Advertisement

Advertisement


Home > Politics - Political News

సక్సెస్ ఫుల్ గా సమ్మె.. కింకర్తవ్యం కేసీఆర్!

సక్సెస్ ఫుల్ గా సమ్మె.. కింకర్తవ్యం కేసీఆర్!

మొన్నటివరకు ఒకెత్తు, ఈ ఒక్కరోజు మరోఎత్తు. 15 రోజులుగా సాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె ఈరోజు ఉగ్రరూపం దాల్చింది. జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు.. ఆర్టీసీ కార్మికులకు తోడు ప్రజాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, వాలంటీర్ గ్రూపులు కలిసి రావడంతో ఈరోజు తెలంగాణ అంతటా బంద్ నడుస్తోంది. అంతా కలిసి, అన్ని జిల్లాల్లో మూకుమ్మడిగా బంద్ కు కదిలిరావడంతో జనజీవనం స్తంభించిపోయింది.

సాధారణంగా ఇలాంటి బంద్ లన్నీ ఉదయం నుంచి మధ్యాహ్నం 12 లేదా ఒంటిగంట వరకు నడుస్తాయి. ఆ తర్వాత మళ్లీ మామూలు స్థితికి వచ్చేస్తుంది. కానీ మధ్యాహ్నం దాటినా తెలంగాణలో బంద్ ప్రభావం తగ్గలేదు. చాలామంది స్వచ్ఛందంగా బంద్ కు మద్దతివ్వగా, ప్రభుత్వం నియమించిన తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు కూడా ఈరోజు విధులకు వెళ్లకపోవడంతో.. ఎక్కడి బస్సులక్కడ నిలిచిపోయాయి. దీనికితోడు హైదరాబాద్ లో ఆటోలు, ఓలా, ఉబెర్ లాంటి ప్రైవేటు సర్వీసుల్ని కూడా అడ్డుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ప్రభుత్వం ఎన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా, ఎంతమంది ప్రైవేట్ వర్కర్లను తీసుకున్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా 50-60శాతానికి మించి ఆర్టీసు బస్సులు తిరగలేదు. ఈరోజు అవి కూడా నిలిచిపోయాయి. హైదరాబాద్ తో పాటు దాదాపు ప్రతి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల్ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. మహబూబ్ నగర్, అదిలాబాద్, నల్గొండ జిల్లాల్లోని కొన్ని చోట్ల కార్మికుల సమ్మెకు స్వయంగా పోలీసులే పరోక్షంగా మద్దతు తెలపడం విశేషం.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. కోదండరాంతో సహా పలువురు నేతల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్నిచోట్ల ప్రైవేట్ వాహనాలపై కూడా కార్మికులు దాడి చేయడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. హైదరాబాద్ తో పాటు చాలా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు రాష్ట్రవ్యాప్తంగా బంద్, మరోవైపు హైకోర్టు అక్షింతలతో కేసీఆర్ పూర్తిగా కార్నర్ అయ్యారు. కార్మికుల సమ్మెపై ఇప్పటికే మెత్తబడిన ముఖ్యమంత్రి, వీలైనంత త్వరగా చర్చలు ప్రారంభించాలని నిర్ణయించారు.

సమ్మెపై ఎప్పటికప్పుడు ఆరాతీస్తున్న కేసీఆర్, మంత్రులతో ఓ కమిటీని ఏర్పాటుచేసి చర్చల్ని పునఃప్రారంభించాలని అనుకుంటున్నారు. అయితే కార్మికులు మాత్రం ఈసారి మరింత గట్టిగా వ్యవహరిస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించిన తర్వాతే, ఇతర డిమాండ్లపై చర్చకు వస్తామని తెగేసి చెబుతున్నారు.

సినిమా రివ్యూ: రాజుగారి గది 3

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?