cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Political News

నిమ్మ‌గ‌డ్డ‌, బాబు గౌర‌వార్థం సామెతకు సంస్క‌ర‌ణ‌

నిమ్మ‌గ‌డ్డ‌, బాబు గౌర‌వార్థం సామెతకు సంస్క‌ర‌ణ‌

కాలంతో పాటు స‌మాజంలో అనేక మార్పులు చోటు చేసుకుంటూ వ‌స్తున్నాయి. అందుకు త‌గ్గ‌ట్టు వివిధ  అంశాల్లో మార్పులు చేసుకుంటూ వ‌స్తుండ‌డం తెలిసిందే. మాన‌వ స‌మాజంలో చోటు చేసుకుంటున్న విప‌రీత ధోర‌ణుల నేప‌థ్యంలో కొన్ని సూక్తులు, విశేష‌ణాలు సృజ‌నాత్మ‌క‌త‌తో పుట్టుకొస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో పురాత‌న కాలం నుంచి ఎంతో పాపులారిటీని సంపాదిం చుకున్న  ఒక సామెత‌ను మార్చుకోవాల్సి ఉంద‌నే బ‌ల‌మైన అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మ‌రీ ముఖ్యంగా ప్ర‌తి నిత్యం రాజ‌కీయ నేత‌లు త‌మ ప్ర‌త్య‌ర్థుల‌ను దెప్పి పొడ‌వ‌డానికి వాడే దెయ్యాలు వేదాలు వ‌ల్లించిన‌ట్టు అనే సామెత‌లో మారిన సామాజిక‌, కాల‌మాన ప‌రిస్థితుల‌కు అనుగుణంగా సంస్క‌ర‌ణ‌ తీసుకురావాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. అస‌లు క‌నిపించ‌ని దెయ్యాల గురించి ప‌దేప‌దే ప్ర‌స్తావించ‌డం కంటే, క‌ళ్లెదుట ఉన్న వాళ్ల‌ను విస్మ‌రించ‌డం మంచిది కాదేమో.

ఇక‌పై ఆ సామెత‌ను నిమ్మ‌గ‌డ్డ‌, చంద్ర‌బాబు వేదాలు వ‌ల్లించిన‌ట్టుంద‌ని మార్చుకుంటే బాగుంటుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తాజాగా వారి మాట‌ల‌ను చూస్తే ....దెయ్యాల స్థానంలో వాళ్లిద్ద‌రిని చేర్చ‌డం ద్వారా ...శాశ్వ‌తంగా ఆ మ‌హానుభా వుల‌ను గౌర‌వించుకున్న‌ట్టువుతుంద‌నే అభిప్రాయాలున్నాయి.

పంచాయ‌తీ ఎన్నిక‌ల‌పై హైకోర్టు సింగిల్ బెంచ్ స్టే ఇచ్చిన నేప‌థ్యంలో ఎస్ఈసీ డివిజ‌న్ బెంచ్‌కు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా హైకోర్టులో ఎస్ఈసీ త‌ర‌పు న్యాయ‌వాది చేసిన వాద‌న చూస్తే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌కుండా ఉండ‌దు. "ఎన్నికలు నిలిపివేస్తే ప్రజా స్వామ్యంపై ప్రజలకు నమ్మకం పోతుంది. కావున షెడ్యూల్ ప్ర‌కారం ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు త‌క్ష‌ణం స్టే ఎత్తివేయాలి"  అని  రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) హైకోర్టులో బ‌ల‌మైన వాద‌న‌లు వినిపించింది. గ‌డువు లోపు (2018) ఎన్నిక‌లు నిర్వ‌హించ‌క పోవ‌డం ఎస్ఈసీ చేసిన మొద‌టి త‌ప్పు.

అలాగే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ప్ర‌క్రియ కొన‌సాగుతుండ‌గా, ఒక‌ట్రెండు క‌రోనా కేసులున్న స‌మ‌యంలో, దాని సాకు చూపి వాయిదా వేయ‌డం రెండో త‌ప్పు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ చేప‌డుతున్న త‌రుణంలో క‌క్ష‌పూరితంగా ఎన్నిక‌లు జ‌రిపించాల‌నుకోవ‌డం మూడో త‌ప్పు. 

ఇలా త‌ప్పుల మీద త‌ప్పులు చేస్తూ ... త‌న ప‌ద‌వీ విర‌మ‌ణ లోపు పంతం నెగ్గించుకోవాల‌నే యావ త‌ప్ప‌, మ‌రే ప్ర‌జాప్ర‌యోజ‌నాలు ప‌ట్టించుకోని నిమ్మ‌గ‌డ్డ ప్ర‌జాస్వామ్యం గురించి ధ‌ర్మోప‌న్యాసాలు చెప్డాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

ఇక మ‌రో మ‌హానుభావుడు చంద్ర‌బాబు గురించి కూడా త‌ప్ప‌క చెప్పుకోవాలి. తెలుగువారి మొద‌టి పండుగ సంక్రాంతి. పంట‌లు పండి ఇళ్ల‌కు చేరే స‌మ‌యంలో ఈ పండుగ వ‌స్తుంది. అందుకే సంక్రాంతిని రైతుల పండుగ‌గా పిలుచుకుంటారు.

