cloudfront

Advertisement


Home > Politics - Political News

'రిటర్న్ గిఫ్ట్' పై జగన్ రియాక్షన్

'రిటర్న్ గిఫ్ట్' పై జగన్ రియాక్షన్

ఆంధ్రప్రదేశ్ కు వస్తాం, చంద్రబాబు కథలన్నీ బయటపెడతాం, ఆయనకు రిటర్న్ గిఫ్ట్ తప్పకుండా ఇస్తామంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. కేసీఆర్ ఈ ప్రకటన చేసిన వెంటనే చంద్రబాబు కవరింగ్ మొదలుపెట్టారు. బీద అరుపులు ప్రారంభించారు. ఇప్పుడీ 'రిటర్న్ గిఫ్ట్' అంశంపై వైఎస్ఆర్సీ అధినేత జగన్ కూడా స్పందించారు. రిటర్న్ గిఫ్ట్ అంటే ఎందుకంత భయపడుతున్నారో చెప్పాలని బాబును డిమాండ్ చేశారు.

"చంద్రబాబుకు బుద్ధి చెప్పడం కోసం టీఆర్ఎస్ నేతలు ఆంధ్రప్రదేశ్ కు వస్తామని ప్రకటించారు. వాళ్లు ఇలా ప్రకటించిన వెంటనే ఊసరవెల్లి కంటే స్పీడుగా చంద్రబాబు రంగులు మార్చారు. ప్రత్యేక హోదాను టీఆర్ఎస్ వ్యతిరేకించింది, అలాంటి పార్టీ ఏపీకి రావడం ఏంటి, ప్రతిపక్షంతో కలిసి పనిచేయడం ఏంటి అంటూ ఏదేదో మాట్లాడుతున్నారు. నిజంగా ప్రత్యేక హోదాను టీఆర్ఎస్ అడ్డుకుందని చంద్రబాబు భావిస్తే, అదే టీఆర్ఎస్ తో పొత్తు కోసం హరికృష్ణ భౌతికకాయం సాక్షిగా చంద్రబాబు ఎందుకు ప్రయత్నించారు?"

ఇలా చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు జగన్. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన జగన్.. చంద్రబాబు రెండు నాల్కల ధోరణిని ఎండగట్టారు. ఒకప్పుడు టీఆర్ఎస్ ను తిట్టిన చంద్రబాబు, తెలంగాణ ఎన్నికల కోసం అదే పార్టీతో పొత్తు కోసం అర్రులుచాచారని విమర్శించారు.

"ధర్మపోరాట దీక్షలంటూ ప్రతి కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుల్ని తిట్టావ్. పనిలోపనిగా నరేంద్ర మోడీని కూడా తిట్టావు. ఇప్పుడు అదే టీఆర్ఎస్ తో పొత్తు కోసం ఎందుకు ఉర్రూతలూగుతున్నావు. ఈ పెద్దమనిషి బీజేపీతో కలిస్తే బీజేపీ మంచిది. కాంగ్రెస్ తో కలిస్తే కాంగ్రెస్ మంచిది. ఈ చంద్రబాబు మురికి కాలువలో దూకితే అదే గంగానది అని చెబుతాడు. ఆ స్థాయిలో చంద్రబాబు రాజకీయాల్ని బ్రష్టు పట్టించాడు." 

తను చేసిందే న్యాయం, తను చెప్పిందే ధర్మం అనే టైపులో చంద్రబాబు వ్యవహారశైలి ఉంటుందని... ఇక బాబుకు నచ్చని వాళ్లపై బురద జల్లేందుకు ఎల్లో మీడియా ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆరోపించారు జగన్.  కాంగ్రెస్ తో బాబు పెట్టుకున్న అనైతిక పొత్తుపై కూడా జగన్ విమర్శలు గుప్పించారు.

"తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు, ఊసరవెల్లి కంటే స్పీడుగా రంగులు మార్చాడు. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ తో పొత్తు కోసం నానా ప్రయత్నాలు చేశారు. పొత్తు కాకుండా మోడీ అడ్డుకుంటున్నాడని అసెంబ్లీ సాక్షిగా అన్నారు. ఆ మాట అన్న కొన్ని రోజులకే సిగ్గులేకుండా ఢిల్లీ వెళ్లి మరీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాడు ఈ పెద్దమనిషి. చంద్రబాబు చేసిన అవినీతిపై పుస్తకం విడుదల చేసిన ఇదే కాంగ్రెస్ పార్టీ అతడితో కలిసిపోయింది. వాళ్లకు అవినీతి సొమ్ములో భాగం దొరికినట్టుంది."

ఇలా రోజుకోసారి రంగులు మార్చే చంద్రబాబును నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తిచేశారు జగన్.  ప్రజలను గాలికి వదిలేసి విమానాల్లో విహరించే ఇలాంటి నేతలకు బుద్ధిచెప్పాలని కోరారు.