Advertisement

Advertisement


Home > Politics - Political News

తెలంగాణను మళ్ళీ విముక్తి చేయాలా ?

తెలంగాణను మళ్ళీ విముక్తి  చేయాలా ?

భారత దేశం బ్రిటిష్ వారి నుంచి విముక్తి పొందింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కొన్ని ఉమ్మడి రాష్ట్రాలు రెండుగా ముక్కలయ్యాయి. ఇలాంటి రాష్ట్రాల్లో కొన్ని పోరాడి విడిపోయాయి. అంటే విముక్తి పొందాయని అర్థం. అలా విముక్తి పొందిన రాష్ట్రాల్లో తెలంగాణా ఒకటి. 

ఒకప్పుడు వేరువేరుగా ఉన్న తెలంగాణా, ఆంధ్రా ఎలా కలిశాయో, మళ్ళీ ఎలా విడిపోయాయో ఆ చరిత్ర అందరికీ తెలిసిందే. ఆంధ్రోళ్ల పాలన నుంచి, దోపిడీ నుంచి విముక్తి పొంది సొంత పాలనలోకి వచ్చిన తెలంగాణా రాష్ట్రానికి మళ్ళీ విముక్తి కావాలా?

అవును ...కావాలనే అంటున్నాడు మాజీ మంత్రి ఈటల రాజేందర్. విముక్తి పొందిన రాష్ట్రానికి మళ్ళీ విముక్తి ఏమిటీ అనుకుంటున్నారా ? ఎస్ ...కేసీఆర్ పాలన నుంచి విముక్తి కావాలంటున్నాడు ఈటల రాజేందర్. కేసీఆర్ పాలన పోవాలని ఇన్నేళ్లు కాంగ్రెస్, బీజేపీ, ఇంకా కొన్ని ప్రతిపక్షాలు అన్నాయి. 

ఇప్పుడు కేసీఆర్ కు, టీఆర్ఎస్ కు ఈటల కూడా ప్రతిపక్ష నాయకుడే కాబట్టి ఆయన కూడా కేసీఆర్ పాలన ఇక చాలంటున్నాడు. రాష్ట్రాన్ని విముక్తి దిశగా తీసుకెళుతున్నానని ఆయన అంటున్నాడు.

అది ఏ విధంగా అనేది స్పష్టంగా చెప్పలేదు. కేసీఆర్ పాలన నుంచి రాష్ట్రం విముక్తి పొందుతుందా ? లేదా అనేది తరువాత సంగతి. ఈటల మాత్రం ఏవో కసరత్తులు చేస్తున్నాడు. వాళ్ళు వీళ్లూ అనే తేడా లేకుండా అన్ని పార్టీల నాయకులను కలుసుకొని మాట్లాడుతున్నాడు. వాళ్ళు కూడా ఈయనతో చర్చలు జరుపుతున్నారు. ఆ వివరాలేవీ బయటకు తెలియడంలేదు. 

ఈటల ఏ పార్టీ వాళ్ళను కలిస్తే ఆ పార్టీలో చేరబోతున్నాడని మీడియాలో వార్తలొస్తున్నాయి. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లుగా చిత్రీకరిస్తున్నారు. ఈటల కలుసుకున్న పెద్ద తలకాయల్లో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన ధర్మపురి శ్రీనివాస్ అలియాస్ డీఎస్ కూడా ఉన్నాడు. 

ఈయనదో విచిత్రమైన కథ. ఈయన టీఆర్ఎస్ తరపున రాజ్యసభ సభ్యుడు. ఇది సాంకేతికం మాత్రమే. ఆయనకు, పార్టీకి మాత్రం ఎలాంటి సంబంధాలు లేవు . కేసీఆర్ - డీఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటుంది. డీఎస్ కూడా బీసీ నాయకుడే. ఎస్సీ, బీసీ నాయకులనే కేసీఆర్ దూరం పెడతాడనే పేరుంది. 

తనను కలుసుకున్న ఈటలకు డీఎస్ జ్ఞాన బోధ చేశాడు. విలువైన మాటలు చెప్పాడు. నువ్వు భూకబ్జాలు చేశావని కేసీఆర్ తన సొంత మీడియాలో కథనాలు రాయించాడు. ఆగమేఘాల మీద బర్తరఫ్ చేశాడు. దీంతో నీకు ప్రజల్లో విపరీతమైన పలుకుబడి వచ్చింది, నీపట్ల సానుభూతి పెరిగింది. గతంలో ఎవరికీ ఇలా జరగలేదు. దీన్ని నిలుపుకోవాలి. విజ్ఞత ప్రదర్శించాలని చెప్పాడు.

ఈటల తాను కలుసుకుంటున్న నాయకులతో జాగ్రత్తగా ఉండాలని డీఎస్ హితవు చెప్పాడు. కొందరు నిజంగానే అనుకూలంగా ఉంటారని, కొందరు ఉన్నట్లు నటిస్తారని, కొందరు కేసీఆర్ కు తాము కూడా వ్యతిరేకంగా ఉన్నట్లు భ్రమింపచేసి రెచ్చగొడతారని, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని ఈటలకు డీఎస్ పాఠాలు చెప్పాడు. 

ఈ రోజుల్లో ఏ నాయకుడు ఎవరిని కలుసుకుంటున్నాడు, ఏం  మాట్లాడుతున్నాడు అనేది తెలుసుకోవడం కష్టం కాదు. కేసీఆర్ వంటి కాకలు తీరిన నాయకుడికి, గుండెలు తీసిన బంటుకు ఇది చాలా సులభం. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలని ఈటలను డీఎస్ హెచ్చరించాడు. 

కేసీఆర్ మీద పోరాటానికి ఈటలను ఒక ఆయుధంగా ఉపయోగించుకోవాలని బీజేపీ, కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నాయి. టీఆర్ఎస్ లో ఈటల ఎంతో సీనియర్. మంత్రిగా సుదీర్ఘంగా పనిచేశాడు. కాబట్టి ఆయన దగ్గర అనేక రహస్యాలు ఉండొచ్చు. అవసరమైనప్పుడు చెబుతాడు. 

తన దగ్గర చాలా విషయాలున్నాయని ఇదివరకే అన్నాడు. మరి ఈటల ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తాడో, కేసీఆర్ పాలన నుంచి తెలంగాణాకు ఎలా విముక్తి కలిగిస్తాడో చూడాలి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?