cloudfront

Advertisement


Home > Politics - Political News

రాయలసీమ రైతుల పుండుపై కారం

రాయలసీమ రైతుల పుండుపై కారం

వ్యవసాయం.. రాజకీయం.. ఈ రెండూ పరస్పరం ఆధారపడ్డ వ్యవహారాలే. వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లనే రెండువేల నాలుగులో తెలుగుదేశం పార్టీ అంతగా చిత్తు అయ్యింది. వ్యవసాయానికి వైఎస్‌ ఇచ్చిన ప్రాధాన్యతతోనే నాటి ఎన్నికల్లో ఆయన పార్టీ నెగ్గింది. రెండోసారి కూడా వైఎస్‌ ముఖ్యమంత్రి అయ్యారంటే.. అన్ని రంగాలతో పాటు  వ్యవసాయానికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యతే. తనుమారిన మనిషిని అని చెప్పుకున్నారు చంద్రబాబు. గత ఎన్నికల ముందు రైతులకు చాలా వరాలను ప్రకటించారు. ఒకప్పుడు తను తీవ్రంగా వ్యతిరేకించిన రైతులకు ఉచిత విద్యుత్‌ హామీతో సహా గత ఎన్నికల ముందు చంద్రబాబు చాలా హామీలే ఇచ్చారు.

వాటి ప్రభావం గట్టిగానే చూపించింది. ప్రత్యేకించి రైతు రుణమాఫీ.. ఈ హామీ రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి చాలా ఓట్లను తెచ్చిపెట్టింది. సీట్లను కట్టబెట్టింది. రుణమాఫీ హామీ రైతులను ఊరించింది. వ్యవసాయ రుణాలను మాఫీ చేయడంతో పాటు.. వ్యవసాయం కోసం రైతులు బంగారు తాకట్టు పెట్టి తెచ్చుకున్న రుణాలన్నింటినీ రద్దు చేస్తున్నట్టుగా.. అధికారం ఇస్తే చాలు.. అని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆయన పార్టీ నేతలు ఆ ప్రచారాన్ని ఒక రేంజ్‌లో చేసుకున్నారు.

ప్రత్యేకించి అనంతపురం వంటి జిల్లా రుణమాఫీ మీద చాలా ఆశలతోనే కనిపించింది. అందుకు నిదర్శనమే ఆ జిల్లాలో టీడీపీ స్వీప్‌ చేయడం. అయితే తీరా గద్దెను ఎక్కాకా రైతు రుణమాఫీ గురించి చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరు ఏమిటో వివరించనక్కర్లేదు.

తాకట్టులో ఉన్న బంగారంపై తెచ్చుకున్న అప్పులతో సహా అన్నీ రద్దే అని.. రౖతులు పూర్తిగా రుణ విముక్తులే అని ప్రకటించిన చంద్రబాబు నాయుడుకు అధికారం దక్కగానే  చాలా షరతులు గుర్తుకు వచ్చాయి. అనేక షరతులతో మాఫీకి చాలామందిని అనర్హులుగా చేశారు. బంగారు రుణాలపై మాఫీనే లేకుండా పోయింది.

కేవలం లాంగ్‌టర్మ్‌ లోన్లు ఒకటీ.. మాఫీ కిందకు అన్నారు. దానికీ ఛాలా షరతులు పెట్టారు. ఎన్నికల ముందు చెప్పిన మాటకూ ఎన్నికల తర్వాత వ్యవహరించిన తీరుకూ సంబంధం లేకుండా పోయింది. ఇక కనీసం అర్హులుగా తేలిన వారికి అయినా మాఫీ చేశారా.. అంటే అదీలేదు. విడతల వారీగా మాఫీ అన్నారు.

నోరుతెరిస్తే అబద్ధాలే!
రైతు రుణమాఫీ విషయంలో నోరుతెరిస్తే అబద్దాలే అన్నట్టుగా సాగింది కథ. ఒకవైపు మాఫీ అయిపోయిందని అన్నారు. అయితే విడతల వారీగా ఏదో కొద్ది మొత్తాలను ఖాతాల్లోకి వేస్తూ వచ్చారు.  అయితే ఈ విడతల వారీగా వేసే మొత్తాలకూ, రైతుల రుణాలపై వచ్చే వడ్డీలకూ సరిపోతూ వస్తోంది. మరి ఆ విడతల వారీగా అయినా సరిగా వేశారా అంటే.. ఇప్పటివరకూ వేసింది మూడు విడతలే!

చంద్రబాబు నాయుడి పాలన కాలంలో ఐదో సంవత్సరం అయిపోతూ ఉంది. కానీ ఇప్పటివరకూ మూడు విడతల సొమ్ములను జమ చేశారు. మాఫీ అయిపోయిందని చెప్పుకుంటున్న చంద్రబాబు పార్టీ వాళ్లే.. నాలుగు, ఐదో విడతల మాఫీ సొమ్మును ఇప్పుడు జమ చేస్తున్నట్టుగా ప్రకటించుకుంటున్నారు.

ఇప్పుడు మరో మోసానికి తెరలేపినట్టే!
నాలుగు, ఐదో విడతల మాఫీకి సంబంధించి మరో మోసానికి తెరలేపారు. ఇందుకు సంబంధించి బడ్జెట్‌లో కేటాయింపులే చేయలేదు. కొన్ని వేలకోట్ల రూపాయలు చెల్లించాలి. అందుకే.. కొత్త ఎత్తుగడ కింద పోస్ట్‌డేటెడ్‌ చెక్కులను సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు చెక్కులు మాత్రమే ఇస్తారు.. దానికి మళ్లీ అధికారంలోకి వస్తే.. అనే షరతును పెట్టడానికి రెడీ అవుతున్నారు. గత ఎన్నికల నాటి హామీని, అరకొరగా అమలు చేస్తూ... ఇప్పుడు పోస్టుడేటెడ్‌ చెక్కులు ఇస్తూ.. మళ్లీ అధికారం అప్పగించాలని రైతులను బ్లాక్‌ మెయిల్‌ చేయడం!

ఇదీ రుణమాఫీ కథ. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎన్నో ఓట్లును, కొన్ని సీట్లను.. అంతిమంగా అధికారాన్ని అప్పగించిన కీలకమైన హామీ విషయంలో ఇదీ చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు. రుణమాఫీ అమలు సాధ్యంకాదు.. అని జగన్‌ అప్పుడు అంటే.. చేసి చూపిస్తామని తెలుగుదేశం వాళ్లు సవాళ్లు విసిరారు. ఇదీ వాళ్లు చేసిన మాఫీ. రైతులు పుండు మీద కారంచల్లుతూ ఉన్నారు. అసలే మంటతో ఉన్న రైతులకు ఇప్పుడు పోస్ట్‌డేటెడ్‌ చెక్కులు ఇస్తే.. అప్పుడే అసలు కథ మొదలయ్యేది!

బాబు పాలనపై గ్రేట్ ఆంధ్ర సర్వే ఫలితాలు!

ప్రజాస్వామ్యానికే పెనుముప్పుగా మారిన వైనం!