Advertisement

Advertisement


Home > Politics - Political News

సోము వీర్రాజు.. రిటైర్మెంట్ ప్ర‌క‌ట‌న‌!

సోము వీర్రాజు.. రిటైర్మెంట్ ప్ర‌క‌ట‌న‌!

భార‌తీయ జ‌న‌తా పార్టీ ఏపీ విభాగం అధ్య‌క్షుడు సోము వీర్రాజు వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత రాజ‌కీయ‌రంగం నుంచి వైదొల‌గ‌బోతున్న‌ట్టుగా ప్ర‌క‌టించుకున్నారు. 42 సంవ‌త్స‌రాలుగా త‌ను రాజ‌కీయాల్లో ఉన్న‌ట్టుగా.. త‌ను ఎలాంటి రాజ‌కీయ ల‌క్ష్యాల‌తో ఇన్నాళ్లూ ప‌ని చేయ‌లేద‌ని, ఇక‌పై కూడా అలాంటివి ఏమీ లేవ‌ని ఆయ‌న ప్ర‌క‌టించుకున్నారు. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీ ప్ర‌జ‌లు భార‌తీయ జ‌న‌తా పార్టీకి అవ‌కాశం ఇవ్వాల‌ని ఆయ‌న విన్న‌వించుకున్నారు. త‌నుకు సీఎం కావాల‌ని లేద‌ని కూడా ప్ర‌క‌టించుకున్నారు.

గ‌తంలో త‌న‌కు మంత్రి ప‌ద‌వి అవ‌కాశం వ‌చ్చింద‌ని కూడా సోము వీర్రాజు ప్ర‌క‌టించుకోవ‌డం గ‌మ‌నార్హం. 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా రాజ‌మండ్రి నుంచి పోటీ చేయాల‌ని త‌న‌కే ముందుగా ఆఫ‌ర్ చేశార‌ని, గెలిస్తే మంత్రి ప‌ద‌వి అవ‌కాశం కూడా ఇస్తామ‌ని చెప్పార‌న్నారు. అయితే త‌ను అందుకు ఆస‌క్తి చూప‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే నాటి బీజేపీ నేత ఆకుల స‌త్య‌నారాయ‌ణ‌కు ఎమ్మెల్యే, మంత్రి అవ‌కాశం వ‌చ్చింద‌ని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు.

త‌ను ఎలాంటి రాజ‌కీయ ప‌ద‌వుల‌ను ఆశించ‌డం లేద‌ని చెప్పుకోవ‌డానికి సోము ఈ విష‌యాన్ని చెప్పార‌నుకోవాలి. త‌ను బీజేపీ కార్య‌క‌ర్త‌న‌ని, బీజేపీ కోసమే ప‌ని చేస్తున్న‌ట్టుగా ఈ క‌మ‌లం పార్టీ నేత చెప్పుకున్నారు.

ఎన్నిక‌ల‌కు మూడేళ్ల ముందే సోము రిటైర్మెంట్ ప్ర‌క‌ట‌నను తెలియ‌ప‌ర‌చ‌డం గ‌మ‌నార్హం. సోముకు మ‌రో ట‌ర్మ్ బీజేపీ ఏపీ విభాగం అధ్య‌క్ష ప‌ద‌వి ల‌భిస్తుందా లేదా అనేది కూడా ఆస‌క్తిదాయ‌క‌మే. క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ అనంత‌రం ఆ ప‌ద‌విని చేప‌ట్టిన సోము నాయ‌క‌త్వంలో బీజేపీ ఆశించి ప్ర‌గ‌తి ఏమీ సాధించ‌లేదు. వివిధ ఉప ఎన్నిక‌ల్లో డిపాజిట్ల‌ను రాబ‌ట్ట‌లేక‌పోయింది. స్థానిక ఎన్నిక‌ల్లో అడ్ర‌స్ లేకుండా పోయింది. ఈ విష‌యంలో సోమును అన‌డానికి కూడా ఏమీ లేదు. ఏపీ విభ‌జ‌న‌కు మ‌ద్ద‌తును ఇచ్చిన బీజేపీ, సీమాంధ్ర స‌హిత ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీల‌ను అమ‌లు ప‌ర‌చ‌డానికి ఏ మాత్రం ఆస‌క్తి చూప‌డం లేదు.

ప్ర‌త్యేక‌హోదాను గ‌ల్లంతు చేయ‌డంతో పాటు, పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో కూడా బాధ్య‌త‌ను తీసుకోవ‌డం లేదు. విభ‌జ‌న చ‌ట్టంలో పోల‌వ‌రం ప్రాజెక్టు పూర్తిగా కేంద్రానికే అని పేర్కొన్నా, ఇటీవ‌ల కూడా కాంక్రీట్ వ‌ర్క్ కే డ‌బ్బులు అని ప్ర‌క‌టించుకుంటోంది. నిర్వాసితుల అంశంపై కేంద్రం వైఖ‌రి అసంజ‌సంగా ఉంది. ఇలాంట‌ప్పుడు బీజేపీ ఏపీలో బ‌లోపేతం కావాల‌న్నా ఎలా అవుతుంది?  మోడీని చూసేసి ఓటేసే ప‌రిస్థితి ఏపీలో 2014తోనే పోయింది. ఇలాంటి నేప‌థ్యంలో సోము ఉన్నా, ఆ స్థానంలో మ‌రొక‌రు వ‌చ్చినా.. క‌మ‌లం పార్టీ పుంజుకునే అవ‌కాశాలు మృగ్యంగానే ఉన్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?