cloudfront

Advertisement


Home > Politics - Political News

ప్రెస్ మీట్ పెట్టి తిడితే సరిపోయేది కదా!

ప్రెస్ మీట్ పెట్టి తిడితే సరిపోయేది కదా!

ఢిల్లీలో చంద్రబాబు దీక్షలో ఏం జరిగింది? అంటే.. రొటీన్ గానే జరిగింది. ఆదివారం రోజున చంద్రబాబు నాయుడు ఒక  ప్రెస్ నోట్ విడుదల చేశారు. అందులో ఉన్న పదాలకూ.. ఢిల్లీలో బాబుగారి ప్రసంగానికి ఏ మాత్రం తేడా లేదు. బీజేపీని తిట్టారు.. మోడీని తిట్టారు.. ఆదివారం చేసింది అదే, సోమవారం చేసింది అదే. ఇలాగంటే గత ఐదారు నెలలుగా రోజూ ఇదే కథ కదా. 

మోడీ మళ్లీ ప్రధాని కావాలి.. మోడీ మహానుభావుడు.. రాష్ట్రానికి గొప్పగా సాయం చేశారు.. మిగతా రాష్ట్రాల కన్నా ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చారు.. అంటూ అసెంబ్లీలో తీర్మానం సైతం ప్రవేశ పెట్టిన బాబు ఐదారు నెలలుగా ఎన్నికల టెన్షన్ తో మోడీని తిడుతున్నారు. తనమీద ప్రబలిన వ్యతిరేకతను అంతా మోడీ మీద మళ్లించేసి.. ఈసారి ఎన్నికలను ఎదుర్కొనాలనే ప్లాన్ అమలు చేస్తూ ఉన్నారు.

అందుకే ప్రత్యేకహోదా విషయంలో తను మాట్లాడిన గత మాటలన్నింటినీ మరిచిపోయేలా.. రోజూ హోదా కావాలని, అన్యాయం జరిగిందని అంటారు. ఇదే గొబెల్స్ సిద్ధాంతం. చంద్రబాబుకు బాగా వంటపట్టిన వ్యవహారం ఇది. ఇక ఢిల్లీలో బాబుగారి దీక్షా శిబిరానికి వివిధ పార్టీల నేతలు వచ్చారు.. వారంతా మోడీని నానా రకాలుగా తిట్టి వెళ్లారు. ఇప్పుడు మోడీ వాళ్లకు పడటంలేదు కాబట్టి తిట్టి వెళ్లారు.

రేపు వీళ్లే అధికారంలోకి వస్తే.. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తారా? అసలు ఇవ్వనిస్తారా? రాష్ట్రానికి ప్రత్యేకహోదా విషయంలో సపోర్ట్ అని.. తమిళనాడుకు చెందిన డీఎంకేతో చంద్రబాబు ప్రకటన చేయించగలరా? జేడీఎస్ తో ఔను అనిపించగలరా? కర్ణాటక కాంగ్రెస్ నేతలతో చెప్పించగలరా? అంతవరకూ ఎందుకు ఢిల్లీలో బాబుగారితో భుజాలు రాసుకున్న ప్రాంతీయ పార్టీల నేతలంతా.. ఏపీకి అన్యాయం జరిగిందని ఏదో ఒకమాట అని వెళ్లారు.

మేం అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేకహోదాను ఇస్తామని.. జాయింటుగా ఏదైనా ఉమ్మడి ప్రకటన చేశారా? ఆఖరికి రాహుల్ గాంధీ కూడా ఆ హామీని పడేయలేదు! వచ్చారు.. మోడీని తిట్టారు.. వెళ్లారు! ఇదీ కథ. బాబు ఇలాంటి ప్రోగ్రామ్స్ ను తన పార్టీ ఫండ్ తో పెట్టుకుని ఎవరికీ బాధలేదు.

ఒక ప్రెస్ మీట్ పెట్టి తిడితే పోయేదానికి, ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి దుమ్మెత్తిపోస్తే సరిపోయేదానికి.. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా ఉంది!