cloudfront

Advertisement


Home > Politics - Political News

రైల్వేజోన్‌కూ 'హోదా' ఫార్ములానే...!

రైల్వేజోన్‌కూ 'హోదా' ఫార్ములానే...!

'కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కని ప్రచారం చేయాలి' అనే సామెత మాదిరిగానే ఉంది ఏపీ పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి. ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానం చేయడమే కాకుండా, తీవ్రంగా ప్రచారం చేసిన బీజేపీ అధికారంలోకి వచ్చాక మంగళం పాడింది. అందుకు పద్నాలుగో ఆర్థిక సంఘం పేరు వాడుకుంది. ఫైనాన్స్‌ కమిషన్‌ సిఫార్సుల మేరకే హోదా ఇవ్వలేకపోతున్నామని, దానికి బదులు ప్రత్యేక ఆర్థికసాయం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబును ఒప్పించింది. 

కాని ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకూడదని తాము సిఫార్సు చేయలేదని అప్పటి కమిషన్‌ ఛైర్మన్‌ వైవి రెడ్డి, సభ్యులు చెప్పారు. అయినప్పటికీ ఇప్పటికీ అదేపాట పాడుతోంది కేంద్రం. ప్రత్యేక హోదాకు ఉపయోగించిన ఫార్ములానే రైల్వేజోన్‌కూ ఉపయోగిస్తోంది. ఇందుకు రైల్వేబోర్డును వాడుకుంటోంది. 'ఏపీకి రైల్వేజోన్‌ ఇవ్వడం కుదరదు' అని రైల్వేబోర్డు తెగేసి చెప్పింది. జోన్‌ ఇస్తే ఏం ఉపయోగం? ఒక జీఎం, కొందరు ఉద్యోగులు వస్తారు. అంతకుమించి ఒరిగేది ఏమీలేదు అన్నాడు రైల్వేబోర్డు ఛైర్మన్‌. ఇలా తెగేసి చెప్పాలని ఆయన బుర్రకు తోచిందో, కేంద్రం ఆయనకు కీ ఇచ్చి వదిలిందో తెలియదు. 'మీకు రైల్వేజోన్‌ కావాలా? రైల్వేలైన్‌ కావాలా? అని ప్రశ్నించారు. 

ప్రత్యేక హోదా విషయంలోనూ కేంద్రం ఇలాగే తింగరి బుచ్చి మాదిరిగా వ్యవహరించింది. ప్రత్యేక హోదా వల్ల ఎక్కువ ప్రయోజనం ఉండదని, ప్యాకేజీ అయితే అంతకంటే బెటర్‌గా ఉంటుందని బాబుకు బ్రెయిన్‌వాష్‌ చేసింది. ప్రత్యేక హోదా అంశం విభజన చట్టంలో పెట్టలేదు కాబట్టి ఇవ్వడం కుదరదని చెప్పింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఇతర రాష్ట్రాలూ తమకూ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తాయంది. ఇలా ఒక్కో కారణం చెబుతూ హోదా ఎగ్గొట్టింది.

హోదా విభజన చట్టంలో పెట్టకపోయినా అది పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీ అనే విషయం బీజేపీ, కేంద్రం తుంగలో తొక్కాయి. రైల్వేజోన్‌ విషయం విభజన చట్టంలోనే ఉన్నప్పటికీ ఎగ్గొట్టింది. జోన్‌ విషయం ఇతర రాష్ట్రాలతో ముడిపడి ఉన్న అంశమని సాకు చెప్పింది. పరిశీలనలో ఉందని ఓసారి, నివేదిక రాగానే ఇస్తామని మరోసారి పనికిమాలిన కారణాలు చెబుతూ కాలక్షేపం చేసింది. ఇప్పుడు రైల్వేబోర్డును అడ్డుపెట్టుకుంది. 

'బోర్డు అభ్యంతరం చెబుతోంది కాబట్టి జోన్‌ ఇవ్వలేం' హోం మంత్రితోనో, మరో అమాత్యుడి చేతనో చెప్పిస్తారు. హోదా విషయంలో ప్యాకేజీ అన్నట్లే, ఇప్పుడు జోన్‌ ఇవ్వలేమని, రైల్వేలైన్‌ ఇస్తామంటోంది. అంటే జోన్‌ కంటే రైల్వేలైన్‌ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పడమన్నమాట. విశాఖలో రైల్వేజోన్‌ ఏర్పాటు చేయలా? వద్దా? అనే విషయం అధ్యయనం చేసేందుకు నియమించిన కమిటీ కేంద్ర ప్రభుత్వానికి కొంతకాలం కిందట నివేదిక ఇచ్చింది.

రైల్వేజోన్‌ విషయం ఏమైందంటూ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అడిగినప్పుడు నివేదిక అందిందని, పరిశీలనలో ఉందని సర్కారు సమాధానం ఇచ్చింది. ఆ తరువాత కథ  ముందుకు సాగలేదు. ఇప్పుడు రైల్వేబోర్డు ఛైర్మన్‌ జోన్‌ ఇచ్చేది లేదని చెప్పేశారు. అది సాధ్యం కాదని కమిటీ చెప్పిందట...! దీనిపై రాజకీయ నిర్ణయం తీసుకుంటే తప్ప జోన్‌ రాదని బోర్డు ఛైర్మన్‌ చెప్పారు. గత ఏడాది పార్లమెంటు బడ్జెటు సమావేశాలప్పుడు చంద్రబాబు టీడీపీ ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో జోన్‌పై గట్టిగా పట్టుబట్టాలని చెప్పారు. 'దేన్నీ వదిలేది లేదు' అని చెప్పగానే 'యస్‌ బాస్‌' అని వారూ అన్నారు. 

కాని ఏమీ చేయలేకపోయారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఓ ఇంటర్వ్యూలో  రైల్వేజోన్‌ గురించి చెబుతూ 'రైల్వేజోన్‌ కొంత సంక్లిష్టమైంది. దానిపైనా పరిశీలన జరుగుతోంది' అని చెప్పారు. రైల్వేజోన్‌ పెద్ద ముఖ్యమైన విషయం కాదన్నట్లుగా ఏపీ బీజేపీ నేతలు కొందరు ఓ సందర్భంలో అన్నారు. జోన్‌ ఇవ్వాల్సిందేనని ప్రతిపక్షాలు గట్టిగా డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి ఈమధ్య రైల్వేజోన్‌ వృథా అన్నట్లుగా మాట్లాడారు. 

జోన్‌ వల్ల రాష్ట్రానికి ఏం ఒరగదన్నారు. 'ఒకవేళ రైల్వేజోన్‌ వచ్చినా రైల్వేకు వచ్చే నిధుల్లో రాష్ట్రానికి వాటా రాదు. కడితే నాలుగు భవనాలు కడతారు. మహా అయితే ఓ వందకోట్లు ఖర్చవుతాయి' అని మీడియాతోనే చెప్పారు. ఇక తాజాగా బీజేపీ ఎమ్మెల్యే అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ విశాఖకు రైల్వేజోన్‌ తీసుకొచ్చే బాధ్యత తమదేనన్నారు. 'రాజకీయ నిర్ణయం తీసుకుంటాం. రైల్వేజోన్‌ వచ్చి తీరుతుంది'.. అని బల్ల గుద్దారు. 

అధికారులు ఎప్పుడూ వ్యతిరేకంగానే మాట్లాడతారని ముక్తాయించారు. మరి ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా ఏ అధికారులు మాట్లాడారు?