Advertisement

Advertisement


Home > Politics - Political News

సీఎం గారు మేమేం తక్కువ చేశాం

 సీఎం గారు మేమేం తక్కువ చేశాం

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో ఈనెల కోత పడుతోంది. తెలంగాణలో ఏకంగా జీతాలు కట్ చేసి ఇస్తుంటే, ఏపీలో వాయిదా పద్ధతి అంటూ జగన్ కాస్త ఊరటనిచ్చారు. అయితే అత్యవసర సేవలలో పాల్గొన్న పోలీస్, వైద్య, శానిటరీ ఉద్యోగులకు మాత్రం ఫుల్ శాలరీస్ ఇస్తామని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి.

లాక్ డౌన్ టైమ్ లో ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగులు, ఇరిగేషన్, ఇంజినీరింగ్ వంటి విభాగాల ఉద్యోగులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. రాష్ట్ర సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు కూడా వంతులవారీగా డ్యూటీలకు వచ్చారు. జీతాల వాయిదా నిర్ణయంతో వీరు పెద్దగా బాధపడలేదు కానీ.. రెవెన్యూ ఉద్యోగులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లాక్ డౌన్ సమయంలో పోలీస్ డిపార్ట్ మెంట్ తో సమానంగా రెవెన్యూ డిపార్ట్ మెంట్ కూడా పనిచేసింది. ఇతర ప్రాంతాలనుంచి ఎవరెవరు గ్రామాల్లోకి, పట్టణాల్లోకి వచ్చారు, వారి ఆరోగ్య పరిస్థితి ఏంటనే విషయాన్ని ఏఎన్ఎంలతో సహా వెళ్లి పరిశీలించి కలెక్టర్లకు నివేదికలిచ్చింది రెవెన్యూ ఉద్యోగులే. లాక్ డౌన్ సమయంలో నిర్ణీత సమయాల్లో షాపులు తెరిచేలా చూడటం, ప్రజలు సామాజిక దూరం పాటించేలా చూడటం, ప్రభుత్వం ప్రకటించిన ధరలకే సరుకులు అమ్మేలా చర్యలు తీసుకోవడం, ఇవన్నీ చూసింది రెవెన్యూ ఉద్యోగులే.

డిప్యూటీ తహశీల్దార్లు, రెవెన్యూ ఇన్స్ పెక్టర్లు.. ఈ డ్యూటీలకు హాజరు కాగా ఎమ్మార్వోలు దగ్గరుండి వీటిని పర్యవేక్షించారు. ఇక వారం రోజులనుంచి రేషన్ సరకుల పంపిణీని దగ్గరుండి పర్యవేక్షించింది కూడా రెవెన్యూ ఉద్యోగులే. లబ్ధిదారుల బదులు వీఆర్వోలే ఈపోస్ మిషన్లలో వేలిముద్రలు వేసి రేషన్ పంపిణీ చేశారు. లాక్ డౌన్ లో అందరూ ఇళ్లకే పరిమితమైన రోజుల్లో కూడా తాము డ్యూటీలు చేశామని, అయితే జీతాల విషయంలో తమకు అన్యాయం జరిగిందని అంటున్నారు రెవెన్యూ ఉద్యోగులు. పోలీస్, హెల్త్ డిపార్టమెంట్స్ తో పోలిస్తే తామేం తక్కువ చేశామో చెప్పాలంటున్నారు.

కనీసం ఉద్యోగ సంఘాల నేతలైనా తమ పక్షాన ముఖ్యమంత్రికి విన్నవించకపోవడం దారుణమంటున్నారు రెవెన్యూ ఉద్యోగులు. కష్టకాలంలో ప్రజా శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకుని పనిచేసిన పోలీస్, వైద్య, శానిటరీ సిబ్బందితో పాటు.. తాము కూడా డ్యూటీలు చేశామని, అయినా జీతాల్లో సగం వాయిదా వేయడం సరికాదని అంటున్నారు.

మరి వీరి ఆవేదనని జగన్ సర్కారు పరిగణలోకి తీసుకుంటుందా, ఇప్పటికే ఆలస్యమైందని ఈసారికి సర్దుకోవాలని చెబుతుందా.. వేచి చూడాలి.

గుర్తుంచుకోండి ఈ ఆదివారం రాత్రి 9 గంటలకి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?