
నిన్న మొన్నటి వరకూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను ఆకాశమే హద్దుగా పొగడ్తలతో ముంచెత్తిన టీడీపీ అధినేత చంద్రబాబు ....ఇప్పుడు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నారు. అయితే ఇదంతా పొలిటికల్ గేమ్‌లో భాగమా? లేక సీరియస్సా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మొత్తానికి నిమ్మగడ్డ తీరుపై నారా సార్ మండిపడుతున్నారు.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయని, అధికార యంత్రాంగం బాగా పనిచేసిందని ఎస్ఈసీ మీడియా సమావేశంలో కితాబిచ్చారు. ఈ నేపథ్యంలో ఎస్ఈసీపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగాయా? అని ప్రశ్నించారు.
ఎస్ఈసీ పరిధిలో ఉన్న అధికారాలను ఉపయోగించి ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిపించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. న్యాయస్థానం ఆదేశాలను ఎన్నికల కమిషన్ ఎందుకు అమలు చేయలేదని బాబు నిలదీశారు. టీడీపీ ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా ఎస్ఈసీ చర్యలు తీసుకోలేదన్నారు.
రోడ్డుపై ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఓటర్లు ప్రయత్నిస్తుంటే.. ఎన్నికల కమిషన్ నిర్వీర్యమై పోయందని ఎస్ఈసీపై బాబు ఘాటు విమర్శలు చేశారు. అధికార యంత్రాంగం బరితెగిస్తే వాళ్లపై చర్యలు తీసుకోలేదన్నారు.
పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు పల్టీలు కొట్టడంతో చంద్రబాబు తీవ్ర అసహనానికి లోనైనట్టు ...ఆయన మాటల్లో ప్రతిబింబించింది. ఓటమిని ఎస్ఈసీపై వేసి, తన ఫెయిల్యూర్‌ను కప్పి పుచ్చుకోవాలని తంటాలు పడుతున్నారనే విమర్శలున్నాయి.
ఒకవైపు 40-50 శాతం పల్లెలను దక్కించుకున్నామని చెబుతూనే, మరోవైపు ఎస్ఈసీపై విమర్శలు చేయడం పలు అనుమానాలకు తావిస్తోందని వైసీపీ నేతలు అంటున్నారు. ఎస్ఈసీపై బాబు విమర్శలు ఉత్తుత్తివే అని వైసీపీ అంటోంది. ఎస్ఈసీని నమ్ముకుని బరిలో తెగిన చంద్రబాబుకు గ్రామీణ ఓటర్ల దెబ్బకు మైండ్ బ్లాక్ అయ్యిందేమోనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.