Advertisement

Advertisement


Home > Politics - Political News

పాలిటిక్స్ కు వెళ్లే ముందు కలిసి సినిమా?

 పాలిటిక్స్ కు వెళ్లే ముందు కలిసి సినిమా?

అటు రజనీకాంత్ కు, ఇటు కమల్ హాసన్ కు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు అత్యంత కీలకం. వీరు రాజకీయంగా సత్తా ఏమైనా చూపించాలనుకుంటే అది అసెంబ్లీ ఎన్నికల్లోనే జరగాలి. అంతకన్నా లేట్ అయితే వీళ్ల రాజకీయానికి తెరపడినట్టే! మరో ఏడాదిన్నరలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో అటు రజనీ, ఇటు కమల్ ఇద్దరూ చేతిలోని సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు.

రజనీకాంత్ సినిమాల మీద సినిమాలు ఒప్పుకుంటున్నాడు. కమల్ హాసన్ సినిమాలు రెండు పెండింగ్ లో ఉన్నాయి. ఆ సంగతలా ఉంటే.. కమల్ హాసన్ తన సొంత బ్యానర్ మీద కొత్త సినిమాలకు సైన్లు పెట్టించుకుంటూ ఉన్నారట. అందులో భాగంగా 'ఖైదీ' డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో కమల్ ఒక సినిమాకు సంతకం పెట్టించుకున్నారట. రాజ్ కమల్ ఇంటర్నేషనల్స్ పతాకంపై ఆ సినిమా రూపొందబోతోంది.

అందులో కమల్ నటిస్తాడో లేదో ఇంకా ప్రకటన రాలేదు. అయితే అందులో రజనీకాంత్ నటించబోతున్నారనే ప్రచారం మొదలైంది.'ఖైదీ' సినిమాతో ఈ దర్శకుడికి చాలా డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో రజనీకాంత్ ను కలిసి కథ చెప్పాడట అతడు. 

ఆ సినిమాలో రజనీకాంత్ తో పాటు కమల్ కూడా నటిస్తారని… దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఈ హీరోలిద్దరూ కలిసి ఒకే సినిమాలో కనిపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కమల్- రజనీ కాంబోలో సినిమా వస్తుందనే ప్రచారం జరుగుతూ ఉంది. మరి ఒకవైపు రాజకీయాలకు టైమ్ అవుతున్నా.. ఈ హీరోలిద్దరి సినిమాల గురించి మాత్రం బోలెడన్ని ఊహాగానాలు కొనసాగుతూనే ఉండటం గమనార్హం!

 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?