cloudfront

Advertisement


Home > Politics - Political News

మళ్లీ అదే కుట్ర.. పేపర్ పై 'పచ్చ' విషం

మళ్లీ అదే కుట్ర.. పేపర్ పై 'పచ్చ' విషం

గ్రేట్ ఆంధ్ర నిన్ననే (జగన్ పై రేపు టీడీపీ మీడియా బురద ఇదే!) చెప్పింది. అదే ఈరోజు 'ఆ రెండు పత్రిక'ల్లో ప్రముఖంగా కనిపించింది. ఎన్నికల వేళ జగన్ ను ఎలా ఎదుర్కోవాలో తెలియక ఆ పత్రికలు పచ్చ విషాన్ని చిమ్మడం ప్రారంభించాయి. పసలేని ఆరోపణలతో పేపర్ ను నింపేశాయి. అలా జగన్ ను బద్నామ్ చేస్తూనే, ప్రజల్ని మరోసారి 'పచ్చ'దోవ పట్టించడానికి అనుకుల మీడియా సహాయంతో చంద్రబాబు మరో దొంగాట షురూ చేశారు.

రెండేళ్ల కిందట సీబీఐకి ఈడీ లేఖ రాసిందట. అది ఇప్పుడు దొరికిందట. దాన్ని టీడీపీ వెలుగులోకి తీసుకురావడం విడ్డూరం. సీబీఐ మెమోలో లోపాలు ఉన్నాయని, జగన్ కేసుపై లోతుగా దర్యాప్తు జరపాలని ఈడీ ఆ లేఖలో చెప్పుకొచ్చిందట. ఈడీ రాసిన అంశాల్ని పక్కనపెడితే, దానికి చంద్రబాబు అద్దిన మసాలా గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మోడీతో జగన్ కుమ్మక్కు అవ్వడంవల్లే ఇప్పటివరకు ఆ లేఖ బయటకు రాలేదట.

ఈరోజు ఆ రెండు పత్రికల్లో జగన్ పై విషం చిమ్మే కార్యక్రమం ఇలా షురూ అయింది. అంతేకాదు, ఇకపై ప్రతి రోజు జగన్ పై ఇలాంటి వార్తలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఇది ఎన్నికల సీజన్. మరోవైపు సర్వేలు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి బాబును ఎలాగైనా నిలబెట్టేందుకు ఆయన ద్వారా కోట్ల రూపాయల లబ్ది పొందిన ఆ రెండు పత్రికలు, బాబు దర్శకత్వంలో ఇలా జగన్ పై పేజీల కొద్దీ విషం చిమ్ముతూనే ఉంటాయి.

ఇకపై ప్రతిరోజు చంద్రబాబు ఆఫీస్ నుంచే ఈ పత్రికలకు స్క్రిప్ట్ వెళ్తుంది. మరుసటి రోజు పచ్చ టీవీ ఛానెళ్లలో దానిపై చర్చోపచర్చలు ప్రారంభం అవుతాయి. ఇదంతా బాబు ఆడిస్తున్న హైడ్రామా. ఏదో జరిగిపోతోందంటూ ప్రజల్ని అయోమయానికి గురిచేసేందుకు చేస్తున్న విశ్వప్రయత్నం.

నిజంగా మోడీతో జగన్ కుమ్మక్కయితే, కొన్ని నెలల కిందట జగన్ భార్య భారతి పేరును ఈడీ తన చార్జిషీట్ లో చేరుస్తుందా? ఇంకొన్ని ఆస్తుల్ని ఎటాచ్ చేస్తుందా? ఈమాత్రం ఇంగితజ్ఞానం కూడా లేకుండా జగన్-మోడీ పొత్తు అంటూ అసత్యాల్ని తెరపైకి తీసుకొస్తోంది పచ్చ మీడియా.

ఈ మొత్తం వ్యవహారానికి కారణం సర్వేలు. అవును.. దాదాపు 90శాతం సర్వేలు జగన్ కు అనుకూలంగా, చంద్రబాబుకు వ్యతిరేకంగా వచ్చాయి. దీన్ని తట్టుకోలేక చంద్రబాబు ఆడుతున్న విషపు క్రీడ ఇది. ప్రత్యేకహోదా ఇవ్వని మోడీతో జగన్ కు లింక్ పెడితే ప్రజలు నమ్మేస్తారనేది బాబు ఎత్తుగడ.

పనిలోపనిగా ఈ చెత్త ప్రచారంలోకి కేసీఆర్ ను కూడా లాగేసి, తన శత్రువులందర్నీ ఒకే కేసులో, ఒకే గాటన కట్టేశారు చంద్రబాబు. కానీ ఒకప్పటి రోజులు కావు ఇవి. అప్పట్లో చంద్రబాబు ఎల్లో మీడియా చేసిన ప్రచారం చెల్లింది. ఇప్పుడు మాత్రం నిజానిజాలేంటో ఈ సోషల్ మీడియా యుగానికి అర్థమౌతోంది.

చంద్రబాబు విష ప్రచారంపై నిన్నరాత్రి నుంచే సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి. ఇంకా ఎన్నాళ్లిలా ప్రజల్ని మభ్యపెడతారంటూ బాబుకు గడ్డిపెడుతున్నారు నెటిజన్లు. "మీ కుంభకోణాల్ని దాచుకోవడానికి జగన్ పై విషం కక్కుతున్నారంటూ" నెటిజన్లు ఓపెన్ గానే రియాక్ట్ అవుతున్నారు.

ఇకనైనా చంద్రబాబు తన వక్రబుద్ధి మార్చుకోవాలి. నిజాలు ఒప్పుకొని ఎన్నికల క్షేత్రంలో దిగాలి. ఇలా విషపు ప్రచారంతో కాకుండా, నిర్మాణాత్మక వైఖరితో జగన్ ను ఎదుర్కోవాలి. అప్పుడు కనీస గౌరవమైనా దక్కుతుంది. లేదంటే ఈసారి ప్రజలు బాబును కనీసం మనిషిగా కూడా చూడరు.

మీ ఓటు ఉందో లేదో.. ఇలా నిర్ధారించుకోండి!

బాబుది ఎదురుదాడే.. నిజాన్ని ఎదుర్కొనలేరు!