Advertisement


Home > Politics - Political News
మళ్లీ ఇలాంటి 'దృశ్యం' ఎప్పుడో...!

తమిళనాడులో దివంగత జయలలిత ప్రియ సఖి శశికళ అలియాస్‌ చిన్నమ్మ జైలు జీవితం మళ్లీ మొదలైంది. భర్త నటరాజన్‌ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడంతో అత్యవసరంగా ఐదు రోజుల పెరోల్‌ పొందిన శశికళ ఆ గడువు ముగియగానే ఈరోజు బెంగళూరు సమీపంలోని పరప్పన అగ్రహారం జైలుకు చేరుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జైలుకు వెళ్లిన తరువాత బయటకు రావడం, అందులోనూ స్వరాష్ట్రానికి వెళ్లడం ఇదే మొదటిసారి. ఆమె ఉండగానే నటరాజన్‌కు అవయవ మార్పిడి జరిగింది. ఆయన పరిస్థితి ఏమీ బాగాలేదు. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. అయినప్పటికీ శశికళ చేసేదేం లేదు. తీరని ఆవేదనతో జైలుకు వెళ్లింది.

పెరోల్‌పై చెన్నయ్‌ వెళ్లడం అదృష్టమైతే, పలు నిబంధనలు విధించడంతో కాళ్లూ చేతులు కట్టేసినట్లయింది. తన మద్దతుదారులతో మంతనాలు జరిపేందుకు అవకాశం లేకుండాపోయింది. ఆమె తిరిగి జైలుకు వెళ్లేంతవరకు అన్ని చేదు జ్ఞాపకాలేనా? జైల్లో నెమరేసుకోవడానికి తీపి గురుతులే లేవా? ఉన్నాయి. ఆ దృశ్యాలే ఆమెకు కొంత ఊరట. మన దేశంలో అవినీతి నాయకులకు బ్రహ్మరథం పట్టడం. జైల్లో ఉన్నవారికి, శిక్ష అనుభవించి తిరిగి వచ్చినవారికి జై కొట్టడం, ఘనస్వాగతాలు పలకడం ఆనవాయితీగా మారిపోయింది. శశికళ విషయంలోనూ ఇదే జరిగింది. పెరోల్‌ తీసుకొని చెన్నయ్‌కి రోడ్డు మార్గం ద్వారా వస్తున్నప్పుడే మద్దతుదారులు ఆమెకు స్వాగతం పలికారు.

భర్త చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లగానే అక్కడికీ వచ్చారు. ఆమె చెన్నయ్‌కి వస్తున్నప్పుడు వాహనాన్ని ఆపిన మద్దతుదారుల్లో కొందరు తమ చిన్నపిల్లలను తీసుకువచ్చి పేర్లు పెట్టమని కోరారు. ఎంజీఆర్‌ను, జయలలితనూ ఇలాగే అడిగేవారు. పిల్లలకు పేర్లు పెట్టాలని కోరుతూ జయలలిత దగ్గరకు తండోపతండాలుగా వచ్చేవారు. ఆమె మగపిల్లవాళ్లకు ఎంజీఆర్‌ అని, ఆడపిల్లలకు సంధ్య అని పెట్టేవారు. సంధ్య ఆమె తల్లి. మరి శశికళ ఏం పేర్లు పెట్టారో...!

శశకళ వస్తున్న మార్గంలో వినాయకుడి ఆలయం ఉంది. అక్కడ దిగి కాసేపు పూజ చేశారు. జయలలితకు ఇష్టమైన గుడి ఇది. ఆమె తరచుగా అక్కడికి వెళ్లి పూజలు చేసేవారు. ఆమె ఆస్పత్రికి చేరుకున్నప్పుడు అక్కడ గుమికూడిన మద్దతుదారులు 'తియగ తలైవి చిన్నమ్మ' (త్యాగమూర్తి విప్లవనాయకి చిన్నమ్మ) అని నినదించారు. ఆమె కారు మీద పూలు చల్లారు. హారతులిచ్చారు. ఆమె చెన్నయ్‌లో ఉండగానే పళనిసామి మంత్రివర్గంలోని సెల్లూరు కె.రాజు చిన్నమ్మను ప్రశంసించారు.

అన్నాడీఎంకే మళ్లీ అధికారంలోకి రావడానికి చిన్నమ్మే కారణమని, ఇందుకు ఆమె ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే ప్రభుత్వం కొనసాగడంలో ఆమె పాత్ర ఎంతో ఉందని, ఇందులో మరో అభిప్రాయానికి తావులేదని అన్నారు. ప్రభుత్వంలో ఉంటూ శశకళను ప్రశంసించడం సంచలనమైంది. ఆ తరువాత ఆయన ఏదో వివరణ ఇచ్చుకున్నాడనుకోండి అది వేరే విషయం. పెరోల్‌ మీద వచ్చిన జయ నేస్తానికి ఇవన్నీ తీపి జ్ఞాపకాలే కదా.

అయినప్పటికీ ఇదంతా తాత్కాలికమే. కన్నూమిన్నూ కానకుండా వ్యవహరించి, కోట్ల విలువైన అక్రమాస్తులు కూడబెట్టడమే కాకుండా, తమిళ రాజకీయాలను శాసించాలనుకున్న ఆమె  ఇప్పుడు అత్యంత దయనీయంగా ఉంది. భర్త నటరాజన్‌ తీవ్ర అనారోగ్యంతో, ఆపరేషన్‌లు చేయించుకొని ఆస్పత్రిలో ఉండగా, ఆమె జైల్లో మగ్గాల్సిరావడం విచారకరం. కాని స్వయంకృతాపరాధం అనుభవించక తప్పదు కదా.  మళ్లీ ఇలా ఎప్పుడు పెరోల్‌ మీద వస్తుందో తెలియదు.