Advertisement

Advertisement


Home > Politics - Political News

నిమ్మ‌గడ్డ‌ను నిరోధించేందుకు మ‌రో ఆయుధం

నిమ్మ‌గడ్డ‌ను నిరోధించేందుకు మ‌రో ఆయుధం

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్‌ను నిరోధించేందుకు జ‌గ‌న్ స‌ర్కార్‌కు మ‌రో ఆయుధం దొరికిన‌ట్టైంది. అది కూడా దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం తాజాగా క‌రోనాపై చేసిన హెచ్చ‌రిక‌లు కావ‌డం గ‌మ‌నార్హం. 

డిసెంబ‌ర్‌లో క‌రోనా మ‌రింత తీవ్ర రూపం దాల్చ‌నుంద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో ప‌రిస్థితులు పూర్తిగా దిగ‌జార‌క ముందే జాగ్ర‌త్త ప‌డాల‌ని సాక్ష్యాత్తు దేశ అత్యున్న‌త న్యాయ స్థానం హెచ్చ‌రించిన నేప‌థ్యంలో ...స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల విష‌యం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం చేస్తున్న వాద‌న‌కు మ‌రింత బ‌లం వ‌చ్చిన‌ట్టైంది.

వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో పంచాయ‌తీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ నాలుగు రోజుల క్రితం త‌న మ‌నోగ‌తాన్ని వెల్ల‌డించ‌డం, ఈ మేర‌కు ప్ర‌భుత్వానికి ప్రొసీడింగ్స్ పంప‌డం తీవ్ర వివాదాస్ప‌ద‌మైంది. రాష్ట్రంలో క‌రోనా తీవ్ర‌త నేప‌థ్యంలో ఫిబ్ర‌వ‌రిలో పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌లేమ‌ని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. 

పంచాయ‌తీ ఎన్నిక‌లకు స‌మాయ‌త్తం చేసేందుకు జిల్లా క‌లెక్ట‌ర్లు, అధికారుల‌తో  వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి లేఖ రాశారు. దీనికి   ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీలం సాహ్ని  ప్ర‌త్యుత్త‌రం ఇచ్చారు.

రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల శాతం ఎక్కువ‌గా ఉంద‌ని, యాక్టివ్ కేసులూ అధికంగానే ఉన్నాయ‌ని ఆమె పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క‌రోనా వ్యాప్తి ఆందోళ‌న క‌లిగిస్తోందని, ఈ ప‌రిస్థితుల్లో ప్ర‌తి అడుగూ ఆచితూచి వేయాల్సి ఉంద‌ని జ‌వాబిచ్చారు.  

చ‌లికాలంలో క‌రోనా విష‌యంలో మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కేంద్ర ప్రభుత్వం ఇప్ప‌టికే హెచ్చ‌రించిన నేప‌థ్యంలో ప్ర‌భుత్వం రిస్క్ తీసుకోడానికి సిద్ధంగా లేమ‌ని కూడా ఆమె స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే క‌రోనాతో 6,890 మంది ప్రాణాలు పోగొట్టు కున్నార‌ని,  మ‌రోసారి క‌రోనా విజృంభిస్తే త‌ట్టుకోవ‌డం క‌ష్టమ‌ని ఆ లేఖ‌లో ప్ర‌భుత్వ వైఖ‌రిని స్ప‌ష్టం చేసిన విష‌యం తెలిసిందే.  

కానీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ మాత్రం ప్ర‌భుత్వ వాద‌న‌తో ఏకీభ‌వించ‌లేదు. ఎన్నిక‌ల తేదీల‌ను ఖ‌రారు చేసే హ‌క్కు త‌మ‌కుంటుం ద‌ని, కేవ‌లం రాష్ట్ర ప్ర‌భుత్వంతో స‌మ‌న్వయం చేసుకోవాల‌ని మాత్ర‌మే సుప్రీంకోర్టు చెప్పింద‌నే వాద‌న‌తో జ‌గ‌న్ స‌ర్కార్‌తో ఘ‌ర్ష‌ణ వైఖ‌రి అవ‌లంబిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న మ‌రోసారి ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై హైకోర్టును ఆశ్ర‌యించాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది.

ఈ నేప‌థ్యంలో క‌రోనాపై సుప్రీంకోర్టు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. క‌రోనాపై స‌మ‌ర్థ‌వంతంగా పోరాడేందుకు వీలుగా కేంద్రం నుంచి ఎలాంటి సాయం కోరుకుంటున్నాయో నివేదిక అంద‌జేయాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం సోమ‌వారం ఆదేశించింది. అది కూడా రెండు రోజులు మాత్ర‌మే రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు   జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, ఆర్‌ఎస్‌ రెడ్డి, ఎంఆర్‌ షా నేతృత్వంలోని ధర్మాసనం గ‌డువు ఇచ్చింది.

‘ఈ నెలలో కరోనా కేసులు భారీ స్థాయిలో పెరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాబట్టి ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితిపై రాష్ట్రాలన్నీ నివేదిక అందజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మహమ్మారిపై యుద్ధానికి పూర్తిస్థాయిలో సన్నద్ధం కాకపోతే డిసెంబరులో అత్యంత ఘోరమైన, విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని ధర్మాసనం హెచ్చ‌రించ‌డం , క‌రోనాపై జ‌గ‌న్ స‌ర్కార్ నిమ్మ‌గ‌డ్డ‌కు రాసిన లేఖ‌లో వ్య‌క్తం చేసిన‌ ఆందోళ‌న స‌రైందే అని అర్థ‌మ‌వుతోంది.

ఈ నేప‌థ్యంలో నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించినా జ‌గ‌న్ స‌ర్కార్‌కు సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు ఎంతో మేలు చేసేవిగా ఉన్నాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎందుకంటే స‌ర్వోన్న‌త న్యాయ‌స్థాన‌మే క‌రోనాపై అప్ర‌మ‌త్తం గా ఉండాల‌ని హెచ్చ‌రించ‌డంతో పాటు కేంద్రం నుంచి ఎలాంటి సాయం కావాలో నివేదిక స‌మ‌ర్పించాల‌ని ఆదేశించ‌డం గ‌మ‌నార్హం.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లను ఇప్ప‌ట్లో నిర్వ‌హించ‌లేమ‌ని, ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డిన త‌ర్వాత తామే తెలియ‌జేస్తామ‌ని నిమ్మ‌గ‌డ్డకు రాసిన ప్ర‌త్యుత్త‌రంలో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స్ప‌ష్టంగా పేర్కొనడం ఎంత స‌ముచితమో సుప్రీంకోర్టు తాజా ఆదేశాలే ప్ర‌తిబింబిస్తున్నాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

ఇప్ప‌టికైనా నిమ్మ‌గ‌డ్డ ప‌ట్టింపుల‌కు పోకుండా, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌పై పున‌రాలోచిస్తారా?  లేక తాను ప‌ట్టిన కుందేలుకు మూడే కాళ్ల‌ని అంటారా? అనేది కాల‌మే జ‌వాబు చెప్పాల్సి వుంది.

రోజూ పొద్దున్నే బంగారం తింటున్నా

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?