cloudfront

Advertisement


Home > Politics - Political News

ఎన్నికల రాజకీయాలు చేస్తే ఇంతేమరి...!

ఎన్నికల రాజకీయాలు చేస్తే ఇంతేమరి...!

సినిమా తారలకు రాజకీయాలు సీరియస్‌ వ్యవహారం కాదు. ఎన్నికల సమయంలోనే వారికి ప్రజాసేవ గుర్తుకు వస్తుంది. ఎన్నికల రాజకీయాలు చేసేవారికి ప్రజలు సేవ చేసే అవకాశం ఇవ్వరు. అందుకే కర్నాటకలోని బాగేపల్లి నియోజకవర్గంలో 'డైలాగ్‌ కింగ్‌' సాయికుమార్‌కూ ఇవ్వలేదు. ఒకసారి ఓడిపోయిన ఈ నటుడికి బీజేపీ రెండోసారి టిక్కెట్టు ఇవ్వడమే పెద్ద అదృష్టం. అది కూడా నియోజకవర్గంలో ఉండకుండా, ఎక్కడో హైదరాబాదులో ఉంటూ, సినిమాలు, టీవీ షోలు చేసుకుంటున్న సాయికుమార్‌కు కర్నాటక బీజేపీ మరోసారి టిక్కెట్టు ఇవ్వడం విచిత్రం, విశేషం.

ఎవరిని పట్టుకున్నాడో, ఏం చేశాడోగాని టిక్కెట్టు సంపాదించుకొని బరిలోకి దిగాడు. కాని డిపాజిట్‌ దక్కలేదు. ఇందుకు కారణం ఎన్నికలప్పుడే బాగేపల్లికి వెళ్లి ఓట్లు అడగడం. రాజకీయాలకు, ప్రజాసేవకు అంకితమైనవారు ఓడినా ప్రజల మధ్యనే ఉంటారు. ప్రజాభిమానం చూరగొని మళ్లీ ఎన్నికల్లో గెలవాలనుకుంటారు. అందుకోసం సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తారు. కాని సినిమా తారలు ప్రజాసేవను నమ్ముకోకుండా, ప్రజల మధ్యన ఉండాలనే ఆలోచన చేయకుండా, 'మా తాతలు నేతులు తాగారు.. మా మూతులు వాసన చూడండి' అనే సామెత మాదిరిగా వ్యవహరిస్తారు. అంటే తమ గ్లామర్‌ను, సినిమా చరిత్రను నమ్ముకుంటారు.

సినిమా నటుడిని కాబట్టి తప్పక ఆదరిస్తారని అనుకుంటారు. నిరంతరం ప్రజల్లో ఉండే మహామహులే ఓడిపోయిన దాఖలాలు ఉన్నాయి. ఇక సాయికుమార్‌ వంటివారు ఓ లెక్కా. ఈయన బీజేపీని నమ్ముకున్నందుకు రెండుసార్లు టిక్కెట్టు దక్కింది. ఇక మూడోసారి వస్తుందనుకోలేం. ఎన్నికలు ముగిసి ఫలితాలు కూడా వచ్చేశాయి కాబట్టి, బాగేపల్లితో పనుండదు. ఐదేళ్లవరకు అటు చూడాల్సిన అవసరముండదు. వచ్చే ఎన్నికలనాటికి ఈయన బీజేపీలో ఉన్నా, పార్టీ ఈయన్ని గుర్తుపెట్టుకుంటుందనే నమ్మకమేముంది?

మొదటిసారి ఇక్కడే 2008లో పోటీచేసిన సాయికుమార్‌ రెండువేల ఓట్ల తేడాతో కాంగ్రెసు అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. ఇది కాస్త గౌరవనీయమైన ఓటమే. బాగేపల్లిని తాను నిర్లక్ష్యం చేశానని ఈమధ్య అంగీకరించారు. ఈసారి తప్పనిసరిగా గెలుస్తాననే విశ్వాసం వ్యక్తంచేశాడు. అంతటితో ఆగితే సరిపోయేది. గెలిచాక మంత్రి అవుతానన్నాడు. అంటే బీజేపీ ప్రభుత్వమే ఏర్పడుతుందనుకున్నాడు. ఆ రెండు కోరికలూ మటాష్‌ అయ్యాయి. ఈయన ఓడిపోవడమే కాకుండా, బీజేపీ సర్కారు కూడా ఏర్పడే పరిస్థితి కనబడటంలేదు. ఉదయం ఉన్న పరిస్థితి మధ్యాహ్నంకల్లా మారిపోయింది.