Advertisement

Advertisement


Home > Politics - Political News

రేషన్ డోర్ డెలివరీ.. ఇంత రాద్దాంతం ఎందుకు?

రేషన్ డోర్ డెలివరీ.. ఇంత రాద్దాంతం ఎందుకు?

దేశంలో ఎక్కడా లేనట్టు.. ఇంటి వద్దకే రేషన్ సరకుల డోర్ డెలివరీని వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఆల్రెడీ శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ గా విజయవంతం అయిన డోర్ డెలివరీ.. మిగతా జిల్లాల దగ్గరకి వచ్చే సరికి మాత్రం పురిటి కష్టాలు పడుతోంది. అయితే పథకం అమలు తీరులో ఏదైనా లోపం ఉందా, లేదా కావాలని పచ్చమీడియా దుష్ప్రచారం చేస్తుందా అనేది నిదానంగా తేలే విషయం.

రేషన్ ట్రక్ డ్రైవర్ల జీతం సరిపోదంటే ఇటీవలే 21వేలకు పెంచింది ప్రభుత్వం. అందులోనే అసిస్టెంట్ జీతం, ట్రక్ ఈఎంఐ, డీజిల్ ఖర్చులు అన్నీ ఉంటాయి. అయినా కూడా డ్రైవర్లు మాకీ పని వద్దంటూ వెళ్లిపోతున్నారు. అసలు కారణం ఏంటి..?

పని ఒత్తిడి సహజమే..

కొత్తగా ఓ పనిలో కుదిరిన తర్వాత తొలి నెలకే దాన్ని వదిలిసే వెళ్లారంటే పూర్తి స్థాయిలో దానిపై అవగాహన లేనట్టే లెక్క. 

రెండు నెలలు పరిస్థితిని గమనించి, అది తమకు సరిపోదు అనుకుంటే ఓకే, రేషన్ సరకుల పంపిణీ మొదలుపెట్టిన రోజుల వ్యవధిలోనే మాకీ పని వద్దు అంటే ఎలా అర్థం చేసుకోవాలి, ఎవరి ప్రోద్బలంతో కొంతమంది డ్రైవర్లు ఇలా నిరసనలకు దిగుతున్నారు. దీనిపై అధికారులు పూర్తి స్థాయిలో దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.

డీలర్ల సహకారం అందడంలేదా..?

రేషన్ సరకుల పంపిణీలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన డీలర్లు.. వాహనాల డ్రైవర్లను కావాలనే ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణ కూడా ఉంది. ఈ-పోస్ మిషన్ల వాడకంలో డ్రైవర్లకు అవగాహన అంతంతమాత్రమే, ఆ విషయంలో అన్నీ తెలుసున్న డీలర్లు మాత్రం వారికి ఏమాత్రం సహకరించడంలేదట. 

కేవలం సరకులు, మిషన్ అందించి చేతులు దులుపుకుంటున్నారట. వాహనంలోకి సరకు చేరవేయడానికి కూడా కొంతమంది కనీస సాయం చేయడంలేదని, తమకు సంబంధం లేదని చెబుతున్నారని, అందుకే ట్రక్ డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు.

షాపులు ఎక్కువ, వాహనాలు తక్కువ..

రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులకు సమానంగా వాహనాల సంఖ్య లేకపోవడంతో పని ఆలస్యం అవుతోంది. ప్రస్తుతం మన రాష్ట్రంలో 29,783 రేషన్ షాపులున్నాయి, వాహనాలు మాత్రం 9260 మాత్రమే. సగటున మూడు షాపులకి ఒక వాహనం కేటాయిస్తున్నారు. 

ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్లుగా సుమారు 500మంది వాహన డ్రైవర్లు సర్పంచ్ అభ్యర్థులుగా, వార్డు మెంబర్లుగా పోటీ చేసినట్టు సమాచారం. అంటే వీరంతా అప్పటికే జాబ్ రిజైన్ చేసి పోటీలో దిగారు. దీంతో వాహనాలున్నా, డ్రైవర్లు లేరు, కొత్తవారిని తీసుకున్నా.. వారికి ఈపోస్ మిషన్ పై వేలిముద్ర వేసే అథెంటిఫికేషన్ లేదు. దీంతో సరకుల పంపిణీ ఆలస్యం అవుతోంది.

జీతం సరిపోలేదని ఓసారి, పని ఒత్తిడి ఎక్కువ అవుతోందని మరోసారి, అసిస్టెంట్ ని ప్రభుత్వమే సమకూర్చాలని మరోసారి.. ఇలా రేషన్ ట్రక్ డ్రైవర్లు అధికారులకు తమ ఆందోళన తెలియజేస్తున్న సందర్భాలున్నాయి. ఎక్కడికక్కడ అధికారుల వాటిని సరిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నా.. టీడీపీ అనుకూల మీడియా మాత్రం ఏదో జరిగిపోతున్నట్టు రాద్ధాంతం చేస్తోంది. 

రేషన్ డోర్ డెలివరీపై ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అనే ముద్ర వేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికైనా అధికారులు దీనిపై వెంటనే స్పందించి, డోర్ డెలివరీ వాహనాలు, డ్రైవర్లకు సరైన మార్గనిర్దేశనం చేయాలి. లేకపోతే దుష్ప్రచారాన్నే జనం నమ్మి, డీలర్ల వ్యవస్థే మేలు అనుకునే ప్రమాదం ఉంది. 

త్వరలోనే తెలుగులో మాట్లాడుతా

ఏపీ మంత్రిమండలి కీలక నిర్ణయాలు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?