా, ప్రియాంక హాజరుకాలేదు. కుమారుడు జాతీయ పార్టీకి అధ్యక్షుడు కావడం మరపురాని ఆనందకరమైన రోజైనప్పటికీ వారు పాలుపంచుకోలేదు. యువరాజు నామినేషన్‌ పత్రాలు పూర్తిచేస్తున్నప్పుడు ఆయన పక్కన జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారు. రాహుల్‌ని పార్టీకి 'డార్లింగ్‌'గా అభివర్ణించిన మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, మాజీ హోం మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే, మణిపూర్‌ మాజీ ముఖ్యమంత్రి ఓక్రామ్‌ ఇబోబి సింగ్‌ రాహుల్‌కు కుడిపక్కన కూర్చున్నారు. ఎడమవైపు మేఘాలయా, కర్నాటక ముఖ్యమంత్రులు ముకుల్‌ సంగ్మా, సిద్దరామయ్య, రాజ్యసభ ఎంపీ ఆనంద్‌ శర్మ కూర్చున్నారు.

రాహుల్‌ వెనకవైపు మహాత్మా గాంధీ ఫోటో మాత్రమే ఉంది. జవహర్‌లాల్‌, ఇందిరా గాంధీ ఫొటోలు కనబడలేదు. మన్మోహన్‌ సింగ్‌, ఆనంద్‌ శర్మ, జ్యోతిరాదిత్య సింధియా తదితరులు వెంటరాగా రాహుల్‌ నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశారు. సోనియా గాంధీ, ప్రియాంక ఈ కార్యక్రమానికి హాజరుకాకపోవడానికి కారణం ఏమిటి? దీనిపై జరుగుతున్న ప్రచారం ఏమిటంటే...కాంగ్రెసు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న రాహుల్‌ మీదనే అందరి దృష్టి పడాలని, ఆయన హైలైట్‌ కావాలని, మీడియా ఆయనే ఫోకస్‌ చేయాలని సోనియా కోరిక. తల్లికూతుళ్లు వచ్చినట్లయితే నాయకులు, మీడియా వారిపై దృష్టి పెట్టే అవకాశముంది. రాహుల్‌ వెలిగిపోవాలంటే తాము తెర వెనకగా ఉండాలని వారు భావించారట.

వారిద్దరే కాదు, ఆ కుటుంబానికి చెందిన ఎవ్వరూ తొంగి చూడలేదు. కుమారుడు పూర్తిగా బాధ్యతలు చేపట్టాక తల్లి తెర వెనకనే ఉండి సలహాలకు పరిమితమవుతారు. ఆమె కల్పించుకుంటే అతని ప్రాధాన్యం తగ్గిపోతుంది. అయితే యూపీఏ భాగస్వామ్య పక్షాలు వచ్చే ఎన్నికలవరకైనా సోనియా అధ్యక్షురాలిగా ఉంటే బాగుండేదని భావిస్తున్నాయి.

సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి సైతం ఈ అభిప్రాయమే వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలను బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క తాటిపైకి తెచ్చే సామర్థ్యం యువరాజుకు లేదని ఎక్కువమంది విశ్వసిస్తున్నారు. ఆయనకు ఇప్పుడు బాధ్యతలు అప్పగించడం మోదీకి అవకాశం ఇచ్చినట్లేనని అంటున్నారు. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా కాబోయే ప్రధాని రాహులేనని కాంగ్రెసు నాయకులు విశ్వాసంతో ఉన్నారు.