cloudfront

Advertisement


Home > Politics - Political News

ఏపీ ఎన్నికలపై తలసాని అంచనాలివి?

ఏపీ ఎన్నికలపై తలసాని అంచనాలివి?

ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై తనదైన విశ్లేషణ ఇచ్చారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎల్లో మీడియా చెబుతున్నదంతా అబద్ధమని, బాబులో డొల్లతనం ఏపీ ప్రజలకు తెలిసిపోయిందంటున్నారు. ఈసారి వైసీపీ రావడం గ్యారెంటీ అనేది తలసాని మాట.

నేను చెబుతున్నాను రాసి పెట్టుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 120 నుంచి 130 సీట్లు గెలుస్తుంది. 20 నుంచి 22 లోక్ సభ సీట్లు గెలుస్తారు. ఈసారి టీడీపీకి పరాభవం తప్పదు. అసలు ఏం చేశారని టీడీపీకి ఓటేయాలో చెప్పాలని చంద్రబాబును డిమాండ్ చేశారు తలసాని.

ప్రచారంలోకి వెళ్లినప్పుడు ఎవరైనా పరిపాలన గురించి, అభివృద్ధి గురించి చెప్పుకుంటారని..  చంద్రబాబు మాత్రం కేసీఆర్ గురించి, వివేక హత్య గురించి తప్ప మాట్లాడ్డం లేదన్నారు. ఇదేనా రాజకీయం, ఇవేనా తెలివితేటలు అని ప్రశ్నించారు.

"ఎన్నికలు వస్తున్నాయని చెప్పి పసుపు-కుంకుమ డబ్బులు ఇస్తున్నావ్. అన్నదాత సుఖీభవ అంటూ నెల నుంచి రైతలకు డబ్బులిస్తున్నావ్. నిరుద్యోగ భృతి స్టార్ట్ చేశాడు. ఇవన్నీ ఐదేళ్ల నుంచి ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నావు. ఏపీ ప్రజలు అంత అమాయకంగా కనిపిస్తున్నారా నీకు."

బాబును బీసీలు ఎవరూ నమ్మరంటున్నారు తలసాని. బీసీల్లో చైతన్యం వచ్చిందని... బాబు డొల్లతనం మొత్తం తెలిసిపోయిందన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి, దొంగలా విజయవాడ పారిపోయిన చంద్రబాబు, ఇప్పుడు ఉమ్మడి రాజధాని గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రత్యేకహోదా అంశంపై కూడా బాబును ఎండగట్టారు.

"ఏపీకి రాష్ట్రానికి అందరికంటే ఎక్కువ నిధులు వచ్చాయని స్వయంగా అసెంబ్లీలో చెప్పావ్. ప్రత్యేకహోదా ఏమైనా సంజీవనా, మాట్లాడితే జైళ్లో పెడతా అని నువ్వే అన్నావు. ఈరోజు మళ్లీ దొంగ మాటలు చెబుతున్నావు. ఏపీలో సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు. నీ వల్ల కాదు. నీతిగా బతికానని, నిప్పుగా ఉన్నానని చెప్పుకుంటున్నావ్. నీ నీతి, నిప్పు మాకు తెలుసు. నీ బతుకేంటో, నీ చరిత్ర మొత్తం మాకు తెలుసు."

ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు తిరిగి హైదరాబాద్ కే రావాల్సి ఉంటుందన్నారు తలసాని. హైదరాబాద్ లో బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకున్నారని, అక్కడికి వచ్చిన తర్వాత సంగతి తేలుస్తామని హెచ్చరించారు. 

సీమ సింహం ఎవరు? ఫిరాయింపుల ప్రభావం ఎంత?