cloudfront

Advertisement


Home > Politics - Political News

టి.కాంగ్రెస్ లో తీవ్ర గందరగోళం!

 టి.కాంగ్రెస్ లో తీవ్ర గందరగోళం!

అదిగో ఇదిగో.. రేపటిలోగా సీట్ల సర్దుబాటు పూర్తి అవుతుంది.. అన్ని స్థానాలకూ కలిసి అభ్యర్థులను ఒకేసారి ప్రకటించేస్తాం.. మూకుమ్మడిగా అభ్యర్థులను ప్రకటిస్తాం.. అంటూ హడావుడి చేస్తున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇది వారం పదిరోజుల నుంచి నడుస్తున్న ముచ్చటే ఇది.

ఇక నామినేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కాబోతోంది. ఇలాంటి నేపథ్యంలో కూడా మహాకూటమిలో సీట్ల సర్దుబాటు పూర్తి కాకపోవడం విశేషం. కూటమికి పెద్దన్నగా చలామణి అవుతున్న కాంగ్రెస్ ఈ పరిణామాన్ని ఎలా చూస్తోందో కానీ.. ఆ పార్టీ అభిమానుల్లో మాత్రం టెన్షన్ పెరిగిపోతోంది.

అందుకు కారణాలున్నాయి. అవతల తెరాస అభ్యర్థులను ఖరారు చేసుకుని దూసుకుపోతోంది. అయితే కాంగ్రెస్ శ్రేణుల్లో ఈ కూటమి ఏర్పాటు గందరగోళమే ఉంది. ఇదే పెద్ద గందరగోళం అనుకుంటే.. అవతల ఇంకో పెద్ద గందరగోళం అభ్యర్థుల ప్రకటన.

కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి పీఠం కోసం ఎంతమంది అభ్యర్థులున్నారో.. కొన్ని నియోజకవర్గాల్లో టికెట్ల విషయంలో అంతేమంది ఆశావహులున్నారు. వారిలో ఒకరికి టికెట్ ఇస్తే మరొకరు అలిగే పరిస్థితి. ఒకరికి టికెట్ ఖరారు చేస్తే ఇద్దరు ముగ్గురు రెబల్స్ తయారయ్యే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ముందస్తుగా అభ్యర్థులు ఖరారు అయితే.. అసంతృప్తులను బుజ్జగించడానికి ముఖ్యనేతలకు కాస్త సమయం దొరుకుతుంది.

టికెట్ కోసం ఆశించిన వాడు అది దక్కకపోతే ఆ ఆవేశంలో వెళ్లి నామినేషన్ వేసేస్తాడు. అలాంటి వారిని బుజ్జగించడం మొదలుపెడితే.. సర్ధి చెప్పాడానికి వారం పదిరోజుల సమయం పట్టవచ్చు. ఆ లోపు వారిలోనూ ఆవేశం తగ్గవచ్చు.

తెరాస అధినేత కేసీఆర్ ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. కాంగ్రెస్ కు ఇంత సీన్ లేదు కదా. అందుకే ఇప్పటికీ అభ్యర్థుల ప్రకటన లేదు. అటు సీట్ల ఒప్పందమూ ఒక కొలిక్కి రాలేదు. నామినేషన్లకు సమయం వచ్చేస్తున్నా.. అభ్యర్థుల ఖరారు లేదు. అసలే అంతర్గత విబేధాలు పీక్స్ లో ఉండే పార్టీలో ఈ పరిణామాలు మరింత ఆందోళనకరంగా మారాయి!

ఎన్టీఆర్ తప్పులేదు.. అంతా డైరెక్టర్లదే.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్