Advertisement

Advertisement


Home > Politics - Political News

ఎంపీ పాశ్వాన్ పై రేప్ కేసు!

ఎంపీ పాశ్వాన్ పై రేప్ కేసు!

లోక్ జ‌న‌శ‌క్తి పార్టీ ఎంపీ ప్రిన్స్ రాజ్ పాశ్వాన్ పై ఢిల్లీ పోలీసులు అత్యాచారం కేసుల‌ను న‌మోదు చేశారు. ఒక మ‌హిళ ఫిర్యాదు మేర‌కు పాశ్వాన్ పై ఈ కేసులు నమోద‌య్యాయి. ఎల్జేపీ ఫ‌స్ట్ ఫ్యామిలీ స‌భ్యుల్లో ఒక‌రైన ప్రిన్స్ రాజ్ పై న‌మోదైన ఈ కేసులు మ‌రోసారి పాశ్వాన్ ఫ్యామిలీని వార్త‌ల్లోకి తీసుకు వ‌చ్చాయి. ఇటీవ‌లే ఎల్జేపీలో తిరుగుబాటు చోటు చేసుకుంది.

దివంగ‌త రామ్ విలాస్ పాశ్వాన్ త‌న‌యుడు చిరాగ్ పాశ్వాన్ పై ఆయ‌న బాబాయ్ త‌దిత‌రులు తిరుగుబాటు చేశారు. చిరాగ్ పాశ్వాన్ ను త‌మ నేత కాదంటూ, ప‌శుప‌తి కుమార్ ను త‌మ పార్టీ నేత‌గా ఎన్నుకున్నారు. ఎల్జేపీలోని ఈ తిరుగుబాటును బీజేపీ కూడా గుర్తించింది. ప‌శుప‌తికి కేంద్ర మంత్రి ప‌ద‌విని కేటాయించారు. ఇప్పుడు అటు ప‌శుప‌తికి, ఇటు చిరాగ్ కు బంధువు క‌మ్ ఎంపీ అయిన ప్రిన్స్ రాజ్ పాశ్వాన్ పై అత్యాచారం కేసులు న‌మోద‌య్యాయి.

ఒక మ‌హిళ మూడు నెల‌ల కింద‌టే ఢిల్లీ పోలీసుల‌కు ఈ ఉదంతంపై ఫిర్యాదు చేసింది. అయితే ఈ వ్య‌వ‌హారంలో పోలీసులు కేసులు న‌మోదు చేయ‌లేదు.  చివ‌ర‌కు ఢిల్లీ కోర్టు ఆదేశాల మేర‌కు కేసులు న‌మోదు చేశారు. త‌ను ప్రిన్స్ రాజ్ పాశ్వాన్ ను పార్టీ ఆఫీసులో క‌లిసిన‌ట్టుగా ఆ మ‌హిళ పేర్కొంది. తాగ‌డానికి నీళ్లు అడ‌గ‌గా, ఏదో క‌లిపి ఉన్న నీటిని త‌న‌కు ఇచ్చి, అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లేట్టు చేసి త‌న‌పై అత్యాచారం చేశాడంటూ ఆమె ప్రిన్స్ రాజ్ పై ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

అత్యాచార ఘ‌ట‌న‌ను వీడియోగా కూడా తీశాడంటూ ఆమె ఆరోపించింది. ఆ వీడియోలో ప్రిన్స్ క‌న‌ప‌డ‌కుండా, త‌ను మాత్ర‌మే క‌న‌ప‌డేట్టుగా చేశార‌ని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.  ఆ త‌ర్వాత త‌నను పెళ్లి చేసుకుంటానంటూ ప్రిన్స్ కొంత కాలం గ‌డిపేశాడ‌ని, అలాగే  ఈ ఉదంతంలో ప్రిన్స్ ను కాపాడేందుకు చిరాగ్ పాశ్వాన్ కూడా ప్ర‌య‌త్నించాడంటూ ఆమె ఫిర్యాదు చేయ‌డం గ‌మ‌నార్హం.  ఇలా ఈ కేసుల్లో చిరాగ్ పాశ్వాన్ ను కూడా ఇన్ వాల్వ్ చేశారు. ఎఫ్ఐఆర్ లో చిరాగ్ పాశ్వాన్ పేరును కూడా ప్ర‌స్తావించిన‌ట్టుగా తెలుస్తోంది. 

చిరాగ్ పాశ్వాన్ పై తిరుగుబాటు ఎంపీల్లో  ప్రిన్స్ రాజ్ పాశ్వాన్ ఒక‌రు. ఎన్డీయే అనుబంధంగా ఉన్న ఎల్జేపీ ఎంపీగా ప్రిన్స్ రాజ్ కొన‌సాగుతున్నాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?