Advertisement


Home > Politics - Political News
రేవంత్‌ ఆ 'రహస్యం' చెప్పనన్నాడా?

తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి కాంగ్రెసులోకి వెళ్లడం ఖాయమైనా ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పట్టాభిషేకం తరువాత ఆ లాంఛనం పూర్తి కావొచ్చు. ఆయన తమ పార్టీలోకి రావడం 99 శాతం ఖాయమైనా ఒక శాతం సందేహం ఉందని కొందరు కాంగ్రెసు నాయకులు చెబుతున్నారు. జరిగేది ఎలా ఉన్నప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రేవంత్‌ ప్రకంపనాలు పుట్టించాడనేది వాస్తవం.

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సహా పలువురు టీడీపీ నాయకులపై చేసిన ఆరోపణలకు ఇప్పటివరకు జవాబు లేదు. ఏం మాట్లాడితే ఏం ఇబ్బందులు వస్తాయోనని భయపడుతున్నారు. చాలామందిలో జరుగుతున్న చర్చ ఓటుకు నోటు కేసు గురించే. రేవంత్‌ కాంగ్రెసులోకి వెళ్లిన తరువాత దీన్ని గురించి ఏమైనా మాట్లాడతాడా? అనే గుబులు ఉంది.

ముఖ్యంగా ఆనాడు స్టీఫెన్‌సన్‌కు ఇచ్చిన 50లక్షల గురించి ఈ నాయకుడు పెదవి విప్పుతాడేమోనని భయపడిపోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ డబ్బు ఇతని సొంతం కాదు. చంద్రబాబు నాయుడు స్వయంగా ఇచ్చారో, ఏ టీడీపీ నాయకుడి నుంచి ఇప్పించారో, పార్టీ నిధుల నుంచి ఇచ్చారో తెలియదు. ఏ నాయకుడైనా పార్టీ మారినప్పుడు అంతకుముందు తానున్న పార్టీపై, అధినేతపై ఆరోపణలు చేయడం ఆనవాయితీగా మారిపోయింది. ఆవేశంలోనో, ప్లాన్‌ ప్రకారమో రహస్యాలు కూడా బయటపెట్టవచ్చు. అయితే తాను కాంగ్రెసులోకి వెళ్లినా ఓటుకు నోటు కేసు గురించి అసలు మాట్లాడనని, డబ్బు గురించి చెప్పనని రేవంత్‌ కొందరు టీడీపీ నాయకులతో చెప్పినట్లు సమాచారం. రేవంత్‌ ఇలా అన్నారని ఓ టీవీ ఛానెల్‌ సీనియర్‌ జర్నలిస్టు ఇన్ఫర్మేషన్‌.

ఓటుకు నోటు కేసులో రేవంత్‌ ప్రధాన నిందితుడు. చంద్రబాబు ప్రమేయం కూడా ఉంది. ప్రస్తుతం కేసు కోర్టులో విచారణలో ఉంది. విచారణలో ఉన్న కేసు గురించి మాట్లాడకూడదు కదా. అందుకే అందుకు సంబంధించిన విషయలేవీ ప్రస్తావించనని రేవంత్‌ చెప్పివుండొచ్చు. ఇప్పటికైనా తెలంగాణ  సర్కారుతో ఆంధ్రా నాయకుల ఆర్థిక లావాదేవీలు, కాంట్రాక్టుల గురించి బయటపెట్టి  సంచలనం కలిగించాడు. ఇదొక శాంపిల్‌గా చూపించాడనుకోవచ్చు. ఇలాంటి ఆరోపణలే చంద్రబాబు మీద చేసే అవకాశం ఉందా? అనే సందేహం కలుగుతోంది. ఏపీ ముఖ్యమంత్రిపైనా, అక్కడి టీడీపీ నాయకుల మీదా రేవంత్‌ ఆరోపణలు చేసినట్లయితే అక్కడ వైకాపా, కాంగ్రెసు, ఇతర ప్రతిపక్షాలకు సర్కారు మీద దాడి చేయడానికి ఉపయోగపడతాయి.

ఈయన పక్కాగా ఆరోపణలు చేయడంలో దిట్ట. ఇంతకాలం కేసీఆర్‌పై ఒంటికాలి మీద లేచిన రేవంత్‌ కాంగ్రెసులో చేరితే టీడీపీని కూడా టార్గెట్‌ చేసుకుంటాడు. తెలంగాణ టీడీపీ నాయకులనూ వదలడు. ఇక రేవంత్‌ రావడానికి కొందరు కాంగ్రెసు నాయకులు వ్యతిరేకిస్తుండగా, కొందరు స్వాగతిస్తున్నారు. ప్రతి పార్టీలోనూ ఇది సహజమే. అతను ఫైర్‌బ్రాండ్‌. ఇతర నాయకులను డామినేట్‌ చేసే తత్వం. ఈయన ధాటికి తట్టుకోలేక టీడీపీ నుంచి కొందరు వెళ్లిపోయారు. ఇదంతా కాంగ్రెసు నాయకులకు తెలుసు కాబట్టి ఆయన వస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని చర్చించుకుంటున్నారు.

అందులోనూ ప్రచార కమిటీ సారథ్యం అప్పగించడంతోపాటు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి ఇవ్వాలనే ప్రతిపాదన ఉంది. అదే జరిగితే ప్రాధాన్యం పెరుగుతుంది. రేవంత్‌ తనతో పాటు పలువురు ప్రాధాన్యమున్న నాయకులను, ఇతర లీడర్లను పాతికమంది వరకు తీసుకెళతాడని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెసులో ఈయనదొక గ్రూపు ఏర్పడుతుంది. వచ్చే ఎన్నికల్లో తనవారికి 15 మందికి అసెంబ్లీ టిక్కెట్లు ఇవ్వాలనే షరతు విధించాడట...! కాంగ్రెసులోకి ఎవరొచ్చినా బేషరతుగా రావల్సిందేనని ఢిల్లీ నాయకులు చెబుతున్నా అది జరిగేది కాదని అందరికీ తెలుసు. ప్రయోజనం కలగందే పార్టీలో చేరరు కదా. రేవంత్‌ జంప్‌ అయ్యాక రెండు రాష్ట్రాల్లో టీడీపీ పరిస్థితి ఎలా ఉంటుందో, ఆయన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో చూడాలి.