cloudfront

Advertisement


Home > Politics - Political News

టీడీపీ నేత శివప్రసాద్ కన్నుమూత

టీడీపీ నేత శివప్రసాద్ కన్నుమూత

తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎంపీ, నటుడు శివప్రసాద్ కన్నుమూశారు. కొన్నాళ్లుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న శివప్రసాద్ చెన్నైలోని అపోలో హాస్పిటల్స్ లో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శివప్రసాద్ వయసు 68 ఏళ్లు.

1951, జులై 11న చిత్తూరు జిల్లా పొట్టిపల్లిలో జన్మించారు శివప్రసాద్. తిరుపతి ఎస్వీ వైద్యకళాశాలలో వైద్యవిద్యను అభ్యసించారు. వైద్యుడిగా సేవలందిస్తూనే చిత్రరంగంలో ప్రవేశించారు. చిన్న చిన్న పాత్రలు చేశారు. కమెడియన్ గా, సాఫ్ట్ విలన్ గా మెప్పించారు. అక్కడితో ఆగకుండా దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా కూడా మారారు. 2006లో వచ్చిన డేంజర్ చిత్రానికి గాను నంది అవార్డ్ సైతం అందుకున్నారు.

సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా ఎంపికయ్యారు. 1999 నుంచి 2004 వరకు ఎమ్మెల్యేగా సేవలందించారు. 2009, 2014లో ఎంపీగా సేవలందించారు. రాజకీయాల్లోకి కూడా సినిమాల్ని తీసుకొచ్చిన ఘనత శివప్రసాద్ కే దక్కుతుంది. తన నటనానుభవంతో విచిత్ర వేషాలు వేసి, రాజకీయాల్లో తన నిరసన వ్యక్తంచేసేవారు.

నారదుడు, విశ్వామిత్ర, పరశురాముడు, సాయిబాబా, హిట్లర్.. ఇలా ఒకటి కాదు.. ఎన్నో రకాల గెటప్స్ వేసి రాజకీయ సమస్యలపై తన నిరసన తెలియజేసేవారు. ఒకదశలో ఆయన వేసిన ట్రాన్స్ జెండర్ వేషం జాతీయ మీడియాను కూడా ఆకర్షించింది. శివప్రసాద్ మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. జగన్ తో పాటు పలువురు నేతేలు శివప్రసాద్ మృతి పట్ల సంతాపం వ్యక్తంచేస్తున్నారు.