Advertisement


Home > Politics - Political News
రేవంత్‌ వెంట ఎవరెళ్లిపోతారు?

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్‌ టాపిక్‌ తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి. పచ్చ పార్టీలో ఉంటాడా? కాంగ్రెసులోకి వెళ్లిపోతాడా? అనేది ఒక చర్చయితే, ఆయన వెంట ఎవరెవరు వెళతారనేది మరో చర్చ. సాధారణంగా ఏ నాయకుడైనా పార్టీ మారేటప్పుడు ఆయన వెంట ముఖ్యలైనవారు, కానివారు కూడా వెళ్లిపోతారు. టీడీపీలో బలమైన నాయకుడు, పైర్‌బ్రాండ్‌ రేవంత్‌ వెళ్లిపోయేటప్పుడు కొందరు వెళ్లకుండా ఎలా ఉంటారు? ఈయన కాంగ్రెసులో చేరతాడనే ప్రచారం జరుగుతున్నప్పటి నుంచి ఓ ఎమ్మెల్యే, కొందరు నాయకులు వెళ్లిపోతారని సమాచారం వస్తోంది. ఇతర నాయకుల విషయం అలా వుంచితే ఎమ్మెల్యే ఎవరనేది తేలాల్సిఉంది. తెలంగాణ టీడీపీలో మిగిలింది ముగ్గురు ఎమ్మెల్యేలే. ఒకరు రేవంత్‌ కాగా, మరో ఇద్దరు సండ్ర వెంకట వీరయ్య, బీసీ సంఘం అధినేత ఆర్‌.కృష్ణయ్య. ఒకవేళ రేవంత్‌తో వెళ్లేది వెంకట వీరయ్య కావొచ్చు. ఓటుకు నోటు కేసులో ఈయన కూడా ఉన్నాడు కాబట్టి అదే బాటలో నడుద్దామని అనుకోవచ్చు.

ఆర్‌.కృష్ణయ్య మొదటినుంచి అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అయినప్పటికీ పార్టీపై అభిమానం, ప్రేమ లేవు. అధినేత పట్ల విధేయతా లేదు. బాబు కంటే బీసీ ఉద్యమమే ప్రధానం. ఆయన ఎప్పుడో వెళ్లిపోతాడనుకున్నారు. సొంత పార్టీ పెట్టే ఆలోచన ఉన్నట్లు అప్పుడప్పుడు చెబుతుంటాడు. కాబట్టి ఆయన రేవంత్‌ వెంట కాంగ్రెసులో చేరే అవకాశం లేదు. రేవంత్‌, వెంకట వీరయ్య వెళ్లిపోతే కృష్ణయ్య కూడా ఉండకపోవచ్చు. అదే జరిగితే ఎమ్మెల్యేలు లేని పార్టీగా టీడీపీ మిగిలిపోతుంది. మరోమాటలో చెప్పాలంటే తెలంగాణలో పార్టీ శూన్యమైపోయనట్లే. చంద్రబాబు నాయుడు విదేశాల్లో పది రోజుల పర్యటన ముగించుకొని వచ్చేసరికి ఈ నాయకుడు వెళ్లిపోవడానికి అంతా సిద్ధం చేసుకుంటాడేమో...! ఆయన ధోరణి చూస్తే ఆగేలా కనబడటంలేదు.

ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సహా పలువురు ఆంధ్రా టీడీపీ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేశాడు. యనమలకు కేసీఆర్‌ రెండు వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇచ్చారని, ఇద్దరి మధ్యా ఆర్థిక సంబంధాలున్నాయని ఆరోపించారు. తెలంగాణలో పొత్తుల విషయం ఈ రాష్ట్రం నాయకులే చూసుకోవాలని, ఇందులో చంద్రబాబు కల్పించుకోకూడదని రేవంత్‌ అభిప్రాయం. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలో తామే నిర్ణయించుకుంటామని చెప్పాడు. పొత్తు విషయంలో స్వేచ్ఛ ఇవ్వాలన్నాడు. రేవంత్‌ ఇలా అనడానికి చంద్రబాబే కారణం.

తెలంగాణలో పార్టీ వ్యవహారాలు చూసుకునే తీరిక, అవకాశం తనకు లేవని, ఈ రాష్ట్ర కమిటీ ప్రతి విషయానికీ తనపై ఆధారపడకుండా స్వతంత్రంగా వ్యవహరించాలని పార్టీ సమావేశాల్లో చెప్పారు. అందుకే కాంగ్రెసుతో పొత్తు పెట్టుకుంటామని రేవంత్‌ ముందుగానే ప్రకటించి ఉండొచ్చు. మోత్కుపల్లి నర్సింహులు టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుంటామని చెప్పేసరికి కోపం వచ్చింది. అహం దెబ్బ తిన్నది. పొత్తుపై చంద్రబాబు క్లారిటీ ఇవ్వకపోవడం మరో కారణం. కాంగ్రెసు నాయకులు కూడా రేవంత్‌పై ఒత్తిడి తెస్తుండవచ్చు. టీడీపీ అధికార ప్రతినిధి అరవింద కుమార్‌ గౌడ్‌ తాజాగా రేవంత్‌ను రెచ్చగొట్టేలా మాట్లాడాడు. ఆయన పార్టీని వదిలినా నష్టం లేదని, ఉంటాడో, పోతాడో స్పష్టం చేయాలని అన్నాడు. కాంగ్రెసుతో పొత్తు ఉండదన్నాడు. రేవంత్‌ గురించి ఆంధ్రా టీడీపీ నేతలు సైతం ఆందోళన చెందుతుండగా గౌడ్‌ ఇలా మాట్లాడటం నష్టం కలిగించే అవకాశముంది. చంద్రబాబు విదేశాల్లో ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు పరిణామాలు తెలుస్తూనే ఉంటాయి. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మరి.