cloudfront

Advertisement


Home > Politics - Political News

మూల్యం చెల్లించుకుంటున్న మంత్రులు

మూల్యం చెల్లించుకుంటున్న మంత్రులు

మొన్నటివరకు మోనార్కులు. ఆడింది ఆట, పాడింది పాట. కన్నుమిన్ను చూడకుండా గెంతులేశారు. ఇష్టమొచ్చినట్టు పరిపాలన సాగించారు. అవినీతి అనే పదం కూడా చిన్నబోయేలా వ్యవహరించారు. ఇప్పుడు వాళ్లంతా తగినమూల్యం చెల్లించుకుంటున్నారు. అవును.. ఏపీలో మంత్రులు మొదటి రౌండ్ కే ఘోర పరాభవం దిశగా దూసుకుపోతున్నారు.

ఒకరు కాదు, ఇద్దరు కాదు.. టీడీపీకి చెందిన కీలకమైన మంత్రులంతా ఇప్పుడు వెనుకంజలో ఉన్నారు. వాస్తులు, సర్వేలు చూసుకొని మరీ నియోజకవర్గాన్ని ఎంచుకున్న గంటా శ్రీనివాసరావుకు ఈసారి పరాభవం తప్పదు. వైజాగ్ నార్త్ నియోజకవర్గంలో గంటా శ్రీనివాసరావు పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఆ స్థానంలో వైసీపీ అభ్యర్థి కన్నపరాజు దూసుకెళ్తున్నారు.

గంటా మాత్రమేకాదు.. నెల్లూరు సిటీ నుంచి నారాయణ, సర్వేపల్లిలో సోమిరెడ్డి పరిస్థితి కూడా ఇలానే తయారైంది. మొదటి రౌండ్ ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ కంటే బాగా వెనకబడి ఉన్నారు నారాయణ. అటు సర్వేపల్లిలో కూడా సోమిరెడ్డి పక్కకు తప్పుకొని కాకానికి దారిచ్చారు.

ఇక ఉత్తరాంధ్రలో నేనే కీలకం అంటూ గొప్పలు చెప్పుకునే అచ్చెన్నాయుడు కూడా వెనకంజలో ఉన్నారు. టెక్కలి నియోజకవర్గంలో అచ్చెన్నాయుడుపై పేరాడ తిలక్ ఆధిపత్యం కనిపిస్తోంది. ఇలా టీడీపీకి చెందిన పలువురు మంత్రులు ప్రస్తుతం వెనుకంజలో ఉన్నారు.