Advertisement


Home > Politics - Political News
సింగ‌న్న బ‌య‌లు దేరెనే.. భ‌ళారే

''ఆ దేవుడు శాసిస్తాడు.. ఈ అరుణాచ‌లం పాటిస్తాడు. ర‌జినీకాంత్ హిట్ సినిమా అరుణాచ‌లంలో సూప‌ర్ హిట్ డైలాగ్ ఇది. స‌రిగ్గా ఇలాగే త‌న రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై కూడా ''ఆ దేవుడే నిర్ణ‌యిస్తాడు. ఆయ‌న ఎలా చెప్తే అలా న‌డుచుకుంటా'' అని ఏ విష‌యం తేల్చ‌కుండా నాన్చుతూ వ‌చ్చిన సూప‌ర్‌స్టార్ ఇప్పుడు కాస్త క్లారిటీ ఇచ్చాడు. శుక్ర‌వారం చెన్నైలో అభిమానుల‌తో స‌మావేశంలో త‌న రాజ‌కీయా ఆపేక్ష‌ను బ‌య‌ట‌పెట్టాడు. నువ్వు త‌మిళుడివి కాదు మా రాష్ట్రం విడిచి వెళ్లిపో అన్నార‌ని, కానీ నేను ప‌క్కా త‌మిళుడినే అంటూ సానుభూతి పోగుచేసుకునే మాట‌లు మాట్లాడారు.

అభిమానులు మాత్ర‌మే కాదు ప్ర‌జ‌లంతా ఓట్లేస్తేనే అధికారం వ‌స్తుంది. అభిమానులు ఓట్లేస్తే ఏ ప‌దో ప‌ర‌కో వ‌స్తాయి. వాటిని ప‌ట్టుకుని చిరంజీవి లాగ వేగ‌లేక‌, వ‌దిలేయ‌లేక స‌త‌మ‌త‌మ‌వ్వాలి. ఈ విష‌యం ర‌జినీకాంత్‌కు అర్థ‌మ‌యిన‌ట్టుంది. అందుకే ర‌జినీకాంత్ ప‌క్కా ప్ర‌ణాళిక బ‌ద్దంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. అయితే ప్రాంతీయ భావం న‌ర‌న‌రానే జీర్ణించుకుపోయిన త‌మిళుల్లో రాజ‌కీయాల విష‌యానికి వ‌స్తే త‌న‌ను ప‌రాయి వాడిగానే చూస్తార‌న్న అనుమానం ర‌జినీకాంత్‌కు ఉంది. సినిమాల్లో సూప‌ర్‌స్టార్ అయినా ఒక‌సారి రాజ‌కీయాల్లోకి ఎంట‌ర్ అయ్యాక విష‌యం వేరేలా ఉంటుంది. అస‌లు ర‌జినీ త‌మిళుడే కాదు ఆయ‌న్ని సీఎంగా ఎలా ఒప్పుకుంటాం అంటూ ప్రాంతీయ భావం రెచ్చ‌గొడితే ర‌జినీకి చిక్కులు త‌ప్ప‌వు. అందుకే త‌మిళ‌గ‌డ్డ మీద పుట్టినా, పుట్ట‌క‌పోయినా నేను త‌మిళుడినే అని చెప్పి ర‌జినీకాంత్ త‌న స్థానిక‌త‌ను ప‌దిల‌ప‌రుచుకునే య‌త్నం చేశాడు.

మ‌రోవైపు దేశ రాజ‌కీయాల‌పై కూడా ర‌జినీ ఆసక్తికర వ్యాఖ్య‌లే చేశాడు. రాజ‌కీయాలు అధ్వాన్నంగా త‌యార‌య్యాయ‌ని, దేశం భ్ర‌ష్టుప‌ట్టిపోయింద‌ని, దీన్నిమార్చాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, ప్ర‌జ‌ల్లో కూడా మార్పు రావాల‌ని ఇలా చాలానే చెప్పాడు. దీన్ని బ‌ట్టి అర్థ‌మ‌వుతుందేమిటి.. ఆ మార్పు ర‌జ‌నీకాంత్ ద్వారానే వ‌స్తుంద‌ని, అందుకే ఆయ‌న రాజ‌కీయాల్లోకి రావాల‌ని రేప‌టి నుంచి ఆయ‌న అభిమానులు, శ్రేయోభిలాషులు విన్న‌పాలు మొద‌ల‌వుతాయి. చిరంజీవి స్టైల్‌లోనే మీరు పిలిస్తేనే నేను రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నా త‌ప్ప నాకైతే ప‌ద‌వుల‌పై వ్యామోహం, అధికార మోజు లేవ‌ని చెప్పుకునే ప్ర‌య‌త్నం ఇది. మ‌రోవైపు దేశంలో ఎన్నో జాతీయ‌, ప్రాంతీయ పార్టీలున్నా ప్ర‌జాస్వామ్యం క్షీణించిదంటూ ఆ పార్టీల‌తో ప్ర‌యోజ‌నం లేద‌ని విష‌యం స్ప‌ష్టం చేయ‌డం ద్వారా ఒక‌వేళ రాజ‌కీయాల్లోకి వ‌స్తే కొత్త పార్టీతోనే త‌ప్ప ప్ర‌స్తుత‌మున్న పార్టీల్లో చేరే ప్ర‌స‌క్తే లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టాడు.  

ఈ వ్యాఖ్యాల‌న్నీ చూస్తే ఇక ర‌జినీకాంత్ రాజ‌కీయాల్లోకి రావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. అయితే ఆయ‌న‌లో తొంద‌పాటు ఏమాత్రం క‌నిపించ‌డం లేదు. మెల్ల‌మెల్ల‌గా ఎస్టాబ్లిస్ అయ్యే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. హ‌డావుడిగా వ‌చ్చి ఆర్నెళ్ల‌లోనే సీఎం అయిపోవాలి అనే మిడిసిపాటుతో కాకుండా అనుకూల స‌మ‌యం, ముమెంటు కోసం ఎదురుచూస్తున్నాడు. కొద్ది రోజులు ఇలాగే ఇదిగో వ‌స్తున్నాడు.. అదిగో వ‌స్తున్నాడు అంటూ ప్ర‌జ‌ల్లో నానుతూ, వారి నుంచి వ‌చ్చే స్పంద‌న‌ను ప‌సిగ‌డుతూ ఉండాలి. మ‌రోవైపు క్షేత్ర‌స్థాయిలో ఆర్గ‌నైజ్ అవ్వాలి. ఎన్నిక‌ల స‌మ‌యానికి అంటే 2021 నాటికి ఒక పూర్తిస్థాయి ఆర్గ‌నైజ్డ్ పార్టీగా ఎన్నిక‌లకు వెళ్లే ప్ర‌ణాళిక ఉన్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. 

ఈ ప్ర‌ణాళిక చూస్తుంటే ఇక‌ సింగ‌న్న బ‌య‌లుదేరిన‌ట్టే. మ‌రి ఆయ‌న పాడుకున్న‌ట్టు కాలం క‌లిసి వ‌స్తుందా, యోగం న‌డిచి వ‌స్తుందా అన్న‌ది త‌మిళులు చేతిలో ఉంది.