Advertisement

Advertisement


Home > Politics - Political News

నీ లాజిక్కేంటి రమేషా..?

నీ లాజిక్కేంటి రమేషా..?

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్వామిభక్తి పరాయణుడని స్థానిక ఎన్నికల వాయిదాతో రాష్ట్ర ప్రజానీకానికంతటికీ తెలిసింది. ఆ తర్వాత ఆయన సంధించిన లేఖాస్త్రాలు కూడా ఫక్తు రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ సదరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి ఉన్నాయనే విషయాన్ని బహిర్గతం చేశాయి. తీరా ఇప్పుడు కరోనా టైమ్ ని కూడా వదలకుండా రమేష్ కుమార్ తన అధికారాన్ని చెలాయించాలని చూస్తున్నారు. గతంలో తానిచ్చిన బదిలీ ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయలేదన్న అక్కసో, లేక చంద్రబాబు రుణం మరోసారి తీర్చుకోవాలన్న ఉద్దేశమో తెలియదు కానీ.. తాజాగా రమేష్ కుమార్ కలెక్టర్లకి మరోసారి ఎన్నికల కమిషనర్ హోదాలో ఆదేశాలు జారీ చేశారు.

కరోనా విపత్తు సాయంగా ఇస్తున్న వెయ్యి రూపాయల పంపిణీలో వాలంటీర్లతో కలసి స్థానిక సంస్థలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా పాల్గొన్నారనేది టీడీపీ, సీపీఐ, బీజేపీ అభియోగం. దీన్ని అడ్డం పెట్టుకుని ప్రలోభాలపై నివేదికలివ్వాలంటూ రమేష్ కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. వెయ్యి రూపాయల ఆర్థిక సాయం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కాదంటూనే.. అభ్యర్థులు నేరుగా సాయం చేస్తే అది నేరమేనని సెలవిచ్చారు రమేష్ కుమార్.

ప్రజలకు సాయం చేయాలనుకునేవారు తాను అభ్యర్థినా, విద్యార్థినా.. అనే విషయం ఆలోచించరు. ఉన్నదాంట్లో కొంచెం పేదలకు పంచిపెడతారు. కరోనా కష్టకాలంలో ఇళ్లకే పరిమితమైన చాలామంది నిరుపేదలు ఉపాధి లేక అల్లాడిపోతుంటే వైసీపీ నేతలు, అభ్యర్థులే కాదు, చాలామంది స్వచ్ఛంద కార్యకర్తలు కూడా రంగంలోకి దిగారు. కరోనా భయాలను పక్కనపెట్టి మరీ వీరు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. రమేష్ వాలకం చూస్తుంటే.. ప్రజల్ని అధికార పార్టీవారెవరూ పట్టించుకోవద్దు అన్నట్టుంది.

వాలంటీర్ల ద్వారా నగదు బదిలీ.. సరిగా జరుగుతుందో లేదో తెలుసుకునే ఉద్దేశంతోటే కొన్ని ప్రాంతాల్లో వైసీపీ నాయకులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లారు, ఒకటీ అరా ఫొటోలు దిగి.. ఉత్సాహంతో సోషల్ మీడియాలో పెట్టారు. ఇదేమీ దాపరికం కాదు. వీరిలో కొంతమంది అభ్యర్థులు కూడా ఉండొచ్చు. వెయ్యి రూపాయల సాయంతో పాటు.. తాము స్వచ్ఛందంగా కొంతమందికి ఆర్థికంగానూ, వస్తు రూపేణా సాయం చేసి ఉండొచ్చు. అంతమాత్రాన అది ఎన్నికల నియమావళి ఉల్లంఘన, ప్రలోభాల కిందకు వస్తుందా?

అలా వస్తుంది అనుకుంటే.. కూరగాయల కిట్లు, ఆహారం ప్యాకెట్లపై బీజేపీ, టీడీపీ చేస్తున్న ప్రచారంపై రమేష్ కుమార్ ఏమని సమాధానం చెబుతారు. చాలా చోట్ల టీడీపీ అభ్యర్థులు తమ ఫొటోలు అతికించుకుని మరీ కూరగాయలు సరఫరా చేస్తున్నారు. బీజేపీ కూడా తక్కువేం కాదు, మోదీ ఫొటోలు వేసి మరీ ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నాయి. మరి ఆ రెండు పార్టీల ప్రలోభాల సంగతేంటి? వీటిని విపత్తు సాయంగా చూడాలా లేక ప్రలోభ పెట్టడం అనాలా?

కష్టం వచ్చినప్పుడు పేదలకి చేసే సాయంలో కూడా రాజకీయ వెదికారంటే.. టీడీపీ, బీజేపీ చేస్తున్న సాయంలో నిజంగానే రాజకీయం ఉందన్నమాట. పచ్చకామెర్లు వచ్చినవారికి లోకమంతా పచ్చగా కనపడుతుంది కాబట్టే.. వీరు వైసీపీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దానికి రమేష్ కుమార్ వత్తాసు పలికారు. కరోనా కంటే జఠిలమైన వైరస్ లు తామేనని మరోసారి నిరూపించుకున్నారు.

ఈ లాక్ డౌన్ పెంచమని మోదీగారిని కోరతాను

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?