Advertisement


Home > Politics - Political News
అవమానం నుంచి టీడీపీ పుట్టిందా?

టీడీపీని నటరత్న నందమూరి తారక రామారావు స్థాపించారనే విషయం అందరికీ తెలుసు. కాంగ్రెసు పార్టీ కారణంగా తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతింటోందని ఆగ్రహించి అరవై ఏళ్ల వయసులో 1982మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించారని, ఆ తరువాత కేవలం తొమ్మిది నెలల్లోనే ఎన్నికల్లో అఖండ విజయం సాధించి అధికారంలోకి వచ్చారని చెప్పుకుంటున్నాం. ఎన్టీఆర్‌ కేబినెట్లో మంత్రిగా ఉంటూ వెన్నుపోటు పొడిచి నెలరోజులపాటు అధికారం చెలాయించిన నాదెండ్ల భాస్కరరావు టీడీపీ తన మానస పుత్రికని (బ్రెయిన్‌ ఛైల్డ్‌), తాను పెట్టిన పార్టీలోనే ఎన్టీఆర్‌ చేరారని తన ఆత్మకథలో రాశారు. టీడీపీ ఎలా పుట్టిన వైనం వివరించారు.

1982 ఏప్రిల్‌ 11న ఆంధ్రప్రభ దినపత్రిక ఎన్‌టిఆర్‌తో సుదీర్ఘమైన ఇంటర్వ్యూ చేసి ప్రచురించింది. ఇంటర్వ్యూకు ముందు రాసిన ఇంట్రోలో ఇలా రాశారు. ''ఏడాది కిందట ఎన్‌టిఆర్‌ జన్మదినోత్సవం సందర్భంగా ఆంధ్రదేశంలోని ఎన్‌టిఆర్‌ అభిమాన సంఘాలవారు తమ అభిమాన నటుడికి ఒక విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు.

ఇక ఏమాత్రం తాత్సారం చేయకుండా వెంటనే క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించాలని వారు ఆయన్ని కోరారు. తన నిర్ణయాన్ని షష్టిపూర్తినాడు ప్రకటిస్తానని ఆయన చెప్పారు. అక్కడి నుంచి ఆంధ్రదేశంలో ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. త్వరలోనే ఎన్‌టిఆర్‌ ప్రాంతీయ పార్టీ పెట్టనున్నారని, రాష్ట్ర నాయకత్వం మారడానికి కూడా ఇదే తరుణమని ఆంధ్రప్రభ ప్రముఖంగా ప్రచురించిన వార్త సంచలనం సృష్టించింది.

ఆ తరువాత మద్రాసులో 'కొండవీటి సింహం' విజయోత్సవంలో ఎన్‌టిఆర్‌ ప్రసంగిస్తూ 'ప్రేక్షకుల ఆదరాభిమానాలు నన్ను ముగ్ధుడిని చేస్తున్నాయి. ప్రేక్షకుల ఆదరణ ఉన్నంతకాలం రిటైర్‌ కాను' అని ప్రకటించారు. ఊహాగానాలు సందిగ్ధావస్థలో పడ్డాయి. కాని... మార్చి 21న ఎన్‌టిఆర్‌ తన రామకృష్ణా సినీ స్టూడియోస్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజాసేవా రంగంలో ప్రవేశించడానికి నిర్ణయించుకున్నానని ప్రకటించారు.

అప్పట్లో ఆయన ప్రాంతీయ పార్టీని పెడుతున్నానని చెప్పలేదు. ఒక సంస్థను మాత్రమే ఏర్పాటు చేస్తున్నానని చెప్పారు. ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇందిరా కాంగ్రెసులో ముసలం పుట్టింది. ఆ మర్నాడే ఇద్దరు హరిజన ఎమ్మెల్యేలు కాంగ్రెసుకు రాజీనామా చేశారు. ఒకరోజు గడిచిందో లేదో రాష్ట్ర రాజకీయాల్లో  ప్రముఖుడు, మాజీ మంత్రి నాదెండ్ల భాస్కరరావు కూడా కాంగ్రెసుకు గుడ్‌బై చెప్పారు. మార్చి 29న ఎన్‌టిఆర్‌ తన పార్టీకి 'తెలుగుదేశం' అని నామకరణం చేశారు'' ఆ రోజుల్లో ఆంధ్రప్రభ చేసిన ఇంటర్వ్యూలో ఎన్‌టిఆర్‌ అనేక విషయాల గురించి చెప్పారు.

