Advertisement

Advertisement


Home > Politics - Political News

బీజేపీకి ఆ అవకాశమూ లేకుండా చేస్తున్న జగన్!

బీజేపీకి ఆ అవకాశమూ లేకుండా చేస్తున్న జగన్!

'కేంద్రం పథకాలను తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు..' అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు మీద విరుచుకుపడే వాళ్లు బీజేపీ వాళ్లు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు తరచూ ఆ విమర్శను చేసే వాళ్లు కమలనాథులు. అది కూడా టీడీపీతో తెగదెంపులు చేసుకున్నాకా.

అయితే తన హయాంలో బీజేపీకి ఆ అవకాశం ఇవ్వకుండా చేసుకుంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. అందులో భాగంగా రైతు భరోసా పథకానికి కేంద్రాన్ని కూడా ఇన్ వాల్వ్ చేశారు. ఈ పథకానికి ముందుగా 'వైఎస్సార్ రైతు భరోసా' అంటూ పేరు పెట్టాలనుకున్నా, తర్వాత పీఎం పేరును కూడా యాడ్ చేశారు

'వైఎస్ఆర్ రైతు భరోసా- పీఎం కిసాన్' అంటూ ఈ పథకాన్ని  చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలో ప్రారంభించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.  ముందుగా పన్నెండు వేల ఐదు వందల రూపాయల మొత్తాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నా, ఆ తర్వాత వెయ్యి రూపాయల మొత్తాన్ని పెంచారు. మూడు విడతల్లో ఈ డబ్బులు ఇవ్వబోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో పథకంలో పీఎం కిసాన్ అనే పేరును కూడా యాడ్ చేసి, ఈ పథకంలో కేంద్రం వాటా ఉందనే విషయాన్ని  చాటుతున్నారు జగన్.

తద్వారా బీజేపీకి కూడా తమ ఘనత అంటూ ప్రచారం చేసుకునే అవకాశం తగ్గుతుంది. ఈ పథకంలో మెజారిటీ వాటా రాష్ట్రానిదే. కేంద్రానిది ఆరువేలు, ఏపీది ఏడు వేల ఐదు వందలు. అయినప్పటికీ పీఎం కిసాన్ అంటూ.. మోడీకి కూడా క్రెడిట్ ఇస్తున్నారు జగన్.

ఈ పథకం ప్రారంభోత్సవానికి ప్రధానిని కూడా పిలిచారు జగన్. అయితే ఆయన రాలేదు. ఇలా పీఎం కిసాన్ అని పథకం పేరును అమలు చేయడం ద్వారా బీజేపీలోని కేంద్ర నాయకత్వంతో సన్నిహిత సంబంధాలనే కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి.

ఇక ఈ పథకం అమలుతో చంద్రబాబుకు కూడా జగన్ స్ట్రోక్ ఇచ్చారు. చంద్రబాబు హయాంలో ఈ పథకాన్ని నలభై మూడు లక్షల మంది రైతులకు అమలు అని ప్రకటించారు. ఎన్నికల ముందు ఒక విడత రెండు వేల రూపాయలు చేతిలో పెట్టారు. అయితే జగన్ యాభై నాలుగు లక్షల మందికి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. కౌలు రైతులకూ లబ్ధి కలిగిస్తున్నారు. 

తెలంగాణలో ఇలాంటి పథకమే అమల్లో ఉంది. అయితే అందులో కౌలు రైతులకు లబ్ధి చేకూర్చలేదు. ఇలాంటి నేపథ్యంలో జగన్ కౌలు రైతులకు కూడా అవకాశం ఇస్తూ కేసీఆర్ పాలన కూ ఝలక్ ఇస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ విలీనంలో జగన్ తీసుకున్న చర్యలు కేసీఆర్ మీద ఒత్తిడి పెంచుతున్న సంగతి తెలిసిందే. 

రాంగ్ రూట్లో బాబు ఆత్మశోధన

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?