Advertisement


Home > Politics - Political News
పొత్తు పెట్టుకోండి... ప్రయోజనం పొందండి..!

'బాబూ.. నాయనా మంచి అవకాశం. త్వరపడండి. ఇలాంటి ఛాన్స్‌ మళ్లీ రాదు'.. అంటూ కొన్ని వ్యాపార సంస్థలు ఊరూ వాడా ప్రచారం చేస్తుంటాయి. తెలంగాణలో టీడీపీ ఇలాంటి ప్రచారమే చేస్తోంది. ఎమ్మెల్యేల్లో ఇద్దరు మినహా మిగతావారంతా అధికార పార్టీలో చేరిపోయినా తాను ఇప్పటికీ 'బాహుబలి' నేనని చెప్పుకుంటున్న టీడీపీ వచ్చే ఎన్నికల్లో ఏం చేయాలో అర్థంకాక అయోమయంలో ఉంది.

ఈ అయోమయం బయటకు కనబడకుండా 'మా తాతలు నేతులు తాగారు.. మా మూతులు వాసన చూడండి' అన్న తీరుగా వ్యవహరిస్తోంది. పార్టీ అధ్యక్షుడు రమణ, పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు, మరో ఇద్దరు ముగ్గురు నేతలు టీడీపీకి రాష్ట్రంలో బ్రహ్మాండమైన బలముందని చెప్పుకుంటూవుంటారు. ఆంధ్రాలో కత్తి అంచు మీద నిల్చున్నట్లుగా టీడీపీ-బీజేపీ పొత్తు కొనసాగుతుండగా, తెలంగాణలో అది ఏనాడో పెటాకులైంది. ఇక టీడీపీతో పొత్తు పెట్టుకునేదెవరు?

టీఆర్‌ఎస్‌తో కలుస్తుందని జరిగిన ప్రచారంలో ఎంతవరకు నిజముందో తెలియదు. మొత్తానికి టీడీపీకీ తోడు కావాలి. అయితే ఆ పార్టీ  నేతలు ఈ విషయాన్ని రివర్సులో చెబుతున్నారు. టీడీపీతో ఏ పార్టీ పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీకి ప్రయోజనం కలుగుతుందని తాజాగా మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఆయన చెప్పిందాన్నిబట్టి చూస్తే టీఆర్‌ఎస్‌ ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తూనే ఉంది. కేసీఆర్‌ పార్టీకి గత ఎన్నికల్లో 63సీట్లు మాత్రమే వచ్చాయని, ఈసారి 70స్థానాలకు మించవని, అది ఒంటరిగా పోటీ చేస్తే పరిస్థితి అధ్వానంగా ఉంటుందని అన్నారు. అంటే టీఆర్‌ఎస్‌-టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాలని ఆయన కోరుకుంటున్నారన్నమాట.

ఒకవేళ పొత్తు పెట్టుకున్నారనుకుందాం. అప్పుడు టీఆర్‌ఎస్‌ కంటే టీడీపీకే ఎక్కువ ప్రయోజనకరం. గులాబీ పార్టీ ప్రభావంతో సైకిల్‌ పార్టీ కొన్ని సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుంది. అయినా ఆంధ్రా పార్టీగా ముద్ర వేసిన టీడీపీతో పొత్తు ఎలా ఉంటుంది? ఇది సాధ్యమేనా? తెలంగాణ టీడీపీ నేతలకు ఓ ఊతపదముంది. లీడర్లు పార్టీ ఫిరాయించినా కేడర్‌ ఎక్కడికీ పోలేదని అంటుంటారు. మరి కేడర్‌ ఉన్నప్పుడు ఓట్లు పడాలి కదా. విభజన తరువాత తెలంగాణలో జరిగిన ఏ ఎన్నికల్లోనూ టీడీపీ గెలవలేదు. అయినప్పటికీ తమ పార్టీకి ఆదరణ తగ్గలేదని, చంద్రబాబు నాయకత్వంపై ఇక్కడి ప్రజలకు ఎంతో విశ్వాసం ఉందన్నారు మోత్కుపల్లి.

చంద్రబాబు ఒక్కసారి రాష్ట్రంలో పర్యటించి సమరశంఖం ఊదితే చాలు తమ సత్తా చూపిస్తామంటున్నారు సైకిల్‌ పార్టీ నాయకులు. ఆయన హైదరాబాదు వచ్చి రెండు మూడు గంటలు గడపడమే కష్టంగా ఉన్నప్పుడు రాష్ట్రమంతా తిరిగే ఓపిక, సమయం ఉన్నాయా? అలా తిరిగితే కేసీఆర్‌ ఊరుకుంటారా? నోటుకు ఓటు కేసు కత్తి ఇంకా బాబు మెడపై వేలాడుతతూనే ఉంది. ఈ పరిస్థితిలో ఆయన రాష్ట్రంలో తిరగడం అసంభవం. కొంతకాలం కిందట పార్టీ అధ్యక్షుడు రమణ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని, వస్తే ఫలానా సామాజికవర్గాలకు మంత్రి పదవులు ఇస్తామని చెప్పారు. ఆ పరిస్థితి, అందుకు అవకాశాలున్నాయా?

ఈ నాయకుడు ఎందుకిలా పగటి కలలు కంటున్నారో తెలియదు. రమణ ఓ సభలో మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రితోపాటు తొమ్మిది మంత్రి పదవులూ బీసీలకే ఇస్తామన్నారు. ఇద్దరు ఎస్సీలకు, ఒక మైనారిటీకి మంత్రివర్గంలో చోటు కల్పిస్తామన్నారు. ముగ్గురు మహిళలకూ అవకాశం ఇస్తారట. నిబంధనల ప్రకారం పదిహేడుమందికే మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి యాభై నుంచి అరవైమంది ఎమ్మెల్యేలుగా గెలవాలన్నారు.

'మొత్తం 119 స్థానాలకూ అభ్యర్థులను నిలబెడతాం' అని ఒకసారి, ఒంటరిగా పోటీ చేస్తామని మరోసారి అన్నారు. పొత్తుల విషయంలో అంతిమ నిర్ణయం చంద్రబాబుదే. పొత్తు పెట్టుకున్నా, ఒంటరిగా పోటీ చేసినా అధికారం సంపాదించేటన్ని స్థానాలు రావు. అలాంటప్పుడు మంత్రి పదవుల గురించి మాట్లాడితే ప్రహసనంగా మారుతుందే తప్ప ఎలాంటి ప్రయోజనమూ ఉండదు.