''రాజకీయాల్లో దిగమని లోగడ నన్ను కొందరు చాలాసార్లు కోరారు. జాతీయ రక్షణనిధి సేకరణ కోసం మేము ఊరూరా ప్రదర్శనలిస్తున్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిగారు కూడా రాజకీయాల్లోకి మీరెందుకు ప్రవేశించకూడదు అని అడిగారు. కాని అప్పట్లో నాకా ఉద్దేశం లేదు. కొంతకాలం కిందట నేను సర్దార్‌ పాపారాయుడు చిత్రంలో నటిస్తున్నప్పుడు మొదటిసారిగా నాలో ఈ ఆలోచన మొలకెత్తింది. ఆ చిత్రంలో ఉన్న దేశభక్తి సన్నివేశాలు నన్ను ప్రభావితుడిని చేశాయి. భారతదేశంలో ఎక్కడ చూసినా అవినీతి, అరాచకాలు, దొంగతనాలు, దోపిడీలు, మానభంగాలు. సామాన్యుడి ప్రాణాలకు భద్రత లేకుండా పోయింది. ఈ పరిస్థితి నుంచి మనకు విముక్తి లేదా? ఒక వ్యక్తిగా నేను ఈ సమస్యలను పరిష్కరించడం అసాధ్యం.

అదే ఒక పార్టీ అయితే నిజాయితీగల కార్యకర్తలు, యువజనుల సహకారంతో ఈ ఇక్కట్లను గట్టెక్కవచ్చు. ఆ ఉద్దేశంతోనే నేను తెలుగుదేశం పార్టీ స్థాపించాను.'' అని వివరించారు ఎన్‌టిఆర్‌. పార్టీ పెట్టడానికి అసలు కారణం ఇదేనా మరొకటి ఏమైనా ఉందా? ఈమధ్య ఎన్టీఆర్‌ మీద తీస్తున్న బయోపిక్‌ల గురించి చారిత్రక నవలా చక్రవర్తిగా పేరు తెచ్చుకున్న ప్రొఫెసర్‌ ముదిగొండ శివప్రసాద్‌ ఓ పత్రికలో చిన్న వ్యాసం రాశారు. ఎన్టీఆర్‌ జీవితంలోని అతి ముఖ్యమైన సంఘటనంటూ టీడీపీ ఆవిర్భావానికి దారితీసిన ఎపిసోడ్‌ గురించి రాశారు. దీని ప్రకారం ఓ సందర్భంలో తనకు వ్యక్తిగతంగా అవసమానం జరగడంతో ఆగ్రహించిన ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించారు. ఆగ్రహం కలిగితే రాజకీయ పార్టీ పెట్టడమెందుకు?

అవమానం జరిగింది కాంగ్రెసు ప్రభుత్వంలోని మంత్రి కారణంగా. కాబట్టి ఆ పార్టీని భూస్థాపితం చేయాలనే పట్టుదలతో టీడీపీ పెట్టారు. ఈ ఘటన జరిగినప్పుడు భవనం వెంకట్రామ్‌ సీఎంగా ఉన్నారు. ఆయన ఎన్టీఆర్‌కు క్లోజ్‌ ఫ్రెండ్‌. ఆయన మంత్రివర్గంలో నెల్లూరు జిల్లా కాంగ్రెసు నాయకుడు నేదురుమల్లి జనార్ధన్‌ రెడ్డి కేబినెట్‌ మినిస్టర్‌గా ఉన్నారు. ఒకసారి ఎన్టీఆర్‌కు నెల్లూరులో సన్మానం ఏర్పాటు చేసినప్పుడు దానికి జనార్ధన్‌ రెడ్డి హాజరయ్యారు. మద్రాసు నుంచి కారులో నేరుగా నెల్లూరుకు వచ్చిన రామారావు ముఖం కడుక్కొని ఫ్రెషప్‌ అయ్యేందుకు బాత్‌రూముకు వెళ్లారు. అది చూసిన మంత్రికి కోపం వచ్చింది.

'ఈ సినిమావాడికి నాకు ఇచ్చిన స్ట్‌హౌస్‌లోని బాత్‌రూంలోకి వెళ్లేందుకు ఎంత ధైర్యం?' అని ఆగ్రహంతో అన్నారు. ఈ మాటలు చెవిన పడటంతో ఎన్టీఆర్‌ ఏమీ తినకుండానే, యాంత్రికంగా సన్మాన కార్యక్రమం ముగించుకొని మద్రాసుకు వెళ్లిపోయారు. ఆ మర్నాడు ఆంతరంగికులను పిలిచి మంతనాలు జరిపారు. అదే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి మలుపు. కాంగ్రెసు వ్యతిరేక దృక్పథంతో, తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో ఆ పార్టీ అవతరించింది. వ్యక్తిగతంగా తనకు జరిగిన అవమానాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎన్టీఆర్‌ కాంగ్రెసు పార్టీని కూకటివేళ్లతో సహా కూల్చివేశారు.

-ఎం.నాగేందర్‌