ఈ విశేషాన్ని పుర‌స్క‌రించుకుని టీడీపీ అధినేత చంద్ర‌బాబు రైతుల కేంద్రంగా జ‌గ‌న్ స‌ర్కార్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ విమ‌ర్శ‌ల్లో ఆశ్చ‌ర్యం, ఆందోళ‌న క‌లిగించే అంశం ఏంటంటే...

"రుణ మాఫీ సొమ్ము రూ. 8 వేల కోట్లు ఎగ్గొట్టారు. అటు బీమా అందక.. ఇటు ఇన్‌పుట్‌ సబ్సిడీ రాక నష్టపోయారు. ధాన్యం కొనుగోళ్ల బకాయిలు రూ.2,700 కోట్లు పెండింగ్‌లో పెట్టి రైతులకు సంక్రాంతి ఆనందం లేకుండా చేశారు" ...ఇలా సాగాయి చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు.

రుణ‌మాఫీ చేస్తాన‌ని హామీ ఇచ్చి అధికారంలోకి వ‌చ్చింది చంద్ర‌బాబు అనే విష‌యం అంద‌రికీ తెలుసు. బాబు హామీని న‌మ్మి రైతులంతా గంప‌గుత్త‌గా ఓట్లు వేసి అధికారంలోకి తెచ్చారు. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఐదు విడ‌త‌ల్లో రుణ‌మాఫీ చేస్తాన‌ని బాబు హామీ ఇచ్చారు. అయితే మూడు విడ‌త‌ల్లో మాత్ర‌మే డ‌బ్బు జ‌మ చేసి, మిగిలిన రెండు విడ‌త‌ల సొమ్మును ఎగ్గొట్టిన ఘ‌న‌త చంద్ర‌బాబుది. 

తాజాగా బాబు చెబుతున్న రూ.8వేల కోట్ల రుణ‌మాఫీ ఆయ‌న‌ హ‌యాంలోనిదే. అయితే ఈ విష‌యాలేవీ ఎవ‌రికీ తెలియ‌ద‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై బాబు అవాకులు చెవాకులు పేలుతున్నారు.

ఇటీవ‌ల నివ‌ర్ తుపాను వ‌ల్ల న‌ష్ట‌పోయిన రైతాంగానికి, గ‌తంలో ఏ ప్ర‌భుత్వం చేయ‌ని విధంగా కేవ‌లం రెండు వారాల్లోనే న‌ష్ట‌పోయిన పంట‌ను బ‌ట్టి జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఆర్థిక సాయం అందించింది. ఈ విష‌య‌మై రైతుల‌ను అడిగితే వాస్త‌వాలేంటో చంద్ర‌బాబుకు తెలిసొస్తాయి. నిజాల్ని కూడా అబద్ధాలుగా న‌మ్మించేందుకు పదేప‌దే చెబితే, చివ‌రికి నిజాలు చెప్పినా కూడా న‌మ్మ‌ని ప‌రిస్థితి వ‌స్తుంద‌ని చంద్ర‌బాబు గ్ర‌హిస్తే మంచిది.

కావున నిమ్మ‌గ‌డ్డ‌, చంద్ర‌బాబు లాంటి వారిని మ‌న క‌ళ్లెదుట పెట్టుకుని, వారి గౌర‌వార్థం సామెత‌లను సంస్క‌రించుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌నే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. అందువ‌ల్ల క‌నిపించ‌ని దెయ్యాల‌ను అవ‌మానించ‌డం కంటే , క‌నిపిస్తున్న నిమ్మ‌గ‌డ్డ‌, చంద్ర‌బాబును గౌర‌వించాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిపై ఉంది.

ఇక మీద‌ట దెయ్యాలు వేదాలు వ‌ల్లిస్తున్నాయ‌నే సామెత‌కు చిన్న మార్పు ...అంటే నిమ్మ‌గ‌డ్డ‌, చంద్ర‌బాబు వేదాలు వ‌ల్లిస్తున్న ట్టుగా అని చెప్పుకోవ‌డం ద్వారా ...భ‌విష్య‌త్ త‌రాలు వారి గురించి తెలుసుకునే అవ‌కాశాన్ని క‌ల్పించిన‌ట్టు అవుతుంది.

ఈ సంక్రాంతి అల్లుడు నేనే

గవర్నర్‌ దత్తాత్రేయను కలిసిన సీఎం జగన్

 


×