Advertisement

Advertisement


Home > Politics - Political News

మెడికల్ హబ్ గా శ్రీకాకుళం...?

మెడికల్ హబ్ గా శ్రీకాకుళం...?

శ్రీకాకుళం ఉమ్మడి ఏపీలోనూ, నవ్యాంధ్రలోనూ కూడా అత్యంత వెనకబడిన జిల్లా. ఈ జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు ఎక్కువగా ఉంటాయి. ఒక విధంగా వలసల జిల్లా అని చెబుతారు.

అటువంటి శ్రీకాకుళం జిల్లా గత ఏడాది కరోనా వేళ కొన్నాళ్ల వరకూ కేసులు లేకుండా జీరో నంబర్ నే కంటిన్యూ చేసింది. ఎపుడైతే లాక్ డౌన్ సడలింపులు ఇచ్చారో నాటి నుంచే ఇతర ప్రాంతాల వలస కార్మికుల రాకతో సిక్కోలు కరోనాకు కేంద్రం అయింది. 

ఇక రెండవ విడతలో కూడా శ్రీకాకుళం జిల్లాలో కేసులు బాగా పెరుగుతున్నాయి. అయితే వెనకబడిన జిల్లా కాబట్టి ఇక్కడ వైద్య సదుపాయాలు పెద్దగా లేవు అని అంతా అనుకుంటారు.

కానీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కుటుంబం మొత్తం శ్రీకాకుళంలోని ఒక ఆసుపత్రిలో చేరి పూర్తి ఆరోగ్యవంతులుగా బయటకు వచ్చారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ కరోనా వచ్చినా కూడా  అద్భుతమైన వైద్య సేవలు అందించేందుకు శ్రీకాకుళం జిల్లా డాక్టర్లు ఉన్నారని చెప్పుకొచ్చారు.

అత్యాధునిక వైద్య సంపత్తి శ్రీకాకుళం జిల్లాకు ఉందని ఆయన అంటున్నారు. చాలా మంది కరోనా రావడంతోనే విశాఖ వంటి ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు కానీ శ్రీకాకుళంలోనే అత్యుత్తమ వైద్యం అందుబాటులో ఉందని ఆయన పేర్కొంటున్నారు. 

ఒక విధంగా చూస్తే శ్రీకాకుళం మెడికల్ హబ్ గా మారిందని, భవిష్యత్తులో ఇక్కడ వైద్య రంగం ఇంకా బాగా స్థిర పడే అవకాశం ఉందని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

మరో వైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా వెనకబడిన ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు మెరుగుపడేలా చర్యలు తీసుకుంటున్నందువల్ల శ్రీకాకుళం లాంటి జిల్లాలకు పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది అని అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?