Advertisement

Advertisement


Home > Politics - Political News

షర్మిల జగన్ మాట వినలేదు

షర్మిల జగన్ మాట వినలేదు

తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానంటూ రాజకీయ సంచలనానికి తెరతీశారు వైఎస్ షర్మిల. ఈ క్రమంలో ఆమె, తోడబుట్టిన జగన్ మాట కూడా వినలేదు. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి బయటపెట్టారు. షర్మిల-జగన్ మధ్య రాజయీకంగా అభిప్రాయబేధాలున్న మాట వాస్తవమే అన్నారు సజ్జల.

"అన్నచెల్లెలు మధ్య విబేధాలు లేవు. వ్యక్తిగత స్పర్దలు లేవు. పార్టీని 2 రాష్ట్రాల్లో విస్తరించాలా వద్దా.. విస్తరిస్తే వచ్చే లాభనష్టాలు ఏంటి అనే అంశాలపై బేధాభిప్రాయాలున్నాయి. ఆల్రెడీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కు వీటిపై స్థిరమైన అభిప్రాయాలున్నాయి. వాటిలో ఎలాంటి మార్పు లేదు. 

షర్మిలను పార్టీ పెట్టొద్దని జగన్ నచ్చజెప్పారు. పార్టీ పెడితే వచ్చే నష్టాలు, పరిమితులు చెప్పి గట్టిగానే వద్దని వారించారు. నాలాంటి సన్నిహితులు కూడా వద్దని చెప్పాం. ఇంత చెప్పిన తర్వాత కూడా షర్మిల కావాలనే తన నిర్ణయం తాను తీసుకున్నారు. ఆ పార్టీకి సంబంధించి పూర్తి బాధ్యత షర్మిలదే. దాని ఫలితాలకు కూడా ఆమె బాధ్యత వహిస్తారు. వ్యక్తిగతంగా మాత్రం జగన్-షర్మిల మధ్య ఎలాటి డిఫరెన్సెస్ లేవు."

ఇలా షర్మిల కొత్త పార్టీపై వైసీపీ అభిప్రాయాన్ని బయటపెట్టారు సజ్జల. అదే సమయంలో అన్నచెల్లెళ్ల మధ్య వ్యక్తిగత స్థాయిలో ఎలాంటి విబేధాలు లేవని కూడా స్పష్టంచేశారు. ఇదే విషయాన్ని షర్మిల కూడా ఈరోజు చెప్పుకొచ్చారు.

"జగన్ నాకు తోడబుట్టిన అన్న. వయసులో పెద్దవాడు. ఆయన ఆశీస్సులు నాకు ఉంటాయనే నేను నమ్ముతున్నాను. తెలంగాణలో రాజన్న రాజ్యం లేదు. వైఎస్ఆర్ లేని లోటు ఉంది. తెలంగాణలో రాజన్న రాజ్యం ఎందుకు రాకూడదు."

ఈరోజు నల్గొండ జిల్లా నేతలతో మాట్లాడారు షర్మిల. రాబోయే రోజుల్లో తెలంగాణలోని ఇతర జిల్లాల నేతలతో కూడా మాట్లాడి, మరికొన్ని వారాల్లో పూర్తి వివరాలు ప్రకటిస్తానని తెలిపారు షర్మిల.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?