cloudfront

Advertisement


Home > Politics - Political News

రోజా... ఎన్నిక‌ల 'రంగ‌స్థలం'లో దూకేదెన్నడు?

రోజా... ఎన్నిక‌ల 'రంగ‌స్థలం'లో దూకేదెన్నడు?

సార్వత్రిక ఎన్నిక‌లు ముంచుకొస్తున్న త‌రుణంలో ప్రతి నియోజ‌క‌వ‌ర్గంలో సంద‌డి మొద‌లైంది. ఈ ప‌రిస్థితికి చిత్తూరుజిల్లా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం మాత్రం అతీత‌మ‌నే చెప్పాలి. ఇక్కడి నుంచి వైసీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. త‌న బ‌ల‌మైన ప్రత్యర్థి, టీడీపీ సీనియ‌ర్ నేత గాలి ముద్దుకృష్ణమ‌నాయుడి అకాల మ‌ర‌ణం, ఇటీవ‌ల ఓ టీడీపీ ప‌త్రిక త‌న స‌ర్వేలో న‌గ‌రి నుంచి తిరిగి రోజా గెలుపొందుతుంద‌ని క‌థ‌నం రాయ‌డంతో రోజా త‌న సీటుకు ఇబ్బంది లేద‌నే భ‌రోసాతో రిలాక్స్ అవుతున్నట్టుగా క‌నిపిస్తున్నారు.

రోజా హైద‌రాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన కొత్తలో ఆమె వారానికి ఒక‌సారి వ‌చ్చి కార్యక‌ర్తల‌తో మాట్లాడి వారి మంచీచెడులను ఆరా తీసేవారు. ఆ త‌ర్వాత రానురానూ రెండువారాల‌కు ఒక‌సారి వ‌చ్చి క‌నిపించేవారు. ఇటీవ‌ల మూడునెల‌ల పాటు న‌గ‌రి వైపు ఆమె క‌న్నెత్తి చూడ‌లేద‌ని వైసీపీ శ్రేణులు ఆవేద‌న వ్యక్తం చేస్తున్నాయి. చిత్తూరుజిల్లాలో న‌గ‌రికి ఓ ప్రత్యేకస్థానం ఉంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి రాజ‌కీయ ఉద్దండులైన గాలి ముద్దుకృష్ణమ‌నాయుడు, రెడ్డివారి చెంగారెడ్డి పోటాపోటీగా త‌ల‌ప‌డేవారు. వీరిద్దరూ నిత్యం జ‌నం మ‌ధ్య ఉంటూ వారి కుటుంబ స‌భ్యుల్లో ఒక‌రిగా మెలిగేవారు. నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌ల‌కు సంబంధించి శుభ‌, అశుభ కార్యాల‌కు పిలుపుతో సంబంధం లేకుండా వెళుతూ వారి ప్రేమాభిమానాల‌కు పాత్రుల‌య్యారు.

రాష్ర్ట విభ‌జ‌న త‌ర్వాత కాంగ్రెస్ ఉనికిలో లేక‌పోవ‌డంతో పాటు వ‌యోభారంతో ఆ పార్టీ నేత చెంగారెడ్డి రాజ‌కీయాల‌కు దూర‌మ‌య్యారు. గాలి ముద్దుకృష్ణమ‌నాయుడు యాక్టీవ్‌గా ఉండేవారు. 2014 సార్వత్రిక ఎన్నిక‌ల్లో గాలి ముద్దుకృష్ణమ‌నాయుడిపై వైసీపీ మ‌హిళానేత‌, సినీన‌టి రోజా 700 పైచిలుకు ఓట్ల తేడాతో గెలుపొంది త‌న చిర‌కాల కోరిక తీర్చుకున్నారు. ఇటీవ‌ల అనారోగ్యంతో గాలి ముద్దుకృష్ణమ‌నాయుడు తుదిశ్వాస విడిచారు. దీంతో న‌గ‌రి ఏ దిక్కూలేని అనాథైంది.  ప్రజ‌ల‌కు అండ‌గా ఉండాల్సిన రోజు క‌నీసం ఫోన్‌కు అందుబాటులో లేక‌పోవ‌డంతో న‌గ‌రి వైసీపీ శ్రేణులు తీవ్ర అసంతృప్తితో ర‌గ‌లిపోతున్నాయి.

న‌గ‌రి నుంచి మున్సిప‌ల్ చైర్‌ప‌ర్సన్ శాంతి, ఆమె భ‌ర్త కుమార్ల ఫోన్‌కాల్స్ మాత్రమే రిసీవ్ చేసుకుంటార‌ని స‌మాచారం. చిన్నచిన్న స‌మ‌స్యల‌ను కౌన్సిల‌ర్ ఏలుమ‌లై త‌న శ‌క్తి మేర‌కు ప‌రిష్కరిస్తూ వైసీపీకి అండ‌గా నిలుస్తున్నారు. జ‌బ‌ర్దస్త్‌, ర‌చ్చబండ‌, బ‌తుకుజ‌ట్కా బండి, రంగ‌స్థలం త‌దిత‌ర కార్యక్రమాల్లో త‌ప్ప నేరుగా త‌మ ఎమ్మెల్యే కనిపించ‌డం లేద‌ని న‌గ‌రి ప్రజ‌ల ఆవేద‌న‌.. షూటింగ్ గ‌ట్టున ఉంటావా రోజ‌మ్మా... ప్రజ‌ల మ‌ధ్యకు వ‌స్తావా రోజ‌మ్మా,  ఆటీవీ, ఈటీవీనంటావా రోజ‌మ్మా... లేక న‌గ‌రి న‌డిబొడ్డుకు వ‌స్తావా రోజ‌మ్మా అని అక్కడి ప్రజ‌లు అడుగుతున్నారు.

టీవీ రంగ‌స్థలం స‌రే, ఎన్నిక‌ల రంగ‌స్థలంలోకి ఇప్పటికైనా రాక‌పోతే శాశ్వతంగా షూటింగ్‌ల‌కే ప‌రిమితం చేసే ప‌రిస్థితి వ‌స్తుంద‌ని న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌లు హెచ్చరిస్తున్నారు. త‌న‌కు ఎమ్మెల్యే ప‌ద‌వి గెస్ట్‌రోల్ అన్నట్టుగా వ్యవ‌హ‌రిస్తున్న  రోజా త‌న వైఖ‌రి మార్చుకోక‌పోతే ఏదో ఒక‌రోజు ఆమె రాజ‌కీయ జీవితం జ‌బ‌ర్దస్త్‌లో కామెడీ షో కాక‌త‌ప్పదు.