cloudfront

Advertisement


Home > Politics - Political News

రెండు చోట్ల 'మహా' హడావుడి

రెండు చోట్ల 'మహా' హడావుడి

తెలంగాణ-ఆంధ్ర రెండుచోట్ల రాజకీయంగా 'మహా' హడావుడిగా వుంది. తెలంగాణలో మహాకూటమి వ్యవహారాలు రంజుగా వుంటే, ఆంధ్రలో మహారాష్ట్ర బాబ్లీ వ్యవహారంలో కోర్టు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకు సంబంధించి నాన్ బెయిల్ బుల్ వారెంట్లు అందడం హడావుడిగా మారింది.

ఇలా ఇరుచోట్లు మహా రాజకీయ స్టార్ట్ అయింది. నిజానికి కోర్టు నాన్ బెయిల్ బుల్ వారెంట్లు ఇవ్వడం అన్నది మరీ దారుణమైన విషయంకాదు. హాజరు కచ్చితంగా వుండాలనే ఆలోచనతో ఇలా నాన్ బెయిల్ బుల్ వారెంట్లు ఇస్తారు. కానీ అక్కడ చిన్న పాయింట్ వుంది. వరుసగా కోర్టు సమన్లు ఇస్తున్నా, రాకపోతేనే ఇలా నాన్ బెయిల్ బుల్ వారెంట్ ఇస్తారు. కానీ తెలుగుదేశం నేతలు, చాలాకాలంగా ఏ నోటీసులు ఇవ్వకుండా ఇలా నాన్ బెయిల్ బుల్ వారెంట్లు ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

తనపైకి వచ్చే ఏ అస్త్రాన్నైనా తెలివిగా, ప్రత్యర్థులపైకే వినియోగించే చాకచక్యం చంద్రబాబుకు వుంది. పైగా అందుకు ఆయనకు అన్నివిధాలా సహకరించే మీడియా వుంది. ఇలాంటి నేపథ్యంలో ఈ నాన్ బెయిల్ బుల్ వారెంట్ వ్యవహారాన్ని కూడా బ్రహ్మాండంగా రాజకీయంగా వాడేసుకుంటారు చంద్రబాబు అండ్ కో. అది మాత్రం గ్యారంటీ. 

సమన్లు, నోటీసులు ఇచ్చేది కోర్టు అయినా, ఇదంతా మోడీ సర్కారు కుట్ర అన్న రేంజ్ లో, బాబును ఇరుకున పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే విధంగా ఇక 'మహా' హడావుడి ప్రారంభమవుతుంది. కోర్టులు జగన్ కు నోటీసులు ఇచ్చినా, ఇంకేం చేసినా అది రాజకీయం కాదు. అవే కోర్టులు బాబుకు నోటీసులు ఇచ్చినా, ఇంకేం చేసినా, అది పక్కా రాజకీయం. ఇదే తెలుగుదేశం పార్టీ రెండు కళ్ల సిద్దాంతం.