
మహారాష్ట్ర సోషల్ అండ్ జస్టిస్ మంత్రిపై బాలీవుడ్ సింగర్ రేణుశర్మ అత్యాచార ఆరోపణలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. తనకు న్యాయం చేయాలని ప్రధాని మోడీని సైతం ఆమె కోరడం గమనార్హం. మరోవైపు తనపై బాలీవుడ్ సింగర్ రేణు శర్మ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతోందని సదరు మంత్రి ఆరోపిస్తుండడం విశేషం.
మహారాష్ట్ర మంత్రి ధనుంజయ్ ముండే తనపై చాలా కాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నాడని సింగర్ రేణు శర్మ ఒడిశాలోని అంధేరి పోలీస్ స్టేషన్లో రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వంచించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయినా ఇంత వరకూ మంత్రిపై పోలీసులు కేసు నమోదు చేయలేదని తాజాగా ఆమె ట్వీట్ చేశారు. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించి న్యాయం చేయాలని ప్రధాని మోడీతో పాటు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ను ఆమె వేడుకోవడం గమనార్హం.
ఈ నేపథ్యంలో అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ధనుంజయ్ ముండేను మంత్రి పదవి నుంచి తొలగించాలని ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు రాసిన లేఖలో మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డిమాండ్ చేశారు. బాధితురాలి తరపు న్యాయవాది మాట్లాడుతూ బాధిత సింగర్‌కు మంత్రి ధనంజయ్‌తో 1997 నుంచి పరిచయం ఉందన్నారు. బాలీవుడ్లో సింగర్‌గా అవకాశం ఇప్పిస్తానని నమ్మబలికి ఆమెను మొట్టమొదట దగ్గర చేసుకున్నట్టు ఆమె ఆరోపించారు.
2008లో మొదటిసారిపై ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టు లాయర్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో గత కొన్నేళ్లుగా బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడుతున్నట్టు లాయర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోవాలని 2019లో కోరగా మంత్రి నిరాకరించినట్టు లాయర్ తెలిపారు. మంత్రిపై చర్యలు తీసుకునేంత వరకూ న్యాయస్థానంలో పోరాడుతామన్నారు.
ఇదిలా ఉండగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి వాదన మరోలా ఉంది. బాలీవుడ్ సింగర్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందన్నారు. నిజానికి ఆమె సోదరితో తాను సహజీవనం సాగిస్తున్నట్టు చెప్పారు. అక్కాచెల్లెల్లిద్దరూ తనను బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు గుంజాలని ప్రయత్నిస్తున్నారని మంత్రి ఆరోపించారు.
అక్కాచెల్లెల్లిద్దరిపై గతేడాది నవంబర్‌లో పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినట్టు మహారాష్ట్ర మంత్రి తెలిపారు. తనపై ఆరోపణలు చేస్తున్న సింగర్ సోదరితో తనకు 2003 నుంచి సంబంధం ఉందని.. తమకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని ధనుంజయ్ ముండే తెలిపారు.
తమ మధ్య సంబంధం గురించి ఇటీవల కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లానన్నారు. వారు కూడా అంగీకరించారన్నారు. అంతా సాఫీగా సాగుతున్న తరుణంలో తనపై ఇలా తప్పుడు ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని మంత్రి మండి పడ్డారు.
గవర్నర్ దత్తాత్రేయను కలిసిన సీఎం జగన్