cloudfront

Advertisement


Home > Politics - Political News

టీడీపీ, జనసేన.. నువ్వంటే నువ్వు!

టీడీపీ, జనసేన.. నువ్వంటే నువ్వు!

ఒక దాన్నొకటి దెప్పి పొడుచుకుంటున్నాయి జనసేన, టీడీపీలు. నువ్వు నీతిమాలిన దానివి అంటే.. నువ్వు నీతిమాలిన దానివి అంటూ ఈ రెండుపార్టీలూ విమర్శించుకుంటున్నాయి. ఒకరి బొక్కలను మరొకరు వెతికి నీతులు చెబుతున్నాయి ఈ రెండు పార్టీలు.

ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కలవగానే జనసేన అధిపతి పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. బాబుకు రాజకీయ నైతికత అనేది ఏమీలేదన్నట్టుగా పవన్ స్పందించాడు. తెలుగుదేశం పార్టీ వెళ్లి కాంగ్రెస్ తో జతకలవడాన్ని పవన్ తీవ్రంగా తప్పుపట్టాడు.

అయితే ఈ విషయంలో టీడీపీ వెంటనే కౌంటర్ ఇచ్చింది. గత ఎన్నికల సమయంలో నువ్వు మాకు మద్దతు పలికావు పవన్ కల్యాణ్, ఇప్పుడేమో సొంతంగా వెళ్తానని అంటున్నావు. నువ్వు మారగా లేనిది మేంమారితే తప్పా? అని తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది.

మాది అనైతికం అయితే.. నీది అనైతికం కాదా? అని టీడీపీ ప్రశ్నించింది. ఆ తర్వాత ఇరుపార్టీల మధ్యనా ఫ్లెక్సీ వార్ మొదలైంది. ఒకరు నీతి తప్పిన వైనాన్ని మరొకరు ఎద్దేవా చేసుకుంటున్నారు. కాంగ్రెస్, టీడీపీల పొత్తుపై జనసేన నుంచి ఇంకా విమర్శలు కొనసాగుతున్న తరుణంలో.. టీడీపీ నుంచి కూడా కౌంటర్లు కొనసాగుతూ ఉన్నాయి.

పవన్ కల్యాణ్ అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశాడు. అప్పుడేమో కాంగ్రెస్ పార్టీ అంటరాని పార్టీ కాదు, ఇప్పుడేమో అంటరాని పార్టీనా.. అంటూ కాంగ్రెస్ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ఇక పవన్ కల్యాణ్ మరో విషయాన్ని ఎత్తుకున్నాడు.

నోట్లరద్దును చంద్రబాబు నాయుడు మొదట్లో సమర్థించాడని, తన సలహా మేరకే మోడీ నోట్లను రద్దు చేశాడని అప్పట్లో బాబు అన్నాడని.. ఇప్పుడు మాత్రం నోట్లరద్దును తప్పుపడుతున్నాడని బాబును ఎద్దేవా చేశాడు పవన్. మరి దీనికి టీడీపీ ఏమని కౌంటర్ ఇస్తుందో!

ఆ టికెట్ల విషయంలో కుటుంబ పోరు!... చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్